భారత్‌ X పాకిస్తాన్‌ | ICC Womens T20 World Cup schedule released | Sakshi
Sakshi News home page

భారత్‌ X పాకిస్తాన్‌

Jun 19 2025 3:11 AM | Updated on Jun 19 2025 3:11 AM

ICC Womens T20 World Cup schedule released

వచ్చే ఏడాది జూన్‌ 14న దాయాదుల సమరం

ఐసీసీ మహిళల టి20 ప్రపంచకప్‌ షెడ్యూల్‌ విడుదల

జూన్‌ 12 నుంచి జూలై 5 వరకు ఇంగ్లండ్‌లో మెగా టోర్నీ  

దుబాయ్‌: వచ్చే ఏడాది జరగనున్న అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) మహిళల టి20 ప్రపంచకప్‌లో భారత జట్టు తొలి పోరులో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో తలపడనుంది. ఇంగ్లండ్‌ వేదికగా 2026 జూన్‌ 12 నుంచి ఈ మెగా టోర్నీ ప్రారంభం కానుంది. దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను ఇంగ్లండ్, వేల్స్‌ క్రికెట్‌ బోర్డు (ఈసీబీ) బుధవారం విడుదల చేసింది. 

24 రోజుల పాటు సాగనున్న ఈ టోర్నీ ఫైనల్‌ జూలై 5న ప్రఖ్యాత లార్డ్స్‌ స్టేడియంలో జరగనుంది. మొత్తం ఏడు వేదికల్లో 33 మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. గ్రూప్‌ ‘ఎ’లో ఉన్న భారత జట్టు తమ తొలి పోరులో వచ్చే ఏడాది జూన్‌ 14న ఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా దాయాది పాకిస్తాన్‌తో తలపడనుంది.  

» ఇంగ్లండ్, బంగ్లాదేశ్‌ మధ్య జూన్‌ 12న జరిగే మ్యాచ్‌తో ప్రపంచకప్‌నకు తెరవలేవనుంది.  
» లార్డ్స్‌ వేదికగా ఫైనల్‌ జరగనుండగా... ఎడ్జ్‌బాస్టన్, హ్యాంప్‌షైర్‌ బౌల్, హెడింగ్లీ, ఓల్డ్‌ ట్రాఫోర్డ్, ద ఓవల్, బ్రిస్టల్‌ కౌంటీ గ్రౌండ్స్‌లో మ్యాచ్‌లు నిర్వహించనున్నారు.  
»    జూన్‌ 30, జూలై 2న ఓవల్‌ వేదికగా రెండు సెమీఫైనల్స్‌ జరగనున్నాయి.  
»  మహిళల వరల్డ్‌కప్‌లో మొత్తం 12 దేశాలు పాల్గొంటుండగా... అందులో ఆరేసి జట్లను రెండు గ్రూప్‌లుగా విభజించారు.   
»   ఆరుసార్లు ప్రపంచ చాంపియన్‌ ఆ్రస్టేలియా, పాకిస్తాన్, దక్షిణాఫ్రికాతో కలిసి టీమిండియా గ్రూప్‌ ‘ఎ’ నుంచి బరిలోకి దిగనుంది. మరో రెండు జట్లు క్వాలిఫయింగ్‌ టోర్నీ ద్వారా గ్రూప్‌ ‘ఎ’లో పోటీపడతాయి.  
»    డిఫెండింగ్‌ చాంపియన్‌ న్యూజిలాండ్, ఇంగ్లండ్, వెస్టిండీస్, శ్రీలంకతో పాటు మరో రెండు క్వాలిఫయింగ్‌ జట్లు గ్రూప్‌ ‘బి’లో ఉన్నాయి.   
»  గ్రూప్‌ దశలో అగ్రస్థానంలో నిలిచిన రెండేసి జట్లు సెమీఫైనల్‌కు అర్హత సాధించనున్నాయి.  
»   తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్‌తో పోరు అనంతరం భారత జట్టు వరుసగా... జూన్‌ 17న క్వాలిఫయింగ్‌ జట్టుతో... 21న దక్షిణాఫ్రికాతో... 25న క్వాలిఫయింగ్‌ టీమ్‌తో... 28న ఆస్ట్రేలియాతో తలపడనుంది. 
» దేశంలోని ప్రఖ్యాత స్టేడియంలో మ్యాచ్‌లు నిర్వహిస్తున్నామని... వరల్డ్‌కప్‌ మ్యాచ్‌లను ప్రత్యక్షంగా వీక్షించేందుకు భారీగా ప్రేక్షకులు తరలివస్తారని టోర్నమెంట్‌ డైరెక్టర్‌ బెత్‌ బారెట్‌ విల్డ్‌ ఆశాభావం వ్యక్తం చేశాడు.

Advertisement
 
Advertisement
Advertisement