source: X
షేర్ ఏ పంజాబ్ టీ20 లీగ్ 2026లో ముంబై ఇండియన్స్ బ్యాటర్, అమృత్‌సర్ సూర్మాస్ కెప్టెన్ నమన్ ధిర్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. ప్రస్తుత ఎడిషన్‌లో ఇప్పటికే రెండు విధ్వంసకర శతకాలు సహా, పలు మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడిన అతడు.. తాజాగా మరోసారి పేట్రేగిపోయాడు.
మొహాలీ కింగ్స్‌తో ఇవాళ జరిగిన తొలి సెమీస్ ధిర్ పూనకం వచ్చినట్లు ఊగిపోయాడు. కేవలం 37 బంతుల్లో 10 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 91 పరుగులు చేసి, తృటిలో సీజన్‌లో తన మూడో సెంచరీని చేజార్చుకున్నాడు.
ధిర్ సునామీ ఇన్నింగ్స్‌తో విరుచుకుపడటంతో ప్రత్యర్ది నిర్దేశించిన 170 పరుగుల లక్ష్యాన్ని అమృత్‌సర్ జట్టు 16.3 ఓవర్లలోనే ఊదేసింది. ఫలితంగా ఫైనల్స్‌కు దూసుకెళ్లింది. ధిర్ ఔటయ్యాక అభయ్ చౌదరి (48 నాటౌట్), రాహుల్ కుమార్ (26 నాటౌట్) అమృత్‌సర్‌ను విజయతీరాలకు చేర్చారు.
అంతకుముందు మొహాలీ కింగ్స్ నిర్ణీత 20 ఓవరల్లో 7 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. ఈ జట్టు తరఫున కెప్టెన్ రమన్‌దీప్ సింగ్ (42), అన్మోల్‌ప్రీత్ సింగ్ (43), హర్ప్రీత్ బ్రార్ (32 నాటౌట్), సొహ్రబ్ ధలీవాల్ (26) మాత్రమే ఓ మోస్తరు స్కోర్లు చేశారు. అమృత్‌సర్ బౌలర్లలో జైప్రతాప్ సింగ్ 3, ఆకాశ్ పాండే 2 వికెట్లతో సత్తా చాటారు.
కాగా, ఇవాళ రాత్రి 7 గంటలకు రెండో సెమీఫైనల్ మొదలవుతుంది. లుథియానా లయన్స్, జలంధర్ వారియర్స్ మధ్య జరిగే ఈ మ్యాచ్‌లో విజేత సెప్టెంబర్ 13న జరిగే ఫైనల్స్‌లో అమృత్‌సర్ జట్టుతో అమీతుమీ తేల్చుకుంటుంది.
చదవండి: క్రికెటర్ శ్రీశాంత్ ఇంట తీవ్ర విషాదం


