ముంబైకి సూర్య గుడ్‌బై!.. గంభీర్‌తో కలిసి ఆ జట్టులోకి?! | Suryakumar To Leave MI: Uthappa predicts SKY Reunion with Gambhir | Sakshi
Sakshi News home page

ముంబైకి సూర్య గుడ్‌బై!.. గంభీర్‌తో కలిసి ఆ జట్టులోకి?!

Jun 18 2026 12:49 PM | Updated on Jun 18 2026 1:40 PM

Suryakumar To Leave MI: Uthappa predicts SKY Reunion with Gambhir

గంభీర్‌తో సూర్య (PC: BCCI)

టీమిండియాకు టీ20 ప్రపంచకప్‌ అందించిన మూడో కెప్టెన్‌గా ఘనత సాధించాడు సూర్యకుమార్‌ యాదవ్‌. కానీ ఆ ఆనందం మూణ్ణెళ్ల ముచ్చటే అయింది. అనూహ్య రీతితో సూర్యను టీ20 కెప్టెన్సీ నుంచి తప్పించడంతో పాటు.. జట్టులో చోటే లేకుండా చేసింది యాజమాన్యం.

ఐర్లాండ్‌, ఇంగ్లండ్‌ పర్యటనలకు తొలుత సూర్యనే సారథ్యం వహిస్తాడనే ప్రచారం జరగ్గా.. భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (BCCI) మాత్రం నిర్దాక్షిణ్యంగా అతడిపై వేటు వేసింది. బ్యాటర్‌గా విఫలమవుతున్న సూర్యను జట్టు నుంచి కూడా తప్పించింది.

బ్యాటర్‌గా విఫలం 
ఇక టీ20 ప్రపంచకప్‌-2026తో పాటు ఐపీఎల్‌-2026 సీజన్‌లోనూ 35 ఏళ్ల సూర్యకుమార్‌ యాదవ్‌ వ్యక్తిగతంగా దారుణ ప్రదర్శన కనబరిచాడు. ముంబై ఇండియన్స్‌ తరఫున 13 మ్యాచ్‌లలో కలిపి కేవలం 270 పరుగులే చేశాడు. ఈ పరిణామాల క్రమంలో భారత టీ20 జట్టులో చోటు కూడా కోల్పోయాడు.

ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్‌ రాబిన్‌ ఊతప్ప సూర్యకుమార్‌ భవితవ్యం గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈ ముంబైకర్‌ 40 ఏళ్ల వయసు వచ్చేంత వరకు ఐపీఎల్‌ ఆడతాడని.. అయితే, టీమిండియాలో మాత్రం అతడు తిరిగి చోటు దక్కించుకోలేడని అభిప్రాయపడ్డాడు. అంతేకాదు అతడి ముంబై ఇండియన్స్‌ను వీడితే బాగుంటుందని సూచించాడు.

ముంబైని వీడి...
ఈ మేరకు కామ్‌బాక్స్‌ టీవీతో మాట్లాడుతూ.. ‘‘నాకు తెలిసి సూర్య తిరిగి కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ (KKR)తో జట్టుకడితే బాగుంటుంది. నేను చెప్పేది కాస్త విచిత్రంగా అనిపించవచ్చు. కానీ ఇది జరిగే అవకాశం లేకపోలేదు.

వన్డే వరల్డ్‌కప్‌-2027 తర్వాత టీమిండియా హెడ్‌కోచ్‌గా గౌతం గంభీర్‌ పదవీకాలం ముగుస్తుంది. ఆ తర్వాత అతడు కేకేఆర్‌ హెడ్‌కోచ్‌, మెంటార్‌గా తిరిగి వస్తాడు. అప్పుడు కేకేఆర్‌కు సూర్య కెప్టెన్‌ అవుతాడు. గంభీర్‌ తప్పక సూర్యకు మద్దతుగా ఉంటాడు’’ అని రాబిన్‌ ఊతప్ప జోస్యం చెప్పాడు.

గతంలో ఆ జట్టుకే ఆడాడు
కాగా 2014- 2017 మధ్య కాలంలో గంభీర్‌ కెప్టెన్సీలో సూర్యకుమార్‌ యాదవ్‌ కేకేఆర్‌కు ప్రాతినిథ్యం వహించాడు. తాను పదవి నుంచి వైదొలిగే కంటే ముందు నాయకత్వ బృందంలో సూర్యను చేర్చేలా గంభీర్‌ మద్దతు ఇచ్చాడు. అతడిని వైస్‌ కెప్టెన్‌గా నియమించడంలో కీలక పాత్ర పోషించాడు. 

ఈ నేపథ్యంలోనే ఊతప్ప ఈ మేరకు తన అభిప్రాయాల్ని వ్యక్తం చేసి ఉంటాడు. కాగా గంభీర్‌ మార్గదర్శనంలో సూర్య సారథ్యంలో టీమిండియా ఈ ఏడాది టీ20 ప్రపంచకప్‌ గెలిచిన సంగతి తెలిసిందే.

చదవండి: డబుల్‌ సెంచరీ చేసేవాడినే.. కానీ: గిల్‌

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement