
ఆసియా కప్-2025 టోర్నీలో పాకిస్తాన్‌కు మరోసారి చేదు అనుభవం తప్పలేదు. దుబాయ్‌లో ఆదివారం జరిగిన సూపర్- 4 మ్యాచ్‌లో టీమిండియా చేతిలో సల్మాన్ ఆఘా బృందం ఓటమిపాలైంది. ఈ నేపథ్యంలో.. నో-షేక్‌హ్యాండ్ వివాదం తర్వాత పాక్ క్రికెట్ బోర్డు మరోసారి అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) తలుపుతట్టింది.
అప్పుడలా.. ఇప్పుడు ఇంకో ఏడుపు!
కాగా లీగ్ దశలో పాక్‌తో మ్యాచ్ సందర్భంగా టీమిండియా ఆటగాళ్లు పాక్ జట్టుతో కరచాలనం చేసేందుకు నిరాకరించారు. పహల్గామ్ ఉగ్రదాడికి నిరసనగా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అయితే, దీనిని అవమానంగా భావించిన పాక్.. మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ (Andy Pycropt) వల్లే ఇలా జరిగిందంటూ ఐసీసీకి ఫిర్యాదు చేసింది.
రిఫరీగా ఆండీ పైక్రాఫ్ట్‌ను తొలగించాలంటూ డిమాండ్ చేసింది. అయితే, ఐసీసీ మాత్రం దిగిరాలేదు. పాక్ ఆడే మ్యాచ్‌లకు మరోసారి అతడినే రిఫరీగా ఎంపిక చేసింది. లీగ్ దశలో ఆఖరిగా యూఏఈతో పాటు.. తాజాగా టీమిండియాతో సూపర్-4 మ్యాచ్‌లోనూ ఆండీ పైక్రాఫ్ట్ రిఫరీగా వ్యవహరించాడు.
క్యాచ్ విషయంలో వివాదం
ఇదిలా ఉంటే.. ఆదివారం నాటి మ్యాచ్‌లో పాక్ ఓపెనర్ ఫఖర్ జమాన్ 15 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఉండగా.. హార్దిక్ పాండ్యా (Hardik Pandya) బౌలింగ్‌లో భారత వికెట్ కీపర్ సంజూ శాంసన్ (Sanju Samson)కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. అయితే, బంతి నేలను తాకిన తర్వాతే సంజూ చేతుల్లోకి వెళ్లిందని భావించిన ఫఖర్ జమాన్.. కాసేపు క్రీజులోనే ఉండి అసహనం వ్యక్తం చేశాడు.
ఈ విషయంలో ఫీల్డ్ అంపైర్ స్పష్టతనివ్వకపోవడంతో.. టీవీ అంపైర్ దగ్గరకు పంచాయతీ చేరింది. అయితే, వివిధ కోణాల్లో పరిశీలించిన తర్వాత.. బంతి కింద సంజూ వేళ్లు ఉన్నాయంటూ.. దీనిని క్లీన్ అవుట్‌గా ప్రకటించారు. ఈ నేపథ్యంలో పాక్ అంపైర్ తీరుపై అసంతృప్తి వెళ్లగక్కింది.
పాకిస్తాన్‌కు మరోసారి షాకిచ్చాడు!
ఈ విషయమై రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్‌కు ఫిర్యాదు చేయగా.. తన పరిధిలో లేదంటూ ఆయన బదులిచ్చినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో పాక్ సన్నిహిత వర్గాలు టెలికామ్‌ఏసియా.నెట్‌తో మాట్లాడుతూ.. ‘‘పాకిస్తాన్ జట్టు మేనేజర్ నవీద్ చీమా మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్‌కు ఈ విషయం గురించి ఫిర్యాదు చేశాడు.
అయితే, తన పరిధిలో లేదంటూ ఆయన రిప్లై ఇచ్చాడు. దీంతో మేనేజర్ ఐసీసీకి మెయిల్ చేశాడు. అంపైర్‌పై ఫిర్యాదు చేశాడు’’ అని పేర్కొన్నాయి.
ఇక మ్యాచ్ ముగిసిన తర్వాత పాక్ కెప్టెన్ సల్మాన్ ఆఘా మాట్లాడుతూ.. ‘‘అంపైర్లు కొన్నిసార్లు తప్పులు చేస్తారు. అది సహజమే. కానీ ఈసారి బంతి కీపర్ చేతుల్లో పడేకంటే ముందు నేలను తాకినట్లు అనిపించింది’’ అని పేర్కొన్నాడు.
చదవండి: ఎవర్నీ లెక్కచేయను.. నా తీరే అంత.. నచ్చినట్లు చేస్తా: పాక్ బ్యాటర్ ఎక్స్‌ట్రాలు