breaking news
ICC Women's T20 World Cup 2026
-
కొంపముంచిన చెత్త ఫీల్డింగ్.. సౌతాఫ్రికా చేతిలో భారత్ ఓటమి
మహిళల టీ20 ప్రపంచకప్-2026లో భారత జట్టుకు తొలి ఓటమి ఎదురైంది. మాంచెస్టర్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో టీమిండియా పరాజయం పాలైంది. భారత్ నిర్ధేశించిన 159 పరుగుల లక్ష్యాన్ని ప్రోటీస్ కేవలం 4 వికెట్లు కోల్పోయి 19.1 ఓవర్లలో చేధించింది. దక్షిణాఫ్రికా విజయంలో ఆల్‌రౌండర్ మరిజాన్ కాప్‌ది కీలక పాత్ర. కాప్ (45 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్స్‌లతో 81) అజేయంగా నిలిచి మ్యాచ్‌ను ఫినిష్ చేసింది. ఆమెతో పాటు ఓపెనర్ బ్రిట్స్(40) రాణించింది. అయితే భారత్ ఓటమికి ప్రధాన కారణం ఫీల్డింగ్ వైఫలమ్యనే చెప్పాలి. మ్యాచ్ విన్నింగ్ నాక్ ఆడిన కాప్.. రెండు సార్లు ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకుంది. రెండు సార్లు కూడా ఆమె ఇచ్చిన క్యాచ్‌లను భారత సబ్‌స్ట్యూట్ ఫీల్డర్ రాధా యాదవ్ జారవిడిచింది. ఆ క్యాచ్‌లు అందుకుని ఉండింటే ఫలితం మరో విధంగా ఉండేది. భారత బౌలర్లలో శ్రీచరణి మూడు వికెట్లు పడగొట్టింది.ఇక టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. షెఫాలీ వర్మ(15 బంతుల్లో 4 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 31) టాప్ స్కోరర్‌గా నిలవగా.. దీప్తి శర్మ(29), హర్మన్ ప్రీత్ కౌర్(24), మంధాన(17) పర్వాలేదనిపించారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో కాప్, ఇస్మాయల్ తలా రెండు వికెట్లు పడగొట్టగా.. మల్బా, అయబోంగ ఖకా, నడైన్ డిక్లార్క్ తలా వికెట్ సాధించారు. భారత్ తమ తదుపరి మ్యాచ్‌లో జూన్ 25న బంగ్లాదేశ్‌తో తలపడనుంది. -
చరిత్ర సృష్టించిన టీమిండియా కెప్టెన్.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా
భారత మహిళల జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ మరో అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకుంది. పురుషుల, మహిళల క్రికెట్ చరిత్రలోనే 200 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లు ఆడిన మొట్టమొదటి ప్లేయర్‌గా హర్మన్‌ప్రీత్ రికార్డులకెక్కింది.ఉమెన్స్ టీ20 ప్రపంచకప్-2026లో భాగంగా సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో బరిలోకి దిగడంతో హర్మన్ ఈ ఘనతను సొంతం చేసుకుంది. 2009లో ఇంగ్లండ్ వేదికగా జరిగిన తొలి మహిళల టీ20 ప్రపంచకప్‌తో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన హర్మన్.. తన 17 ఏళ్ల సుదీర్ఘ కెరీర్లో ఇప్పటివరకు రెండు వందల టీ20 మ్యాచ్‌లలో భారత్‌కు ప్రాతినిథ్యం వహించింది. హర్మన్‌కు ఇది 10వ టీ20 వరల్డ్‌కప్ కావడం గమనార్హం.కాగా మహిళల విభాగంలో అత్యధిక టీ20 మ్యాచ్‌లు ఆడిన జాబితాలో హర్మన్(200) అగ్రస్ధానంలో ఉండగా.. రెండో స్ధానంలో న్యూజిలాండ్ లెజెండరీ ప్లేయర్ సూజీ బేట్స్ (184 మ్యాచ్‌లు) రెండో స్ధానంలో కొనసాగుతోంది. పురుషుల క్రికెట్లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఐర్లాండ్ ఆటగాడు పాల్ స్టిర్లింగ్ (163) ఉన్నాడు.అత్యధిక టీ20లు ఆడిన టాప్ ప్లేయర్స్పురుషుల విభాగంలో: పాల్ స్టిర్లింగ్ (ఐర్లాండ్): 163 మ్యాచ్‌లు (అగ్రస్థానం) రోహిత్ శర్మ (భారత్): 159 మ్యాచ్‌లు (రెండో స్థానం) మహిళల విభాగంలో: హర్మన్‌ప్రీత్ కౌర్ (భారత్): 200 మ్యాచ్‌లు సూజీ బేట్స్ (న్యూజిలాండ్): 184 మ్యాచ్‌లు ఎలిస్ పెర్రీ (ఆస్ట్రేలియా): 177 మ్యాచ్‌లుకాగా తన కెరీర్లో హర్మన్ ఇప్పటివరకు ఆడిన 200 మ్యాచ్‌లలో 29.83 సగటుతో 4147 పరుగులు చేసింది. ఇందులో ఒక సెంచరీతో పాటు 17 అర్ధ సెంచరీలు ఉన్నాయి. టీ20ల్లో ఆమె అత్యధిక వ్యక్తిగత స్కోరు 103 పరుగులుగా ఉన్నాయి. బౌలింగ్‌లో ఆమె 32 వికెట్లు పడగొట్టింది. -
రాణించిన భారత బ్యాటర్లు.. సౌతాఫ్రికా టార్గెట్ ఎంతంటే?
మహిళల టీ20 ప్రపంచకప్-2026లో మాంచెస్టర్ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న గ్రూపు-ఎ మ్యాచ్‌లో భారత బ్యాటర్లు రాణించారు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. షెఫాలీ వర్మ(15 బంతుల్లో 4 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 31) టాప్ స్కోరర్‌గా నిలవగా.. దీప్తి శర్మ(29), హర్మన్ ప్రీత్ కౌర్(24), మంధాన(17) పర్వాలేదనిపించారు. భారత్‌కు మంచి ఆరంభం లభించినప్పటికి మిడిల్ ఓవర్లలో వరుసగా వికెట్లు కోల్పోవడంతో ప్రత్యర్ధి ముందు భారీ లక్ష్యాన్ని ఉంచలేకపోయింది. దక్షిణాఫ్రికా బౌలర్లలో కాప్, ఇస్మాయల్ తలా రెండు వికెట్లు పడగొట్టగా.. మల్బా, అయబోంగ ఖకా, నడైన్ డిక్లార్క్ తలా వికెట్ సాధించారు. -
మంధాన మెరుపులు.. నెదర్లాండ్స్ ముందు భారీ స్కోర్
మహిళల టీ20 ప్రపంచకప్-2026లో భాగంగా లీడ్స్ వేదికగా నెదర్లాండ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత బ్యాటర్లు సత్తాచాటారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 209 పరుగుల భారీ స్కోర్ సాధించింది. స్మృతి కేవలం 47 బంతుల్లోనే 11 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 74 పరుగులు చేసి భారత తరపున టాప్ స్కోరర్‌గా నిలిచింది.ఆఖరిలో రిచా ఘోష్(8 బంతుల్లో 20) మెరుపు ఇన్నింగ్స్ ఆడింది. భారత్‌కు ఓపెనర్లు స్మృతి మంధాన, షెఫాలీ వర్మలు అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 116 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. షెఫాలీ(55) హాఫ్ సెంచరీ చేశాక ఔటైనప్పటికి, మంధాన మాత్రం తన దూకుడును కొనసాగించింది. డచ్ బౌలర్లలో కరోలిన్ డి లాంగే రెండు వికెట్లు పడగొట్టగా.. హీథర్, మిర్తే వాన్ డెన్ రాడ్ తలా వికెట్ సాధించారు.చదవండి: 77 పరుగులకే ఖేల్ ఖతం.. 9.3 ఓవర్లలో ఛేదన -
నెదర్లాండ్స్‌తో మ్యాచ్.. భారత్‌దే బ్యాటింగ్
మహిళల టీ20 ప్రపంచకప్-2026లో భాగంగా లీడ్స్ వేదికగా భారత్-నెదర్లాండ్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన డచ్ జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకుంది. తమ రెండో మ్యాచ్‌లో హర్మన్ సేన ఓ మార్పుతో బరిలోకి దిగింది. అరుంధతి రెడ్డి స్ధానంలో యువ పేసర్ నందని శర్మకు తుది జట్టులో చోటు కల్పించారు.తుది జట్లుభార: షఫాలీ వర్మ, స్మృతి మంధాన, యాస్తిక భాటియా, జెమిమా రోడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), రిచా ఘోష్ (వికెట్ కీపర్), దీప్తి శర్మ, శ్రేయంక పాటిల్, శ్రీ చరణి, క్రాంతి గౌడ్, నందనీ శర్మనెదర్లాండ్స్: హీథర్ సీగర్స్, ఫేబ్ మోల్కెన్‌బోర్, బాబెట్ డి లీడే(కెప్టెన్), స్టెర్రే కాలిస్, రోబిన్ రిజ్కే, ఫ్రెడెరిక్ ఓవర్డిజ్క్, ఐరిస్ జ్విల్లింగ్, మైర్తే వాన్ డెన్ రాడ్, కరోలిన్ డి లాంగే, సిల్వర్ సీగర్స్, ఇసాబెల్ వెగింగ్ -
T20 WC 2026: పాకిస్తాన్‌కు షాకిచ్చిన ఐసీసీ
పాకిస్తాన్ మహిళా క్రికెట్ జట్టుకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) షాకిచ్చింది. మ్యాచ్ ఫీజులో ఐదు శాతం మేర కోత విధించింది. ఇంగ్లండ్ వేదికగా ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్ జూన్ 12న మొదలైన సంగతి తెలిసిందే.భారత్ ఘన విజయంపన్నెండు జట్లు పాల్గొంటున్న ఈ టోర్నీలో.. ఆయా జట్లను గ్రూప్-‘ఎ’, గ్రూప్-‘బి’గా విభజించారు. గ్రూప్- ‘ఎ’లో ఉన్న భారత్- పాకిస్తాన్ తమ తొలి మ్యాచ్‌లో ముఖాముఖి తలపడ్డాయి. బర్మింగ్‌హామ్ వేదికగా ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ పాక్‌పై 64 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత జట్టు తొలుత బ్యాటింగ్‌కు దిగి.. నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో ఓపెనర్ స్మృతి మంధాన అర్ధ శతకం (68) సాధించగా.. రిచా ఘోష్ మెరుపులు (17 బంతుల్లో 34) మెరిపించింది.పాక్ బౌలర్లలో కెప్టెన్ ఫాతిమా సనా, సైదా ఇక్బాల్ రెండేసి వికెట్లు తీయగా.. తస్మియా రుబాబ్, రమీన్ షమీమ్ తలా ఒక వికెట్ పడగొట్టారు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన పాక్ మహిళా జట్టు 17 ఓవర్లలో 106 పరుగులకే ఆలౌట్ అయింది.దీప్తి శర్మ ఐదు వికెట్లు కూల్చిభారత ఆల్‌రౌండర్ దీప్తి శర్మ ఐదు వికెట్లు కూల్చి పాక్ బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించగా.. శ్రీచరణి మూడు, షఫాలీ వర్మ ఒక వికెట్ పడగొట్టారు. అయితే, ఈ మ్యాచ్‌లో స్లో ఓవర్ రేటు మెయింటెన్ చేసినందుకు గానూ ఐసీసీ పాక్ జట్టుకు శిక్ష విధించింది.జరిమానా విధించిన ఐసీసీనిర్ణీత సమయంలో బౌలింగ్ కోటా పూర్తి చేయనందున ఐసీసీ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.22 ప్రకారం.. జరిమానా వేసింది. ఒక ఓవర్ ఆలస్యంగా వేసినందున మ్యాచ్ ఫీజులో ఐదు శాతం కోతతో సరిపెట్టింది. కాగా పాకిస్తాన్ తమ తదుపరి మ్యాచ్‌లో సౌతాఫ్రికా జట్టును ఎదుర్కోనుంది. గ్రూప్-ఎలో భాగంగా బుధవారం జరిగే ఈ మ్యాచ్‌కు బర్మింగ్‌హామ్ వేదిక.చదవండి: వైభవ్ వివాదం.. స్పందించిన బీసీసీఐ -
భారత జట్టుపై అక్కసు వెళ్లగక్కిన ఇంగ్లండ్ మాజీ కెప్టెన్
ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో భారత జట్టు శుభారంభం అందుకుంది. బర్మింగ్‌హామ్ వేదికగా ఆదివారం నాటి తొలి మ్యాచ్‌లో.. దాయాది పాకిస్తాన్‌ను 64 పరుగుల తేడాతో చిత్తు చేసింది. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో రాణించి చిరకాల ప్రత్యర్థిని ఏ దశలోనూ కోలుకోనివ్వకుండా చేసి జయభేరి మోగించింది.ఇండియా గెలుస్తుందని ముందే తెలుసుఈ నేపథ్యంలో హర్మన్‌ప్రీత్ కౌర్ సేనపై ప్రశంసలు కురుస్తుండగా.. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ నాసిర్ హుస్సేన్ మాత్రం భిన్నంగా స్పందించాడు. ఈ మ్యాచ్‌లో భారత్ గెలుస్తుందని తనకు ముందుగానే తెలుసునని.. పాక్ కంటే భారత జట్టుకు ‘అన్ఫేర్’ అడ్వాంటేజ్ ఉందంటూ అక్కసు వెళ్లగక్కాడు.ఇది అన్యాయంభారత్- పాక్ మ్యాచ్‌కు కామెంటేటర్‌గా వ్యవహరించిన నాసిర్ హుసేన్ తాజా స్కై స్పోర్ట్స్ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడాడు. ఈ సందర్భంగా.. ‘‘మ్యాచ్ ఆరంభానికి ముందే ఇండియా గెలుస్తుందని నాకు తెలుసు. ఇండియా- పాక్ మధ్య పోటీ అన్యాయం. పాక్‌తో పోలిస్తే ఇండియాకు అదనపు ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి.రెండూ సమతూకమైన జట్లు కావు. ఇండియా ప్లేయర్లు ఎక్కువగా ఫ్రాంఛైజీ క్రికెట్ ఆడుతున్నారు. తద్వారా రోజురోజుకీ మరింత మెరుగుపడుతున్నారు. ఆ అనుభవంతో జాతీయ జట్టు తరఫునా రాణిస్తున్నారు. కానీ పాకిస్తాన్లో ఆ పరిస్థితి లేదు.బంగ్లా, పాక్ ప్లేయర్లు అద్భుతం.. కానీ పాపంబంగ్లాదేశ్కు చెందిన మరుఫా అక్తర్, పాక్ ప్లేయర్ ఫాతిమా సనా అత్యద్భుతమైన క్రికెటర్లు. కానీ వాళ్లకు ఫ్రాంఛైజీ క్రికెట్ ఆడే అవకాశం లేదు. బంగ్లాదేశ్, పాకిస్తాన్ ప్లేయర్లకు అన్యాయం జరుగుతోంది. ది హండ్రెడ్ వంటి లీగ్‌లలో వీరిని ఆడించాలి. తద్వారా ప్రపంచవ్యాప్తంగా ఆడిన అనుభవం ఐసీసీ ఈవెంట్లలోనూ పనికివస్తుంది’’ అని నాసిర్ హుసేన్ చెప్పుకొచ్చాడు.అదే లాజిక్ ఇక్కడ వర్తించదా? ఈ నేపథ్యంలో పురుషుల క్రికెట్లో మీ వైఖరి ఏమిటి అంటూ టీమిండియా అభిమానులు నాసిర్ హుసేన్‌ను సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు. ‘భారత క్రికెటర్లు కేవలం ఐపీఎల్‌లోనే ఆడతారు.పాక్ ఆటగాళ్లు మాత్రం PSLతో పాటు, బిగ్‌బాష్ లీగ్, ది హండ్రెడ్ తదితర విదేశీ లీగ్‌లలోనూ ఆడతారు. మరి వాళ్లెందుకు టీమిండియా చేతిలో ఓడిపోతున్నారు? మీ లాజిక్ ప్రకారం ఫ్రాంఛైజీ క్రికెట్ ఎక్కువగా ఆడే పాక్ ప్లేయర్లే పైచేయి సాధించాలి కదా!’ అంటూ కౌంటర్లు ఇస్తున్నారు.చదవండి: వైభవ్ సూర్యవంశీ.. నువ్విక ఇంటికి వెళ్లవచ్చు! -
న్యూజిలాండ్‌కు షాకిచ్చిన వెస్టిండీస్
మహిళల టీ20 ప్రపంచకప్-2026లో న్యూజిలాండ్‌కు వెస్టిండీస్‌కు ఊహించని షాకిచ్చింది. శనివారం సౌతాంప్టన్ వేదికగా జరిగిన గ్రూప్-బి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై 7 వికెట్ల తేడాతో కరేబియన్ జట్టు ఘన విజయం సాధించింది. గత ప్రపంచకప్ సెమీఫైనల్ ఓటమికి విండీస్ ఈ విజయంతో ప్రతీకారం తీర్చుకుంది.ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. ఓపెనర్ ప్లిమ్మర్(8), కెప్టెన్ అమేలియా(5) ఆరంభంలోనే ఔటైనప్పటికి, బ్రూక్ హాలిడే(40), ఇసాబెల్లా గేజ్(39), మ్యాడీ గ్రీన్(35) అద్భుత ఇన్నింగ్స్‌లు ఆడారు. విండీస్ బౌలర్లలో ఆలియా అల్లెన్ 4 వికెట్లతో సత్తాచాటింది.అనంతరం 163 పరుగుల లక్ష్యాన్ని వెస్టిండీస్ 19.5 ఓవర్లలో కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది. ఈ విజయంలో వికెట్ కీపర్ బ్యాటర్ షెమైన్ కాంప్‌బెల్‌ది కీలక పాత్ర. కాంప్‌బెల్ కేవలం 62 బంతుల్లో 90 పరుగులు చేసి తన జట్టును గెలిపించింది.ఆమె టీ20 కెరీర్లో ఇదే అత్యధిక వ్యక్తిగత స్కోర్ కావడం గమనార్హం. న్యూజిలాండ్ బౌలర్లలో జెస్ కెర్ 4 ఓవర్లలో 17 పరుగులిచ్చి 2 వికెట్లు తీసింది. కాగా ఇది మహిళల టీ20 ప్రపంచకప్ చరిత్రలోనే ఇది రెండవ అత్యధిక విజయవంతమైన రన్ ఛేజ్ కావడం విశేషం. -
టీమిండియాతో మ్యాచ్.. పాకిస్తాన్‌కు భారీ షాక్!
మహిళల టీ20 ప్రపంచకప్-2026లో హైవోల్టేజ్ మ్యాచ్‌కు రంగం సిద్దమైంది. ఆదివారం ఎడ్జ్‌బాస్టన్ వేదికగా గ్రూపు-ఎ మ్యాచ్‌లో భాగంగా భారత్-పాకిస్తాన్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌కు ముందు పాక్ టీమ్‌కు భారీ షాక్ తగిలింది. శనివారం ప్రాక్టీస్ సెషన్లో ఆ జట్టు కెప్టెన్ ఫాతిమా సనా గాయపడింది. నెట్స్‌లో బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా, యువ బ్యాటర్ ఆయేషా జాఫర్ కొట్టిన షాట్ నేరుగా ఫాతిమా సనా కుడి మోకాలికి తగిలింది. దీంతో ఆమె తీవ్రమైన నొప్పితో విలవిల్లాడింది. వెంటనే ఫిజియో వచ్చి సనాకు చికిత్స అందించాడు. ఆ తర్వాత ఆమె నెట్స్ నుంచి వెళ్లిపోయింది. ఫాతిమా తిరిగి ప్రాక్టీస్‌కు రాలేదు. కానీ దాదాపు గంట తర్వాత ఫాతిమా అటు ఇటు నడుస్తూ మైదానంలో కనిపించింది. అయితే ప్రీ మ్యాచ్ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న ఫాతిమా సనాకు తన గాయం గురుంచి విలేకరులు ప్రశ్నించారు."ఇది అనుకోకుండా జరిగిన సంఘటన మాత్రమే. ఆయేషా ఆడిన షాట్ నా మోకాలికి తగిలింది. ఇప్పుడు కొంచెం నొప్పి తగ్గింది. రేపటికల్లా పూర్తిగా కోలుకుంటానని ఆశిస్తున్నాను" అని ఫాతిమా పేర్కొంది. ఒకవేళ భారత్‌తో మ్యాచ్‌కు ఫాతిమా దూరమైతే వికెట్ కీపర్ మునీబా అలీ జట్టును నడిపించే అవకాశముంది. కాగా టీ20ల్లో భారత్‌పై పాక్ అంతమంచి రికార్డు లేదు. భారత్, పాకిస్తాన్ జట్లు ఇప్పటివరకు 16 సార్లు తలపడ్డాయి. భారత్ 16 మ్యాచ్‌లు విజయం సాధించగా.. పాక్ కేవలం మూడింట మాత్రమే గెలుపొందింది. ఇరు జట్ల మధ్య చివరి టీ20 మ్యాచ్ 'మహిళల ఆసియా కప్ 2024'లో జరిగింది. ఇప్పుడు ఫాతిమా కూడా జట్టులో లేకపోతే పాక్‌కు పూర్తిగా గెలిచే అవకాశమే ఉండదు. టీ20 ప్రపంచకప్-2026 నుంచి పాక్ జట్టులో ఫాతిమా కీలక ప్లేయర్‌గా కొనసాగుతోంది.చదవండి: FIFA World Cup: ఆఖరి క్షణంలో అద్భుతం.. సుదీర్ఘ నిరీక్షణకు తెర -
చరిత్ర సృష్టించిన స్కాట్లాండ్ సిస్టర్స్
మహిళల టీ20 ప్రపంచకప్‌లో భాగంగా అరుదైన దృశ్యం చోటుచేసుకుంది. స్కాట్లాండ్ స్టిస్టర్స్ కెప్టెన్ కేథరిన్ బ్రైస్, సారా బ్రైస్‌లు తమ బ్యాటింగ్‌తో అభిమానులను అలరించారు. ఈ ఇద్దరు స్వయానా అక్కాచెల్లి కావడం విశేషం. టోర్నీలో భాగంగా గ్రూప్-బిలో శనివారం స్కాట్లాండ్, ఐర్లాండ్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్ మహిళలు 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. ఓపెనర్లు ఇద్దరు విఫలమైన వేళ అక్క కేథరిన్ బ్రైస్, ఆమె చెల్లి సారా బ్రైస్ ఐర్లాండ్ బౌలర్లను చితక్కొట్టారు. ఇద్దరు కలిసి మూడో వికెట్‌కు శతక భాగస్వామ్యం (106 పరుగులు) నమోదు చేయడం విశేషం. ఈ నేపథ్యంలో స్కాట్లాండ్ సిస్టర్స్ తమ బ్యాటింగ్‌తో అభిమానులను అలరించడమే గాక ఆ జట్టు తరఫున టీ20 ప్రపంచకప్‌లో శతకం భాగస్వామ్యం నమోదు చేసిన తొలి జంటగా చరిత్ర సృష్టించారు.39 బంతుల్లో 60 పరుగులు చేసిన కేథరిన్ బ్రైస్ ఇన్నింగ్స్‌లో 6 ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి. ఇక 35 బంతుల్లో 49 పరుగులు చేసి ఒక్క పరుగు తేడాతో అర్థసెంచరీ చేజార్చుకున్న సారా బ్రైస్ ఇన్నింగ్స్‌లో 4 ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి.కాగా పురుషుల క్రికెట్లో బ్రదర్స్ కలిసి ఆడిన జట్టు ఏదైనా ఉందంటే ఐర్లాండ్ జట్టు మాత్రమే. ఈ జట్టులోనే ఎక్కువగా అన్నదమ్ములు ప్రాతినిధ్యం వహించిన సందర్భాలు ఉన్నాయి. ఓబ్రియన్ బ్రదర్స్ (కెవిన్, నీల్), టెక్టర్ బ్రదర్స్ (హ్యారీ, టిమ్, జాక్), అడెయిర్ బ్రదర్స్ (మార్క్, రాస్)లు ఐర్లాండ్ జాతీయ జట్టు తరఫున అంతర్జాతీయ క్రికెట్ ఆడారు. A stunning 1️⃣0️⃣6️⃣ run partnership from Kathryn and Sarah Bryce 💪 pic.twitter.com/Hiviy2S6ZV— Cricket Scotland (@CricketScotland) June 13, 2026చదవండి: పోలీసుల చేతిలో చావుదెబ్బలు తిన్న బంగ్లా క్రికెటర్! -
T20 WC: జట్లు, వేదికలు, లైవ్ స్ట్రీమింగ్.. పూర్తి వివరాలు
గతేడాది సొంతగడ్డపై భారత మహిళ క్రికెట్ జట్టు అద్భుతం చేసింది. తొలిసారిగా ఐసీసీ వన్డే వరల్డ్‌కప్ ట్రోఫీని ముద్దాడింది. హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలో చాంపియన్‌గా అవతరించి సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది.ఆ తర్వాత టీమిండియా అదే జోరు కొనసాగిస్తూ స్వదేశంలో పొట్టి క్రికెట్ ప్రపంచకప్ గెలిచింది. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో విజేతగా నిలిచింది. ఇప్పుడు మహిళల వంతు వచ్చేసింది. ఇంగ్లండ్ వేదికగా జూన్ 12 టీ20 మహిళా ప్రపంచకప్-2026 మొదలుకానుంది.ఈ మెగా టోర్నీలో సత్తా చాటాలని హర్మన్ బృందం పట్టుదలగా ఉంది. పురుషుల మాదిరే ఈసారి తామూ ట్రోఫీని ముద్దాడాలని ఉవ్విళ్లూరుతోంది. ఇక న్యూజిలాండ్ డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలో దిగనుండగా.. గతేడాది రన్నరప్ సౌతాఫ్రికా కూడా ఫేవరెట్లలో ఒకటిగా ఉంది. ఇక భారత జట్టు 2024లో కనీసం సెమీస్ చేరకుండానే నిష్క్రమించింది. ఈసారి లోపాలు సరిచేసుకుని ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతోంది.ఇంతకీ ఈ టోర్నీలో ఎన్ని జట్లు పాల్గొంటున్నాయి? సారథులు ఎవరు?.. వేదికలు, ప్రత్యక్ష ప్రసారం ఎక్కడ? తదితర వివరాలు తెలుసుకుందామా?!షెడ్యూల్👉రౌండ్- రాబిన్ ఫార్మాట్👉జూన్ 12న వరల్డ్‌కప్ టోర్నీ మొదలు (ఇంగ్లండ్ వర్సెస్ శ్రీలంక)👉భారత్ వర్సెస్ పాకిస్తాన్- జూన్ 14👉సెమీ ఫైనల్-1: జూన్ 30👉సెమీ ఫైనల్-2: జూలై 2👉జూలై 5న ఫైనల్‌తో ముగింపు.వేదికలు👉గ్రూప్, సూపర్-8 దశ: ఓల్డ్ ట్రఫోర్డ్, మాంచెస్టర్, బ్రిస్టల్ కౌంటీ గ్రౌండ్, బ్రిస్టల్, హెడింగ్లీ, లీడ్స్, హాంప్‌షైర్ బౌల్, సౌతాంప్టన్, ఎడ్జ్‌బాస్టన్, బర్మింగ్‌హామ్.👉సెమీ ఫైనల్- ది ఓవల్, ఫైనల్- లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్.జట్లుఆస్ట్రేలియాసోఫీ మోలినెక్స్ (కెప్టెన్), నికోలా క్యారీ, ఆష్లే గార్డనర్, కిమ్ గార్త్, లూసీ హామిల్టన్, గ్రేస్ హారిస్, అలనా కింగ్, ఫోబ్ లిచ్‌ఫీల్డ్, తాహ్లియా మెక్‌గ్రాత్, బెత్ మూనీ, ఎల్లీస్ పెర్రీ, మేగన్ షట్, అన్నాబెల్ సదర్లాండ్, జార్జియా వోల్, జార్జియా వేర్హామ్.బంగ్లాదేశ్నిగర్ సుల్తానా జోటీ (కెప్టెన్), నహిదా అక్తర్ (వైస్ కెప్టెన్), షర్మిన్ అక్తర్ సుప్తా, శోభనా మోస్తరీ, షోర్నా అక్తర్, రీతు మోని, రబెయా ఖాన్, ఫాహిమా ఖాతున్, ఫరీహా ఇస్లాం త్రిస్నా, మరుఫా అక్తర్, శంజిదా అక్తేర్ మఘ్లా, సుల్తానా ఖాతున్, దిలారా అక్తర్, జుయేరియా ఫిర్దోస్, తాజ్ నెహర్.ఇండియాహర్మన్ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన, షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, భారతీ ఫుల్మాలి, దీప్తి శర్మ, రిచా ఘోష్, శ్రీ చరణి, యాస్తికా భాటియా, నందనీ శర్మ, అరుంధతి రెడ్డి, రేణుకా సింగ్, క్రాంతి గౌడ్, శ్రేయాంక పాటిల్, రాధా యాదవ్నెదర్లాండ్స్బాబెట్ డి లీడే (కెప్టెన్), కరోలిన్ డి లాంగే, ఫ్రెడెరిక్ ఓవర్డిజ్క్, హన్నా లాంధీర్, హీథర్ సీగర్స్, ఐరిస్ జ్విల్లింగ్, ఇసాబెల్ వాన్ డెర్ వోనింగ్, లారా లీమ్‌హూయిస్, మైర్తే వాన్ డెన్ రాడ్, ఫెబ్ మోల్కెన్‌బోయర్, రోసాలీ లావెరెన్స్, రోసాయా లావెరెన్స్, రోసాయా లావెరెన్స్, స్టెరె కాలిస్పాకిస్తాన్ఫాతిమా సనా (కెప్టెన్), గుల్ ఫిరోజా, అయేషా జాఫర్, ఇరామ్ జావేద్, ఇమాన్ ఫాతిమా, అలియా రియాజ్, నటాలియా పర్వైజ్, సైరా జబీన్, మునీబా అలీ, తుబా హసన్, రమీన్ షమీమ్, సాదియా ఇక్బాల్, నష్రా సంధు, డయానా బేగ్, తస్మియా రుబాబ్.సౌతాఫ్రికాలారా వోల్వార్డ్ట్ (కెప్టెన్), తజ్మిన్ బ్రిట్స్, నాడిన్ డి క్లెర్క్, అన్నెరీ డెర్క్సెన్, షబ్నిమ్ ఇస్మాయిల్, సినాలో జాఫ్తా, మారిజానే కాప్, అయాబొంగా ఖాకా, సునే లూయస్, కరాబో మెసో, నోంకులులేకో మ్లాబా, కైలా రేనేకే, టుమీ సెఖుఖునేర్, చ్లోవాన్ నికెర్కెర్ఇంగ్లండ్నాట్ సివర్-బ్రంట్ (కెప్టెన్), లారెన్ బెల్, ఆలిస్ క్యాప్సీ, టిల్లీ కోర్టీన్-కోల్మన్, చార్లీ డీన్, సోఫియా డంక్లీ, సోఫీ ఎక్లెస్టోన్, లారెన్ ఫైలర్, డాని గిబ్సన్, అమీ జోన్స్, ఫ్రేయా కెంప్, హీథర్ నైట్, లిన్సీ స్మిత్, ఇస్సీ వాంగ్, డాని వ్యాట్-హాడ్జ్.ఐర్లాండ్గాబీ లూయిస్ (కెప్టెన్), అవా కానింగ్, క్రిస్టినా కౌల్టర్ రైలీ, అలనా డాల్జెల్, జార్జినా డెంప్సీ, అమీ హంటర్, ఆర్లీన్ కెల్లీ, లూయిస్ లిటిల్, ఐమీ మాగ్వైర్, లారా మెక్‌బ్రైడ్, కారా ముర్రే, లియా పాల్, ఓర్లా ప్రెండర్‌గాస్ట్, రెబెక్కా స్టోకెల్, ఆలిస్ టెక్టర్న్యూజిలాండ్మెలీ కెర్ (కెప్టెన్), సూజీ బేట్స్, సోఫీ డివైన్, ఫ్లోరా డెవాన్‌షైర్, ఇజ్జీ గేజ్, మ్యాడీ గ్రీన్, బ్రూక్ హాలిడే, బ్రీ ఇల్లింగ్, పాలీ ఇంగ్లిస్, జెస్ కెర్, రోజ్మేరీ మైర్, నెన్సీ పటేల్, జార్జియా ప్లిమ్మర్, ఇజ్జీ షార్ప్, లీ తహుహు.స్కాట్లాండ్కాథరిన్ బ్రైస్ (కెప్టెన్), క్లో అబెల్, ఒలివియా బెల్, సారా బ్రైస్, డార్సీ కార్టర్, ప్రియనాజ్ ఛటర్జీ, గాబ్రియెల్లా ఫొంటెన్లా, కాథరిన్ ఫ్రేజర్, కిర్స్టీ గోర్డాన్, ఐల్సా లిస్టర్, మైసీ మాసీరా, అబ్తాహా మక్సూద్, మేగన్ మెక్‌కోల్, రేచల్ స్లేటర్, పిప్పా స్ప్రౌల్శ్రీలంకచమరి ఆటపట్టు (కెప్టెన్), హాసిని పెరెరా, విష్మి గుణరత్నే, హర్షిత సమరవిక్రమ, ఇమేషా దులాని, నీలక్షిక సిల్వా, కవీషా దిల్హరి, హన్సిమా కరుణరత్నే, కౌషిణి నుత్యాంగన, సుగందిక దాసనాయక, నిమాషా మదుషాని, కావ్య మదుషాని, కావ్య మదుషాని, మల్కి మదర, మిథాలి అయోధ్య, చేతన విముక్తి.వెస్టిండీస్హేలీ మాథ్యూస్ (కెప్టెన్), చినెల్లే హెన్రీ, డియాండ్రా డాటిన్, స్టెఫానీ టేలర్, అఫీ ఫ్లెచర్, ఆలియా అలీన్, షెమైన్ క్యాంప్‌బెల్లే, అష్మిని మునిసార్, కరిష్మా రామ్‌హారక్, జన్నీలియా గ్లాస్గో, జహజారా క్లాక్స్టన్, కియానా జోసెఫ్, మాన్షా హేగ్రుక్, జైదా జేమ్స్, మాండీ మంగ్రూ, షానిష హెక్టార్.ప్రత్యక్ష ప్రసారం👉స్టార్ స్పోర్ట్స్ (టీవీ), జియోహాట్‌స్టార్ (డిజిటల్).మ్యాచ్ ఆరంభ సమయాలుభారత కాలమానం ప్రకారం: మధ్యాహ్నం మూడు గంటలు, రాత్రి ఏడు గంటలు, పదకొండు గంటలకు ఆరంభం.చదవండి: గంభీర్‌ను పట్టించుకోని సీనియర్లు! -
‘నన్ను రిటైర్ అవ్వమంటున్నారా?’.. భారత కెప్టెన్ అసహనం!
జూన్ 11 నుంచి ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌కు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈసారి పొట్టి ప్రపంచకప్‌కు ఇంగ్లండ్ వేదిక కానుంది. టీ20 ప్రపంచకప్‌లో పాల్గొంటున్న ఆయా జట్ల కెప్టెన్లు ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా గడుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే టీమిండియా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ కూడా లండన్‌లో ఒక మీడియా కార్యక్రమంలో పాల్గొంది.ఈ సందర్భంగా ఒక రిపోర్టర్ హర్మన్‌ప్రీత్ కౌర్‌ను ఉద్దేశించి..‘హర్మన్‌ప్రీత్ కౌర్.. ఇది మీకు చివరి టీ20 ప్రపంచ కప్ అవుతుందా? దీనిపై మీరేమంటారు?’ అని ప్రశ్నించారు. ఈ ప్రశ్నతో ఒక్కసారిగా అసహనానికి గురైన హర్మన్‌ప్రీత్ కౌర్.. ‘ఇది నా చివరి వరల్డ్ కప్ ఎందుకు అవుతుంది? నేనేమైనా రిటైర్ అయిపోవాలని మీరు కోరుకుంటున్నారా?’ అంటూ హర్మన్‌ప్రీత్ ఎదురుప్రశ్న వేశారు. దాంతో సదరు రిపోర్టర్ పరిస్థితిని సర్దుబాటు చేసేందుకు ప్రయత్నిస్తూ.. ‘లేదు.. నేను కేవలం తెలుసుకోవాలని అడిగాను. ఇది మీ చివరి ప్రపంచకప్ కాదని వినడం నాకు సంతోషంగా ఉంది’ అని రిపోర్టర్ చెప్పారు. అయినప్పటికీ తగ్గని హర్మన్‌ప్రీత్ కౌర్.. ‘మరి అలాంటప్పుడు అసలు ఆ ప్రశ్న ఎందుకు అడుగుతున్నారు?’ అంటూ నిలదీశారు. హర్మన్ మాట్లాడుతూ.. వన్డే వరల్డ్‌కప్ నెగ్గడంతో సహజంగానే మాపై అంచనాలు ఉంటాయి. భారీ అంచనాలు ఎల్లప్పుడూ ఉంటాయి. ఇలాంటి సమయంలో ఆ అంచనాలను అందుకుంటూనే ఆటపై పూర్తి ఫోకస్‌ను ఉండేలా చూసుకోవాలి. కానీ వన్డే ఫార్మాట్, టీ20 ఫార్మాట్లు వేర్వేరు. ఈ రెండింటికీ వ్యత్యాసం ఉంటుంది. మ్యాచ్‌ల విషయంలో ప్రజలు ఎంతో భావోద్వేగంతో ఉంటారు. వారు ఎప్పటికప్పుడు మమ్మల్ని నిశితంగా పరిశీలిస్తారు. ’ అని చెప్పుకొచ్చింది. గతేడాది సొంతగడ్డపై జరిగిన వన్డే ప్రపంచకప్‌ను గెలిచిన హర్మన్‌సేనపై భారీ అంచనాలున్నాయి. జూన్ 14 నుంచి భారత్ తమ ప్రపంచకప్ ప్రయాణాన్ని ఆరంభించనుంది. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా దాయాది పాకిస్తాన్‌తో టీమిండియా తొలి మ్యాచ్ ఆడనుంది. -
ఏడు వికెట్ల తేడాతో భారత్ జయభేరి
చెమ్స్‌ఫోర్డ్: ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌కు ముందు జరిగిన ఏకైక ప్రాక్టీస్ మ్యాచ్‌లో భారత మహిళల జట్టు 7 వికెట్ల తేడాతో ఈసీబీ డెవలప్మెంట్ ఉమెన్ ఎలెవన్‌పై విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఈసీబీ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. ఫ్లోరెన్స్ మిల్లర్ (48; 7 ఫోర్లు), జోన్ గార్డ్నర్ (36; 3 ఫోర్లు, 1 సిక్స్), సోఫియా స్మేల్ (27; 3 ఫోర్లు) రాణించారు. భారత బౌలర్లలో హైదరాబాదీ అరుంధతి రెడ్డి 3 ఓవర్లలో 29 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టింది. అనంతరం భారత్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 200 పరుగులు సాధించింది. 17వ ఓవర్ రెండో బంతికి భారత్ 155 పరుగుల విజయలక్ష్యాన్ని అందుకున్నా...మరింత ప్రాక్టీస్ కోసం ఇన్నింగ్స్‌ను 20 ఓవర్ల వరకు కొనసాగించారు. షఫాలీ వర్మ (25 బంతుల్లో 50 రిటైర్డ్ అవుట్; 9 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీ చేయగా... భారతి ఫుల్మలి (29 బంతుల్లో 48; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు), యస్తిక భాటియా (35 బంతుల్లో 47; 6 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. భారత్, ఇంగ్లండ్ మహిళా జట్ల మధ్య ఈ నెల 28, 30 తేదీల్లో చెమ్స్‌ఫోర్డ్, బ్రిస్టల్లలో తొలి రెండు టీ20లు జరగనుండగా... జూన్ 2న టాంటన్‌లో చివరి టి20 నిర్వహిస్తారు. ఆ తర్వాత జూన్ 12 నుంచి జరిగే టీ20 వరల్డ్ కప్‌లో భారత బృందం బరిలోకి దిగుతుంది. చదవండి: నకిలీ నవ్వులు.. వాళ్లిద్దరు చెత్త కెప్టెన్లు: సౌతాఫ్రికా దిగ్గజం -
మెగాటోర్నీకి ముందు ఆసీస్ స్టార్ షాకింగ్ నిర్ణయం!
ఆస్ట్రేలియా స్టార్ బౌలర్ మేగన్ స్కట్ రిటైర్మెంట్పై కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే నెలలో ప్రారంభం కానున్న ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ ముగిసిన అనంతరం ఆటకు వీడ్కోలు పలకనున్నట్లు మేగన్ స్కట్ వెల్లడించింది. తర్వాతి జనరేషన్‌కు అవకాశాలు ఇవ్వా లనే ఉద్దేశంతోనే రిటైర్మెంట్ తీసుకోవాలనే నిర్ణయానికి వచ్చినట్లు ఆమె తెలిపింది.దీంతో మహిళల టీ20 ప్రపంచకప్ మేఘన్ స్కట్‌కు చివరి అంతర్జాతీయ టోర్నీ కానుంది. 33 ఏళ్ల మేగన్ స్కట్ 2012లో 20 ఏళ్ల వయసులో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసింది. అనతికాలంలోనే ఆసీస్ స్టార్ ప్లేయర్‌గా పేరు పొందిన మేగన్ స్కట్ ఆ జట్టు తరఫున నాలుగు టెస్టులు, 111 వన్డేలు, 125 టీ20 మ్యాచ్‌లు ఆడింది. మొత్తం 240 అంతర్జాతీయ మ్యాచ్‌లాడిన మేగన్ స్కట్ 309 వికెట్లు పడగొట్టింది. ఇందులో వన్డేల్లో 148 వికెట్లు, టీ20ల్లో 152 వికెట్లు ఉన్నాయి. మహిళల క్రికెట్ చరిత్రలో వన్డేల్లో అత్యంత వేగంగా వంద వికెట్లు పూర్తి చేసిన రెండో బౌలర్‌గానూ రికార్డులకెక్కింది. టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో మేగన్ అగ్రస్థానంలో ఉంది. అంతేకాదు అంతర్జాతీయ మహిళల టీ20 క్రికెట్లో హ్యాట్రిక్ సాధించిన మొదటి బౌలర్‌గానూ మేగన్ రికార్డులకెక్కింది.ఇక తన రిటైర్మెంట్ ప్లాన్‌పై మేగన్ స్కట్ స్పందించింది. ‘14 ఏళ్ల కెరీర్ నాకు ఎంతో సంతృప్తినిచ్చింది. తర్వాతి తరానికి అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతోనే రిటైర్మెంట్ ఇవ్వాలని నిర్ణయిం చుకున్నా. ఐసీసీ టీ20 ప్రపంచకప్ నాకు చివరి టోర్నీ కానుంది.’ అని చెప్పుకొచ్చింది. మేగన్ స్కట్.. రెండు వన్డే ప్రపంచకప్(2013, 2022)లతో పాటు మూడు టీ20 ప్రపంచకప్‌లు (2108, 2020, 2026) గెలిచిన ఆసీస్ జట్టులో సభ్యురాలిగా ఉంది. జూన్ 12న ప్రారంభం కానున్న మెగా టోర్నీలో ఆస్ట్రేలియా జట్టు తమ తొలి మ్యాచ్‌ను జూన్ 13న సౌతాఫ్రికాతో ఆడనుంది.లెస్బియన్‌తో వివాహంఅడిలైడ్కు చెందిన మేఘన్ స్కట్ తన దీర్ఘకాల భాగస్వామి జెస్ హోలియోక్ను వివాహం చేసుకుంది. ఆస్ట్రేలియాలో స్వలింగ వివాహాలు చట్టబద్ధం అయిన తర్వాత 2019లో ఈ జంట పెళ్లి చేసుకున్నారు. 2021 ఆగస్టులో, అత్యవసర సి-సెక్షన్ సరోగసి ద్వారా నెలలు నిండని బిడ్డకు జన్మనిచ్చారు. ఆ బిడ్డకు రైలీ లూయిస్ అని పేరు పెట్టారు. అయితే 2025లో జెస్తో తన పదేళ్ల రిలేషిన్షిప్ ముగిసిందంటూ మేగన్ స్కట్ ఇన్స్టాగ్రామ్ వేదికగా పంచుకుంది. ప్రస్తుతం విడిగా ఉంటున్నప్పటికీ మేగన్, జెస్‌లు కలిసి మిరాకిల్ బేబీస్ ఫౌండేషన్‌కు రాయబారులుగా పనిచేస్తూ, నెలలు నిండకుండా పుట్టిన శిశువుల సంరక్షణపై అవగాహన కల్పిస్తున్నారు. చదవండి: 25 బంతుల్లోనే సెంచరీ బాదిన వైభవ్! -
ప్రపంచకప్‌కు బంగ్లాదేశ్.. మరో జట్టుగా..!
జూన్ 12 నుంచి ఇంగ్లండ్ మరియు వేల్స్ వేదికగా జరగనున్న ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్-2026కు బంగ్లాదేశ్ అర్హత సాధించింది. నేపాల్‌లో జరిగిన సూపర్ సిక్స్ మ్యాచ్‌లో (ప్రపంచకప్ క్వాలిఫయర్) థాయ్‌లాండ్‌పై 39 పరుగుల తేడాతో విజయం సాధించడం ద్వారా ప్రపంచకప్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది.మరోవైపు నెదర్లాండ్స్ జట్టు తొలిసారి మహిళల టీ20 ప్రపంచకప్‌కు అర్హత సాధించి చరిత్ర సృష్టించింది. గ్రూప్ దశలో స్కాట్లాండ్, థాయ్‌లాండ్, నేపాల్, జింబాబ్వేపై వరుస విజయాలు సాధించి సూపర్ సిక్స్‌లోకి ప్రవేశించిన నెదర్లాండ్స్.. టాప్-4లో (సూపర్ సిక్స్‌లో) బంగ్లాదేశ్ తర్వాత రెండో స్థానంలో నిలిచి ప్రపంచకప్ బెర్త్ కన్ఫర్మ్ చేసుకుంది.ప్రపంచకప్ క్వాలిఫయర్‌లో మొత్తం 10 జట్లు పాల్గొంటుండగా.. సూపర్-6 దశలో టాప్-4లో నిలిచే జట్లు ప్రపంచకప్ బెర్త్‌లను దక్కించుకుంటాయి. ప్రస్తుతం బంగ్లాదేశ్, నెదర్లాండ్స్ వరల్డ్‌కప్ టికెట్‌ను కన్ఫర్మ్ చేసుకోగా.. మిగతా రెండు బెర్త్‌ల కోసం పోటీలు జరుగనున్నాయి. ప్రపంచకప్‌కు ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, భారత్, న్యూజిలాండ్, సౌతాఫ్రికా, వెస్టిండీస్, పాకిస్తాన్, శ్రీలంక నేరుగా అర్హత సాధించాయి.కాగా, జూన్ 12న బర్మింగ్‌హామ్ వేదికగా ఇంగ్లండ్-శ్రీలంక మధ్య జరిగే మ్యాచ్‌తో మహిళల టీ20 ప్రపంచకప్ 2026 మొదలవుతుంది. ఈ టోర్నీలో జూన్ 14న భారత్-పాకిస్తాన్ మ్యాచ్ జరుగనుంది. ఈ టోర్నీలో న్యూజిలాండ్ డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగనుంది. చివరిగా జరిగిన 2024 ఎడిషన్‌లో న్యూజిలాండ్ విజేతగా నిలిచింది. మహిళల టీ20 ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌కు ఇదే తొలి టైటిల్. ఆ ఎడిషన్ ఫైనల్లో న్యూజిలాండ్ సౌతాఫ్రికాను ఓడించి, జగజ్జేతగా అవతరించింది. -
T20 WC 2026: వార్మప్ మ్యాచ్‌ల వేదికలు ప్రకటించిన ఐసీసీ
మహిళల టీ20 ప్రపంచకప్-2026 (T20 WC 2026) టోర్నమెంట్‌కు సంబంధించిన అంతర్జాతీయ మండలి (ICC) తాజాగా ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ మెగా ఈవెంట్ సన్నాహకాల్లో భాగంగా జట్లు ఆడనున్న వార్మప్ మ్యాచ్‌ల వేదికలను ఖరారు చేసింది. కాగా వచ్చే ఏడాది జూన్ 12- జూలై 5 వరకు టీ20 ప్రపంచకప్ నిర్వహణకు ఐసీసీ షెడ్యూల్ విడుదల చేసిన విషయం తెలిసిందే.ఇంగ్లండ్ వేదికగా జరుగనున్న ఈ ఐసీసీ టోర్నీలో మొత్తం పన్నెండు జట్లు పాల్గొననున్నాయి. ఆస్ట్రేలియా, భారత్, సౌతాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, శ్రీలంక, వెస్టిండీస్, పాకిస్తాన్‌లు ఇప్పటికే అర్హత సాధించగా.. గ్లోబల్ క్వాలిఫయర్స్ ఫలితాల ఆధారంగా మరో నాలుగు జట్లు ఈ టోర్నీ ఆడతాయి. వీటిని రెండు గ్రూపులుగా విభజించి.. ఒక్కో గ్రూపులో ఆరు జట్లను ఆడిస్తారు.ఇక ఈ టోర్నీని 24 రోజుల పాటు నిర్వహించనుండగా.. ఎడ్జ్‌బాస్టన్, ఓల్డ్ ట్రఫోర్డ్ క్రికెట్ గ్రౌండ్, హాంప్‌షైర్ బౌల్, హెడింగ్లీ, బ్రిస్టల్ కౌంటీ గ్రౌండ్, లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్, ది ఓవల్ మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. అయితే, వార్మప్ మ్యాచ్‌లకు సంబంధించి షెడ్యూల్ ఖరారు చేయని ఐసీసీ.. వేదికలకు మాత్రం ఫైనల్ చేసింది. కార్డిఫ్స్ సోఫియా గార్డెన్స్, డెర్బీ కౌంటీ గ్రౌండ్, లొబరో యూనివర్సిటీ మైదానాల్లో సన్నాహక మ్యాచ్‌లు జరుగుతాయని గురువారం వెల్లడించింది.కాగా 2024 నాటి మహిళల టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్లో న్యూజిలాండ్ చాంపియన్‌గా నిలిచింది. ఇదిలా ఉంటే.. ఈసారి భారత్ జూన్ 14 నాటి తమ తొలి మ్యాచ్‌లోనే దాయాది పాకిస్తాన్‌ను ఢీకొట్టనుంది. ఆ తర్వాత గ్లోబల్ క్వాలిఫయర్ నుంచి వచ్చిన జట్టుతో జూన్ 17న మ్యాచ్ ఆడుతుంది. అనంతరం సౌతాఫ్రికాతో జూన్ 21, క్వాలిఫయర్ జట్టుతో జూన్ 25, ఆస్ట్రేలియాతో జూన్ 28న భారత జట్టు తలపడనుంది. ఈ టోర్నీలో భాగంగా మొత్తం 33 మ్యాచ్‌లు జరుగుతాయి.చదవండి: నేను ఎదుర్కొన్న టఫెస్ట్ బౌలర్ అతడే: శిఖర్ ధావన్ -
భారత్ X పాకిస్తాన్
దుబాయ్: వచ్చే ఏడాది జరగనున్న అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) మహిళల టి20 ప్రపంచకప్‌లో భారత జట్టు తొలి పోరులో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో తలపడనుంది. ఇంగ్లండ్ వేదికగా 2026 జూన్ 12 నుంచి ఈ మెగా టోర్నీ ప్రారంభం కానుంది. దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను ఇంగ్లండ్, వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) బుధవారం విడుదల చేసింది. 24 రోజుల పాటు సాగనున్న ఈ టోర్నీ ఫైనల్ జూలై 5న ప్రఖ్యాత లార్డ్స్ స్టేడియంలో జరగనుంది. మొత్తం ఏడు వేదికల్లో 33 మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. గ్రూప్ ‘ఎ’లో ఉన్న భారత జట్టు తమ తొలి పోరులో వచ్చే ఏడాది జూన్ 14న ఎడ్జ్‌బాస్టన్ వేదికగా దాయాది పాకిస్తాన్‌తో తలపడనుంది. » ఇంగ్లండ్, బంగ్లాదేశ్ మధ్య జూన్ 12న జరిగే మ్యాచ్‌తో ప్రపంచకప్‌నకు తెరవలేవనుంది. » లార్డ్స్ వేదికగా ఫైనల్ జరగనుండగా... ఎడ్జ్‌బాస్టన్, హ్యాంప్‌షైర్ బౌల్, హెడింగ్లీ, ఓల్డ్ ట్రాఫోర్డ్, ద ఓవల్, బ్రిస్టల్ కౌంటీ గ్రౌండ్స్‌లో మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. » జూన్ 30, జూలై 2న ఓవల్ వేదికగా రెండు సెమీఫైనల్స్ జరగనున్నాయి. » మహిళల వరల్డ్‌కప్‌లో మొత్తం 12 దేశాలు పాల్గొంటుండగా... అందులో ఆరేసి జట్లను రెండు గ్రూప్‌లుగా విభజించారు. » ఆరుసార్లు ప్రపంచ చాంపియన్ ఆ్రస్టేలియా, పాకిస్తాన్, దక్షిణాఫ్రికాతో కలిసి టీమిండియా గ్రూప్ ‘ఎ’ నుంచి బరిలోకి దిగనుంది. మరో రెండు జట్లు క్వాలిఫయింగ్ టోర్నీ ద్వారా గ్రూప్ ‘ఎ’లో పోటీపడతాయి. » డిఫెండింగ్ చాంపియన్ న్యూజిలాండ్, ఇంగ్లండ్, వెస్టిండీస్, శ్రీలంకతో పాటు మరో రెండు క్వాలిఫయింగ్ జట్లు గ్రూప్ ‘బి’లో ఉన్నాయి. » గ్రూప్ దశలో అగ్రస్థానంలో నిలిచిన రెండేసి జట్లు సెమీఫైనల్‌కు అర్హత సాధించనున్నాయి. » తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్‌తో పోరు అనంతరం భారత జట్టు వరుసగా... జూన్ 17న క్వాలిఫయింగ్ జట్టుతో... 21న దక్షిణాఫ్రికాతో... 25న క్వాలిఫయింగ్ టీమ్‌తో... 28న ఆస్ట్రేలియాతో తలపడనుంది. » దేశంలోని ప్రఖ్యాత స్టేడియంలో మ్యాచ్‌లు నిర్వహిస్తున్నామని... వరల్డ్‌కప్ మ్యాచ్‌లను ప్రత్యక్షంగా వీక్షించేందుకు భారీగా ప్రేక్షకులు తరలివస్తారని టోర్నమెంట్ డైరెక్టర్ బెత్ బారెట్ విల్డ్ ఆశాభావం వ్యక్తం చేశాడు. -
టీ20 ప్రపంచకప్-2026 షెడ్యూల్ విడుదల
మహిళల టీ20 ప్రపంచకప్-2026 (ICC Women's T20 World Cup) షెడ్యూల్ విడుదలైంది. ఇంగ్లండ్ వేదికగా ఈ ఐసీసీ టోర్నీకి వచ్చే ఏడాది జూన్ 12న తెర లేవనుంది. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) ఈ మేరకు బుధవారం ప్రకటన విడుదల చేసింది.ఈ మెగా ఈవెంట్లో పన్నెండు జట్లు భాగం కానున్నాయి. భారత్, ఆస్ట్రేలియా, పాకిస్తాన్, సౌతాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, శ్రీలంక, వెస్టిండీస్‌లతో పాటు.. గ్లోబల్ క్వాలిఫయర్స్ ఫలితాల ఆధారంగా మరో నాలుగు జట్లు వరల్డ్‌కప్‌నకు అర్హత సాధించనున్నాయి.ఈ పన్నెండు జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూప్-ఎ నుంచి ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, భారత్, పాకిస్తాన్‌తో పాటు మరో రెండు జట్లు.. గ్రూప్-బి నుంచి ఇంగ్లండ్, న్యూజిలాండ్, శ్రీలంక, వెస్టిండీస్‌లతో పాటు మరో రెండు టీమ్‌లు పోటీపడనున్నాయి.డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి న్యూజిలాండ్కాగా చివరగా 2024లో జరిగిన మహిళల టీ20 ప్రపంచకప్ టోర్నీలో న్యూజిలాండ్ విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. ఇక టీ20 ప్రపంచకప్-2026 ఏడు వేదికల్లో 24 రోజుల పాటు సాగనుంది. ఇందులో భాగంగా 33 మ్యాచ్‌లు జరుగనున్నాయి.కాగా ఎడ్జ్‌బాస్టన్, హాంప్‌షైర్ బౌల్, హెడ్డింగ్లీ, ఓల్డ్ ట్రఫోర్డ్, ది ఓవల్, బ్రిస్టల్ కౌంటీ గ్రౌండ్, లార్డ్స్ మైదానాలు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ఇంగ్లండ్- శ్రీలంక మధ్య మ్యాచ్‌తో జూన్ 12న మొదలయ్యే మహిళల టీ20 ప్రపంచకప్-2026 టోర్నీ జూలై 5న లార్డ్స్‌లో ఫైనల్‌తో ముగియనుంది.భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ అప్పుడే..ఈ మెగా టోర్నీలో భారత జట్టు తమ తొలి మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను ఢీకొట్టనుంది. జూన్ 14న ఈ హైవోల్టేజ్ మ్యాచ్ జరుగనుంది. అనంతరం గ్లోబ్ క్వాలిఫయర్ నుంచి వచ్చిన టీమ్‌తో జూన్ 17న భారత్ తలపడుతుంది.ఆ తర్వాత జూన్ 21న సౌతాఫ్రికాతో, జూన్ 25న క్వాలిఫయర్ జట్టుతో, జూన్ 28న పటిష్ట ఆస్ట్రేలియా జట్టుతో టీమిండియా అమీతుమీ తేల్చుకోనుంది.ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్-2026 పూర్తి షెడ్యూల్జూన్ 12- శుక్రవారం- ఇంగ్లండ్ వర్సెస్ శ్రీలంక, ఎడ్జ్బాస్టన్జూన్ 13- శనివారం: క్వాలిఫైయర్ vs క్వాలిఫైయర్, ఓల్డ్ ట్రఫోర్డ్ క్రికెట్ గ్రౌండ్జూన్ 13- శనివారం: ఆస్ట్రేలియా vs సౌతాఫ్రికా, ఓల్డ్ ట్రఫోర్డ్ క్రికెట్ గ్రౌండ్జూన్ 13- శనివారం: వెస్టిండీస్ vs న్యూజిలాండ్, హాంప్‌షైర్ బౌల్జూన్ 14- ఆదివారం: క్వాలిఫైయర్ vs క్వాలిఫైయర్, ఎడ్జ్బాస్టన్జూన్ 14- ఆదివారం: ఇండియా vs పాకిస్తాన్, ఎడ్జ్బాస్టన్జూన్ 16- మంగళవారం: న్యూజిలాండ్ vs శ్రీలంక, హాంప్‌షైర్ బౌల్జూన్ 16- మంగళవారం: ఇంగ్లండ్ vs క్వాలిఫయర్, హాంప్షైర్బౌల్జూన్ 17- బుధవారం: ఆస్ట్రేలియా vs క్వాలిఫయర్, హెడ్డింగ్లీజూన్ 17- బుధవారం: ఇండియా vs క్వాలిఫయర్, హెడ్డింగ్లీజూన్ 17- బుధవారం: సౌతాఫ్రికా vs పాకిస్తాన్, ఎడ్జ్బాస్టన్జూన్ 18- గురువారం: వెస్టిండీస్ vs క్వాలిఫయర్, హెడ్డింగ్లీజూన్ 19- శుక్రవారం: న్యూజిలాండ్ vs క్వాలిఫయర్, హాంప్‌షైర్ బౌల్జూన్ 20- శనివారం: ఆస్ట్రేలియా vs క్వాలిఫయర్, హాంప్‌షైర్ బౌల్జూన్ 20- శనివారం: ఇంగ్లండ్ vs క్వాలిఫయర్, హెడ్డింగ్లీజూన్ 21- ఆదివారం: వెస్టిండీస్ vs శ్రీలంక, బ్రిస్టల్ కౌంటీ గ్రౌండ్జూన్ 23- మంగళవారం: న్యూజిలాండ్ vs క్వాలిఫయర్, బ్రిస్టల్ కౌంటీ గ్రౌండ్జూన్ 23- మంగళవారం: శ్రీలంక vs క్వాలిఫయర్, బ్రిస్టల్ కౌంటీ గ్రౌండ్జూన్ 23- మంగళవారం: ఆస్ట్రేలియా vs పాకిస్తాన్, హెడ్డింగ్లీజూన్ 24- బుధవారం: ఇంగ్లండ్ vs వెస్టిండీస్, లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్జూన్ 25- గురువారం: ఇండియా vs క్వాలిఫయర్, ఓల్డ్ ట్రఫోర్డ్ క్రికెట్ గ్రౌండ్జూన్ 25- గురువారం: సౌతాఫ్రికా vs క్వాలిఫయర్, బ్రిస్టల్ కౌంటీ గ్రౌండ్జూన్ 26- శుక్రవారం: శ్రీలంక vs క్వాలిఫయర్, ఓల్డ్ ట్రఫోర్డ్ క్రికెట్ గ్రౌండ్జూన్ 27- శనివారం: పాకిస్తాన్ vs క్వాలిఫయర్, బ్రిస్టల్ కౌంటీ గ్రౌండ్జూన్ 27- శనివారం: వెస్టిండీస్ vs క్వాలిఫయర్, బ్రిస్టల్ కౌంటీ గ్రౌండ్జూన్ 27- శనివారం: ఇంగ్లండ్ vs న్యూజిలాండ్, ది ఓవల్జూన్ 28- ఆదివారం: సౌతాఫ్రికా vs క్వాలిఫయర్, లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్.జూన్ 28- ఆదివారం: ఆస్ట్రేలియా vs ఇండియా, లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్.జూన్ 30- మంగళవారం: సెమీ ఫైనల్ 1- ది ఓవల్జూలై 2- గురువారం: సెమీ ఫైనల్ 2- ది ఓవల్జూలై 5- ఆదివారం: ఫైనల్, లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్.చదవండి: గ్లెన్ మ్యాక్స్‌వెల్ విధ్వంసకర శతకం.. 13 సిక్సర్లతో


