‘అలా అయితే డిప్రెషన్‌లోకి వెళ్లిపోతాడు.. మంచి పనే చేశారు’ | Will Be Depressed: Is Repeated Injuries Putting Pressure On Harshit Rana | Sakshi
Sakshi News home page

‘అలా అయితే డిప్రెషన్‌లోకి వెళ్లిపోతాడు.. మంచి పనే చేశారు’

Sep 12 2026 5:00 PM | Updated on Sep 12 2026 5:30 PM

Will Be Depressed: Is Repeated Injuries Putting Pressure On Harshit Rana

కోహ్లితో హర్షిత్‌ రాణా (PC: BCCI/Instagram)

హర్షిత్‌ రాణా.. ఐపీఎల్‌లో సత్తా చాటి అనతికాలంలోనే టీమిండియాలో అరంగేట్రం చేసిన ఆటగాళ్లలో ఒకడు. హెడ్‌కోచ్‌ గౌతం గంభీర్‌ ప్రియ శిష్యుడిగా పేరొందిన ఈ ఢిల్లీ పేసర్‌.. ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్‌లో మూడు ఫార్మాట్లలోనూ అడుగుపెట్టాడు.

టీమిండియా తరఫున ఇప్పటి వరకు రెండు టెస్టులు, పద్నాలుగు వన్డేలు, పద్నాలుగు టీ20 మ్యాచ్‌లు ఆడిన 24 ఏళ్ల హర్షిత్‌ రాణా.. ఆయా ఫార్మాట్లలో వరుసగా నాలుగు, 26, 16 వికెట్లు కూల్చాడు. ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ-2025 గెలిచిన భారత జట్టులోనూ అతడు సభ్యుడు.

గాయాలతో సావాసం
అయితే, గత కొంతకాలంగా హర్షిత్‌ రాణా గాయాల వల్ల ఇబ్బందిపడుతున్నాడు. టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీకి ముందు సౌతాఫ్రికాతో వార్మప్‌ మ్యాచ్‌ సందర్భంగా ఈ రైటార్మ్‌ పేసర్‌ గాయపడ్డాడు. మోకాలి నొప్పితో విలవిల్లాడిన అతడు సర్జరీ చేయించుకోవాల్సి వచ్చింది. ఈ క్రమంలో ఐపీఎల్‌-2026 మొత్తానికి ఈ కోల్‌కతా నైట్‌ నైడర్స్‌ ఆటగాడు దూరమయ్యాడు.

ఇలా వచ్చి.. అలా వెళ్లాడు
ఈ క్రమంలో జూన్‌లో ఐర్లాండ్‌ పర్యటన సందర్భంగా భారత టీ20 జట్టులోకి హర్షిత్‌ రాణా పునరాగమనం చేశాడు. అయితే, ఇంగ్లండ్‌తో ట్రెంట్‌ బ్రిడ్జ్‌ వన్డే సందర్భంగా అతడికి తొడ కండరాల గాయమైంది. దీంతో హర్షిత్‌ రాణా మరోసారి జట్టుకు దూరమయ్యాడు.

ఈ నేపథ్యంలో గత కొంతకాలంగా బెంగళూరులోని బీసీసీఐ సెంటర్‌ ఫర్‌ ఎక్సలెన్స్‌లో హర్షిత్‌ రాణా పునరావాసం పొందుతున్నాడు. అయితే, అఫ్గానిస్తాన్‌తో స్వదేశంలో సెప్టెంబరు 13న మొదలయ్యే టీ20 సిరీస్‌కు అతడు అందుబాటులో ఉండే అవకాశం ఉన్నట్లు బీసీసీఐ తొలుత ప్రకటించింది.

సిరీస్‌ మొత్తానికి దూరం
అయితే, ఫిట్‌నెస్‌ పరీక్ష సమయంలో హర్షిత్‌ రాణా మరోసారి గాయపడటంతో అతడు సిరీస్‌ మొత్తానికి దూరమైనట్లు ప్రకటించింది. అతడి స్థానంలో యశ్‌ ఠాకూర్‌ను ఎంపిక చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్‌, ఢిల్లీ జట్టు హెడ్‌కోచ్‌ శరణ్‌దీప్‌ సింగ్‌ కీలక వ్యాఖ్యలు చేశాడు.

గాయం నుంచి పూర్తిగా కోలుకున్న తర్వాత హర్షిత్‌ను టీమిండియాలో ఆడించాలని శరణ్‌దీప్‌ సింగ్‌ సూచించాడు. ప్రస్తుత పరిస్థితుల్లో యాజమాన్యం తొందరపడి అతడిని తీసుకురాకుండా మంచి పని చేసిందని పేర్కొన్నాడు. ఈ మేరకు ఫ్యాన్‌కోడ్‌తో మాట్లాడుతూ....

డిప్రెషన్‌లోకి వెళ్లే అవకాశం ఉంది
‘‘ఒక్కసారి టీమిండియాలోకి తిరిగి వస్తే అదనంగా శ్రమించాల్సి ఉంటుంది. కాబట్టి గాయం మళ్లీ తిరగబెట్టే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం హర్షిత్‌ రాణాను మరికొంత కాలం పక్కనపెట్టడం సానుకూల విషయమే. లేదంటే వరుస గాయాల వల్ల హర్షిత్‌ డిప్రెషన్‌లో కూరుకుపోయే అవకాశం ఉంటుంది.

ఒత్తిడి పెరిగి అతడి మానసిక స్థితిపై ప్రభావం చూపుతుంది. ప్రస్తుతం భారత జట్టులో అతడు కీలక సభ్యుడిగా ఉన్నాడు. అద్భుతంగా బౌలింగ్‌ చేయడంతో పాటు అవసరమైనపుడు బ్యాటింగ్‌ కూడా చేయగలడు. గతేడాది కాలంగా బాగా రాణించాడు. అయితే, గాయాల వల్ల కాస్త వెనుకబడ్డాడు. అతడు త్వరలోనే ఫిట్‌గా మారి తిరిగి వస్తాడని ఆశిస్తున్నా’’ అని శరణ్‌దీప్‌ సింగ్‌ చెప్పుకొచ్చాడు.

చదవండి: ఏడెకరాల భూమి.. ఫామ్‌హౌజ్‌.. ఆస్తి విలువ ఎంతంటే?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement