టీజీ టి20పై యువ క్రికెటర్ నోమాన్
మెదక్ ఫాల్కన్స్ తరఫున బరిలోకి
సాక్షి, హైదరాబాద్: గ్రామీణ నేపథ్యం, సాధారణ రైతు కుటుంబం, ఇప్పుడు బతుకుతెరువు కోసం ఒక దుకాణంలో పని చేయాల్సిన స్థితి... అయినా సరే ఆ అబ్బాయి క్రికెట్‌పై మక్కువతో పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాడు. సరైన వేదికపై తనను తాను నిరూపించుకొని మున్ముందు పైకి ఎదగాలని పట్టుదలగా ఉన్నాడు. అలాంటి వారికి తెలంగాణ టి20 లీగ్ తగిన దిశను చూపిస్తోంది. ఈ టోర్నీ ద్వారా పలువురు క్రికెటర్లు వెలుగులోకి వస్తున్నారు. అలాంటి వారిలో నోమాన్ అహ్మద్ ఒకడు. ప్రస్తుతం టీజీ టి20 లీగ్‌లో అతను మెదక్ ఫాల్సన్స్ జట్టులో సభ్యుడిగా ఉన్నాడు.
ఇప్పటికే హెచ్‌సీఏ లీగ్స్‌లో ఆడుతున్నా... ఈ టోర్నీతో అభిమానుల మధ్య ఆడేందుకు, ఎన్నో కొత్త విషయాలు నేర్చుకునేందుకు అవకాశం దక్కిందని ‘సాక్షి’తో మాట్లాడుతూ నోమాన్ చెప్పాడు. ‘చాలా రోజులుగా టి20 లీగ్ గురించి ఎదురు చూశాను. వేలం జరిగినప్పుడు మాకూ చాన్స్ వస్తుందా అని ఎంతో ఉత్కంఠకు లోనయ్యాను. అయితే నా అదృష్టం బాగుంది. వేలంలో మెదక్ టీమ్‌ను నన్ను తీసుకోవడంతో సంతోషం కలిగింది. హెచ్‌సీఏ లీగ్ మ్యాచ్‌లతో పోలిస్తే ఈ టోర్నీలో వాతావరణం చాలా భిన్నం. పెద్ద సంఖ్యలో అభిమానుల మధ్య ఆడే అవకాశం వచ్చింది. పైగా పలువురు ఇతర సీనియర్ క్రికెటర్లు అండగా నిలుస్తున్నారు’ అని నోమాన్ అన్నాడు.
అతని స్వస్థలం సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం చిల్లేపల్లి. హైదరాబాద్‌కు వచ్చి సమీప బంధువుల ఇంట్లో ఉన్న సమయంలో ఆటపై ఆసక్తి ఉండటంతో టెన్నిస్ బాల్ క్రికెట్ మాత్రం ఆడేవాడు. ఇందులోనే రాణించడాన్ని గుర్తించిన మిత్రులు మరింత ప్రోత్సహించారు. ఈ క్రమంలో కోవిడ్ లాక్‌డౌన్ ముగిసిన తర్వాత నగరంలో పూర్తిస్థాయి శిక్షణవైపు మళ్లాడు. అత్తాపూర్‌లోని సిటీ క్రికెట్ అకాడమీలో కోచ్ అహ్మద్ వద్ద అతను కోచింగ్ తీసుకుంటున్నాడు. తన ప్రతిభతో అందరినీ ఆకట్టుకున్న అతనికి హెచ్‌సీఏ లీగ్ పోటీల్లో చార్మినార్ క్లబ్ తరఫున ఆడే అవకాశం దక్కింది.
బ్యాటర్‌గా గత సీజన్‌లో రెండు రోజుల లీగ్‌లో 350 పరుగులతో అతను ఆకట్టుకున్నాడు. అనంతరం హెచ్‌సీఏ ఎమర్జింగ్ టీమ్‌లోకి ఎంపికయ్యాడు. ఇప్పుడు టీజీ టి20 లీగ్ నోమాన్‌కు మరో మంచి చాన్స్‌ను ఇచ్చింది. ‘మెదక్ ఫాల్కన్స్ టీమ్ యాజమాన్యం నాకు అండగా నిలిచి అన్ని విధాలా ప్రోత్సహిస్తోంది. ఐపీఎల్ తరహాలో మా జట్టు ప్రాక్టీస్, ట్రైనింగ్ కొనసాగుతోంది. ముఖ్యంగా తొలి మ్యాచ్ సమయంలో భారత ప్లేయర్, మా కెపె్టన్ తిలక్ వర్మ వ్యక్తిగతంగా నా ఆటపై పలు సూచనలు చేయడం మర్చిపోలేనిది’ అని నోమాన్ చెప్పాడు.
అనారోగ్యం కారణంగా నోమాన్ తండ్రి వ్యవసాయానికి కూడా దూరమయ్యాడు. దాంతో 24 ఏళ్ల నోమాన్ ఇప్పుడు ఒక బేకరీలో పని చేస్తున్నాడు. అయితే తన లక్ష్యాన్ని మాత్రం వదులుకోలేదని అతను చెప్పాడు. టీజీ టి20 వేలంలో మెదక్ అతడిని రూ.75 వేలకు సొంతం చేసుకుంది. ‘నేను హెచ్‌సీఏలో ఎలాంటి ఏజ్ గ్రూప్ క్రికెట్‌లో ఆడలేదు. ఇప్పుడు మిగిలింది సీనియర్ టీమ్‌లో స్థానమే. టీజీ టి20 టోర్నీలోకి ఎంపికైన కొద్ది మందిలో నేనూ ఉన్నానంటే నా ఆట గురించి అందరికీ తెలుస్తోంది. మున్ముందు మరింత పట్టుదలగా కష్టపడతా. నా వ్యక్తిగత కారణాలు ఆటకు అడ్డు రావు. అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చి హైదరాబాద్ టీమ్‌లోకి ఎంపిక కావడమే నా లక్ష్యం’ అని నోమాన్ ఆశాభావంతో చెప్పాడు.


