Photo Credit: Twitter
సెప్టెంబర్ 19 నుంచి అధికారికంగా మొదలుకానున్న ఆసియా క్రీడలకు టీమిండియా కొత్త జెర్సీతో బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. సంప్రదాయ నీలం రంగు (Blue) జెర్సీకి బదులు నారింజ రంగు (Orange) జెర్సీ ధరించి టీమిండియా మ్యాచ్‌లు ఆడనున్నట్లు సమాచారం. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన విడుదల కానప్పటికీ, ఆసియా క్రీడలకు మాత్రం టీమిండియా జెర్సీలో మార్పు ఖాయమన్న విషయం స్పష్టమవుతోంది.
అయితే ఇటీవలే భారత హాకీ జట్టు మాత్రం కాషాయ రంగు జెర్సీ నుంచి బ్లూ జెర్సీలోకి మారిన సంగతి తెలిసిందే. రాబోయే ఆసియా క్రీడలకు కూడా మన హాకీ జట్టు ఆటగాళ్లు నీలం రంగు జెర్సీలతోనే బరిలోకి దిగనున్నట్లు ఇప్పటికే హాకీ ఇండియా స్పష్టం చేసింది. ఇప్పటికే వైభవ్ సూర్యవంశీ, సంజూ శాంసన్‌లు కాషాయ రంగు జెర్సీ ధరించిన ఫొటోలు (ఏఐ) సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఇందులో నిజమెంత అనేది పక్కనబెడితే.. అభిమానులు మాత్రం నారింజ రంగు వద్దని, అచ్చొచ్చిన నీలం రంగు జెర్సీతోనే ఆసియా గేమ్స్‌లో పాల్గొనాలని కామెంట్లు చేశారు. కొందరు మాత్రం నారింజ, నీలం రంగులు కలిసిన జెర్సీని ధరిస్తే బాగుంటుందని సలహాలు ఇస్తున్నారు.
ఇక జపాన్‌లోని నగోయా వేదికగా సెప్టెంబర్ 10 నుంచే ఆసియా గేమ్స్ ప్రారంభమైనప్పటికీ అధికారికంగా మాత్రం సెప్టెంబర్ 19 నుంచి మొదలుకానున్నాయి. మొత్తం 43 క్రీడాంశాల్లో పోటీలు నిర్వహించనున్నారు. ఇక పురుషుల క్రికెట్ సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 3 మధ్య, మహిళల క్రికెట్ సెప్టెంబర్ 17 నుంచి 22 వరకు జరగనున్నాయి.
టాప్-10లో ఉండడంతో భారత్, శ్రీలంక, పాకిస్తాన్, బంగ్లాదేశ్ నేరుగా క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లు ఆడనున్నాయి. భారత్ తమ తొలి మ్యాచ్‌ను సెప్టెంబర్ 28న ఆడనుంది. ఇక మహిళల క్రికెట్‌లో మాత్రం నేరుగా క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లు జరగనుండగా, సెప్టెంబర్ 18న జరగనున్న క్వార్టర్ ఫైనల్లో జపాన్‌తో భారత్ తలపడనుంది.
🚨 NEW JERSEY FOR TEAM INDIA IN ASIAN GAMES 2026 !🧡🇮🇳
- According to reports, Team India are set to move away from their iconic blue jersey and feature a new orange kit at the upcoming Asian Games. [News Arena] pic.twitter.com/3NpG2VXkDT— lndian Sports Network (@IS_Netwrk29) September 12, 2026


