PC: ICC
ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో ఆస్ట్రేలియా వరుసగా రెండో విజయం నమోదు చేసింది. తొలి మ్యాచ్‌లో సౌతాఫ్రికా వుమెన్‌ను 65 పరుగుల తేడాతో చిత్తు చేసిన మొలినెక్స్ బృందం.. తాజాగా బంగ్లాదేశ్ మహిళా జట్టుపై కూడా ఘన విజయం సాధించింది.
టాపార్డర్ కుదేలు
లీడ్స్ వేదికగా హెడింగ్లీ మైదానంలో బుధవారం నాటి మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన బంగ్లా టాపార్డర్ కుదేలైంది. ఆసీస్ పేసర్ కిమ్ గార్త్.. ఓపెనర్లలో దిలారా అక్తర్‌ను డకౌట్ చేయడంతో పాటు.. జువేరియా ఫిర్దోస్‌ను 8 పరుగులకే పెవిలియన్‌కు పంపింది.
వన్‌డౌన్ బ్యాటర్ షర్మిన్ అక్తర్ (5)ను ఆసీస్ కెప్టెన్ సోఫీ మొలినెక్స్ వికెట్ల ముందు దొరకబుచ్చుకుంది. అనంతరం బంగ్లా సారథి నిగర్ సుల్తానా (27)ను కూడా మొలినెక్స్ LBWగా వెనక్కి పంపింది. ఇక మిగిలిన వారిలో శోభనా మొస్తరీ (4), షోర్నా అక్తర్ (0) వికెట్లను ఎలిస్ పెర్రీ తన ఖాతాలో వేసుకోగా.. రీతూ మోనీ (16)ని జార్జియా వారేహామ్.. రెబెయా ఖాన్ (8)ను అన్నాబెల్ సదర్లాండ్ పెవిలియన్‌కు పంపారు.
77 పరుగులకే ఖేల్ ఖతం.. 9.3 ఓవర్లలో ఛేదన
ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో బంగ్లాదేశ్ మహిళా జట్టు ఎనిమిది వికెట్ల నష్టానికి కేవలం 77 పరుగులే చేసింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన ఆస్ట్రేలియా జట్టు కేవలం 9.3 ఓవర్లలో ఒక వికెట్ నష్టపోయి పని పూర్తి చేసింది.
ఓపెనర్ జార్జియా వోల్ (32 బంతుల్లో 45)తో పాటు.. వన్‌డౌన్ బ్యాటర్ ఎలిస్ పెర్రీ (15 బంతుల్లో 19) అజేయంగా నిలవగా.. మరో ఓపెనర్ బెత్ మూనీ (10) మాత్రం మరూఫా అక్తర్ బౌలింగ్‌లో వెనుదిరిగింది. కాగా బంగ్లాపై విజయంతో గ్రూప్-‘ఎ’లో ఆస్ట్రేలియా అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. ఇప్పటికి ఆడిన రెండు మ్యాచ్‌లలో గెలిచి నాలుగు పాయింట్లతో టాపర్‌గా నిలిచింది.
చదవండి: వైభవ్ సూర్యవంశీకి బీసీసీఐ షాక్


