గిల్‌తో గంభీర్ (PC: BCCI X)
వెస్టిండీస్‌తో స్వదేశంలో వన్డే సిరీస్ సందర్భంగా ముగ్గురు కొత్త ఆటగాళ్లు టీమిండియా తరఫున అరంగేట్రం చేశారు. తొలి మ్యాచ్‌లో నమన్ ధిర్.. రెండో వన్డేలో ఆకిబ్ నబీ.. మూడో మ్యాచ్‌లో అన్షుల్ కాంబోజ్ వన్డేల్లో అడుగుపెట్టారు.
నబీకి చేదు అనుభవం
అయితే, వీరిలో నమన్ ధిర్ సిరీస్ ఆసాంతం కొనసాగగా.. ఆకిబ్ నబీకి మాత్రం చేదు అనుభవం ఎదురైంది. విండీస్‌తో రెండో వన్డేల్లో ఈ పేస్ బౌలర్ దారుణ ప్రదర్శన కనబరిచాడు. కేవలం 8.5 ఓవర్లలోనే 84 పరుగులు సమర్పించుకుని ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు.
అతడు కూడా విఫలం
బ్యాటింగ్‌కు స్వర్గధామంగా మారిన బర్సపరా (గువాహటి) పిచ్‌పై కరేబియన్ ఆటగాళ్లు నబీతో పాటు భారత అందరు బౌలర్ల బౌలింగ్‌లోనూ చితక్కొట్టారు. అయితే, మరుసటి మ్యాచ్ నుంచి నబీని మాత్రం తప్పించి.. అతడి స్థానంలో అన్షుల్ కాంబోజ్‌ను అరంగేట్రం చేయించింది యాజమాన్యం. మూడో వన్డేలో అన్షుల్ తొమ్మిది ఓవర్లు వేసి ఏకంగా 82 పరుగులు ఇచ్చి.. వికెట్ మాత్రం తీయలేకపోయాడు.
ఇక తొలి రెండో వన్డేల్లో టీమిండియా చేతిలో ఓడిన వెస్టిండీస్.. మూడో వన్డేలో మాత్రం గెలిచింది. తద్వారా క్లీన్‌స్వీప్ గండం నుంచి తప్పించుకుంది. ఈ పరిణామాల నేపథ్యంలో భారత మాజీ బ్యాటర్ మహ్మద్ కైఫ్ టీమిండియా హెడ్‌కోచ్ గౌతం గంభీర్, వన్డే కెప్టెన్ శుబ్‌మన్ గిల్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు.
నబీని ఎందుకు తప్పించారు?
‘‘కొత్త ఆటగాళ్లతో అరంగేట్రం చేయిస్తున్నారు. కానీ వాళ్లకు మద్దతుగా నిలవడం లేదు. ఒకరిని ఒక మ్యాచ్‌లో ఆడిస్తే.. అప్పుడు అతడు విఫలమైనా.. మరో అవకాశం ఇచ్చి చూడండి.
పరిస్థితులకు అనుగుణంగా మరిన్ని అవకాశాలు ఇచ్చేందుకు ఆస్కారం ఉందేమో గమనించండి. అసలు మీరు మూడో వన్డే నుంచి నబీని ఎందుకు తప్పించారు? కాంబోజ్ బౌలింగ్‌లోనూ విండీస్ బ్యాటర్లు చితక్కొట్టారు కదా!..
కెరీర్‌ను మీరు నాశనం చేస్తున్నారు
ఏదేమైనా వెనువెంటనే తుదిజట్టు నుంచి తప్పించడం ద్వారా యువ ఆటగాళ్ల కెరీర్‌ను మీరు నాశనం చేస్తున్నారు. అసలు నబీకి తదుపరి వైట్‌బాల్ గేమ్ ఆడే అవకాశం ఇస్తారో కూడా తెలియదు.
ఇక ముందు అతడిని జట్టులో ఉంచడం కూడా కష్టమే. ఏదేమైనా యాజమాన్యం చేస్తున్నది తప్పు. బ్యాకప్ లేకుండా ముందుకు వెళ్లడం మంచిది కాదు. మీరు ఇదే విధానం కొనసాగిస్తే జట్టుకు మున్ముందు ఇబ్బందులు తప్పవు. గిల్ ఇంకా యువకుడే.
కెప్టెన్‌గా ఇప్పుడిప్పుడే పాఠాలు నేర్చుకుంటున్నాడు. ప్రస్తుతం జట్టులో బౌలింగ్ దళంలో ఎక్కువగా యువకులే ఉండటం కూడా అతడికి కాస్త ఇబ్బందికరంగా మారింది. అనుభవజ్ఞులు ఉంటే గిల్ పని కాస్త సులువయ్యేది.
ప్రపంచకప్ టోర్నీకి ఇంకా తక్కువ సమయమే ఉంది. ఇవన్నీ అతడిని భయపెడుతున్నాయి. నబీ, నితీశ్ రెడ్డి వంటి ఆటగాళ్లకు వీలైనన్ని ఎక్కువ అవకాశాలు ఇచ్చి పరిశీలిస్తేనే మంచి కూర్పు సాధ్యమవుతుంది. లేదంటే కష్టాలు తప్పవు’’ అని కైఫ్ టీమిండియా నాయకత్వ బృందం తీరును విమర్శించాడు.
చదవండి: టీమిండియాకు కొత్త కెప్టెన్!


