శ్రీలంక 308 ఆలౌట్‌.. వెస్టిండీస్‌ స్కోరెంతంటే? | West Indies vs Sri Lanka 1st Test Day 2: Sri Lanka 308 All Out WI Score is? | Sakshi
Sakshi News home page

శ్రీలంక 308 ఆలౌట్‌.. వెస్టిండీస్‌ స్కోరెంతంటే?

Jun 27 2026 10:05 AM | Updated on Jun 27 2026 10:22 AM

West Indies vs Sri Lanka 1st Test Day 2: Sri Lanka 308 All Out WI Score is?

శ్రీలంకతో తొలి టెస్టులో వెస్టిండీస్‌ మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకుంటోంది. నార్త్‌ సౌండ్‌ వేదికగా శుక్రవారం నాటి రెండో రోజు ఆట ముగిసేసరికి ఐదు వికెట్ల నష్టానికి 271 పరుగులు చేసి మెరుగైన స్థితిలో నిలిచింది. కాగా మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌లు.. రెండు టెస్టులు ఆడేందుకు శ్రీలంక విండీస్‌ పర్యటనకు వెళ్లింది.

ఇందులో భాగంగా తొలుత వన్డే సిరీస్‌ జరుగగా పర్యాటక లంక జట్టు.. 1-0 తేడాతో గెలిచింది. మిగిలిన రెండు మ్యాచ్‌లు వర్షం వల్ల రద్దైపోయాయి. ఇక టీ20 సిరీస్‌ను మాత్రం ఆతిథ్య కరేబియన్‌ జట్టు 2-1తో కైవసం చేసుకుంది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య గురువారం తొలి టెస్టు మొదలైంది.

సర్‌ వివియన్‌ రిచర్డ్స్‌ స్టేడియంలో టాస్‌ గెలిచిన వెస్టిండీస్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక తమ తొలి ఇన్నింగ్స్‌లో 71.5 ఓవర్లలో కేవలం 308 పరుగులు చేసి ఆలౌటైంది. కెప్టెన్‌ ధనంజయ డిసిల్వా (168 బంతుల్లో 120; 17 ఫోర్లు) సెంచరీతో ఆకట్టుకున్నాడు. టెస్టు క్రికెట్‌లో అతడికిది 13వ శతకం. మిగిలిన వారిలో దినేశ్‌ చండీమల్‌ (67 బంతుల్లో 54; 8 ఫోర్లు), సోనాల్‌ దినుషా (43; 6 ఫోర్లు) రాణించారు.

ఇక విండీస్‌ బౌలర్లలో జస్టిన్‌ గ్రేవ్స్‌ 3 వికెట్లు పడగొట్టగా ... రోచ్, అల్జారీ జోసెఫ్, షామార్‌ జోసెఫ్‌ తలా రెండు వికెట్లు తీశారు. అనంతరం తమ తొలి ఇన్నింగ్స్‌ మొదలుపెట్టిన వెస్టిండీస్‌కు ఓపెనర్లు జాన్‌ కాంప్‌బెల్‌ (39), బ్రాండన్‌ కింగ్‌ (31) మెరుగైన ఆరంభం అందించారు.

వన్‌డౌన్‌ బ్యాటర్‌ కేవెమ్‌ హాడ్జ్‌ (16) విఫలం కాగా.. ఆమిర్‌ జాంగో అజేయ అర్ధ శతకం (78)తో ఆకట్టుకున్నాడు. మిగిలిన వారిలో వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ జోషువా డిసిల్వా (20), జస్టిన్‌ గ్రీవ్స్‌ (3) ఫెయిల్‌ కాగా.. కెప్టెన్‌ రోస్టన్‌ ఛేజ్‌ 105 బంతుల్లో 42 పరుగులతో అజేయంగా నిలిచాడు. 

ఫలితంగా రెండో రోజు ఆట ముగిసే సరికి ఐదు వికెట్ల నష్టానికి 271 పరుగులు చేసిన విండీస్‌.. శ్రీలంక కంటే కేవలం 37 పరుగులు మాత్రమే వెనుకబడి ఉంది. శ్రీలంక బౌలర్లలో అసిత ఫెర్నాండో, మిలాన్‌ప్రియాంత్‌ రత్ననాయకే చెరో రెండు.. సోనాల్‌ దినుషా ఒక వికెట్‌ దక్కించుకున్నారు.

చదవండి: ఐర్లాండ్‌ చేతిలో ఓటమి.. కెప్టెన్‌గా నాకు గొప్ప ఆరంభం

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement