టీమిండియా కొత్త కెప్టెన్‌గా స్టార్‌ ఓపెనర్‌! | Smriti Mandhana Set to Replace Harmanpreet Kaur As Indian Captain Across Formats | Sakshi
Sakshi News home page

టీమిండియా కొత్త కెప్టెన్‌గా స్టార్‌ ఓపెనర్‌!

Oct 6 2026 12:51 PM | Updated on Oct 6 2026 1:01 PM

Smriti Mandhana Set to Replace Harmanpreet Kaur As Indian Captain Across Formats

PC: BCCI/X

భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్సీకి హర్మన్‌ప్రీత్ కౌర్ సడన్‌గా వీడ్కోలు పలికి అందరినీ షాక్‌కు గురిచేసింది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో శ్రీలంక వేదికగా జరగనున్న తొలి 'ఐసీసీ మహిళల ఛాంపియన్స్ ట్రోఫీ' వరకు ఆమె సారథిగా కొనసాగుతుందని అంతా భావించారు.

కానీ ఆమె మాత్రం యువ ఆటగాళ్లకు అవకాశమిచ్చే ఉద్దేశంతో నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించింది. హర్మన్ నిర్ణయంతో భారత జట్టుకు తదుపరి కెప్టెన్ ఎవరనే దానిపై చర్చ మొదలైంది.

ముందంజలో స్మృతి మంధాన
అన్ని ఫార్మాట్లలోనూ భారత జట్టు పగ్గాలను స్టార్ ఓపెనర్, ప్రస్తుత వైస్ కెప్టెన్ స్మృతి మంధానకు అప్పగించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. గతంలో హర్మన్‌ప్రీత్ గైర్హాజరీలో పలుమార్లు జట్టును ముందుండి నడిపించిన అనుభవం స్మృతికి ఉంది. 

అంతేకాకుండా, మహిళల ప్రీమియర్ లీగ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టును వరుసగా రెండుసార్లు విజేతగా నిలిపి తన నాయకత్వ స్కిల్స్‌ను నిరూపించుకుంది. ఈ నేపథ్యంలో స్మృతి మంధాననే కొత్త కెప్టెన్‌గా ఎంపిక చేయడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. ఆమెకు డిప్యూటీగావికెట్ కీపర్ రిచా ఘోష్ లేదా ఆల్‌రౌండర్ దీప్తి శర్మ నియమితులయ్యే అవకాశం ఉంది.

హ‌ర్మ‌న్ కెప్టెన్సీ రికార్డు
కాగా హర్మన్ భారత మహిళ క్రికెట్ చరిత్రలో తన పేరును సువర్ణ అక్షరాలతో లిఖించుకుంది. ఆమె నాయకత్వంలో టీమిండియా 2025 వన్డే ప్రపంచకప్ టైటిల్‌ను కైవసం చేసుకోవడంతో పాటు, ఇటీవలే ముగిసిన 2026 ఆసియా క్రీడల్లోనూ స్వర్ణ పతకం సాధించింది. హ‌ర్మ‌న్ త‌న కెరీర్‌లో భారత్ తరఫున 5 టెస్టులు, 51 వన్డేలు, 155 టీ20 మ్యాచ్‌లకు హర్మన్‌ప్రీత్ నాయకత్వం వహించింది. మొత్తంగా 126 మ్యాచ్‌ల‌లో భార‌త జ‌ట్టును విజేత‌గా నిలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement