T20 WC 2026: వార్మప్‌ మ్యాచ్‌ల వేదికలు ప్రకటించిన ఐసీసీ | ICC Womens T20 World Cup 2026: ICC Announced 3 WarmUp Matches Venues, Read Full Story Inside | Sakshi
Sakshi News home page

T20 WC 2026: వార్మప్‌ మ్యాచ్‌ల వేదికలు ప్రకటించిన ఐసీసీ

Jul 10 2025 4:56 PM | Updated on Jul 10 2025 5:39 PM

ICC Womens T20 World Cup 2026: ICC Announced 3 warm up Venues

మహిళల టీ20 ప్రపంచకప్‌-2026 (T20 WC 2026) టోర్నమెంట్‌కు సంబంధించిన అంతర్జాతీయ మండలి (ICC) తాజాగా ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ మెగా ఈవెంట్‌ సన్నాహకాల్లో భాగంగా జట్లు ఆడనున్న వార్మప్‌ మ్యాచ్‌ల వేదికలను ఖరారు చేసింది. కాగా వచ్చే ఏడాది జూన్‌ 12- జూలై 5 వరకు టీ20 ప్రపంచకప్‌ నిర్వహణకు ఐసీసీ షెడ్యూల్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే.

ఇంగ్లండ్‌ వేదికగా జరుగనున్న ఈ ఐసీసీ టోర్నీలో మొత్తం పన్నెండు జట్లు పాల్గొననున్నాయి. ఆస్ట్రేలియా, భారత్‌, సౌతాఫ్రికా, ఇంగ్లండ్‌, న్యూజిలాండ్‌, శ్రీలంక, వెస్టిండీస్‌, పాకిస్తాన్‌లు ఇప్పటికే అర్హత సాధించగా.. గ్లోబల్‌ క్వాలిఫయర్స్‌ ఫలితాల ఆధారంగా మరో నాలుగు జట్లు ఈ టోర్నీ ఆడతాయి. వీటిని రెండు గ్రూపులుగా విభజించి.. ఒక్కో గ్రూపులో ఆరు జట్లను ఆడిస్తారు.

ఇక ఈ టోర్నీని 24 రోజుల పాటు నిర్వహించనుండగా.. ఎడ్జ్‌బాస్టన్‌, ఓల్డ్ ట్రఫోర్డ్ క్రికెట్ గ్రౌండ్, హాంప్‌షైర్ బౌల్, హెడింగ్లీ, బ్రిస్టల్‌ కౌంటీ గ్రౌండ్‌, లార్డ్స్‌ క్రికెట్‌ గ్రౌండ్‌, ది ఓవల్‌ మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. 

అయితే, వార్మప్‌ మ్యాచ్‌లకు సంబంధించి షెడ్యూల్‌ ఖరారు చేయని ఐసీసీ.. వేదికలకు మాత్రం ఫైనల్‌ చేసింది. కార్డిఫ్స్‌ సోఫియా గార్డెన్స్‌, డెర్బీ కౌంటీ గ్రౌండ్‌, లొబరో యూనివర్సిటీ మైదానాల్లో సన్నాహక మ్యాచ్‌లు జరుగుతాయని గురువారం వెల్లడించింది.

కాగా 2024 నాటి మహిళల టీ20 ప్రపంచకప్‌ టోర్నమెంట్లో న్యూజిలాండ్‌ చాంపియన్‌గా నిలిచింది. ఇదిలా ఉంటే.. ఈసారి భారత్‌ జూన్‌ 14 నాటి తమ తొలి మ్యాచ్‌లోనే దాయాది పాకిస్తాన్‌ను ఢీకొట్టనుంది. ఆ తర్వాత గ్లోబల్‌ క్వాలిఫయర్‌ నుంచి వచ్చిన జట్టుతో జూన్‌ 17న మ్యాచ్‌ ఆడుతుంది. అనంతరం సౌతాఫ్రికాతో జూన్‌ 21, క్వాలిఫయర్‌ జట్టుతో జూన్‌ 25, ఆస్ట్రేలియాతో జూన్‌ 28న భారత జట్టు తలపడనుంది. ఈ టోర్నీలో భాగంగా మొత్తం 33 మ్యాచ్‌లు జరుగుతాయి.

చదవండి: నేను ఎదుర్కొన్న టఫెస్ట్‌ బౌలర్‌ అతడే: శిఖర్‌ ధావన్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement