జైస్వాల్- జురెల్ (PC: BCCI/RR)
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ఫ్రాంఛైజీ రాజస్తాన్ రాయల్స్‌తో టీమిండియా స్టార్ సంజూ శాంసన్ (Sanju Samson) బంధం ముగిసినట్లు తెలుస్తోంది. పదకొండు సీజన్లుగా రాజస్తాన్ జట్టుతో కొనసాగిన ఈ కేరళ వికెట్ కీపర్ బ్యాటర్.. కెప్టెన్‌గానూ సేవలు అందించాడు.
ఐపీఎల్‌లో మొట్టమొదటి విజేత అయిన రాజస్తాన్‌ను.. పద్నాలుగేళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత తన సారథ్యంలో రెండోసారి ఫైనల్ (2022)కు చేర్చాడు సంజూ. అయితే దురదృష్టవశాత్తూ గుజరాత్ టైటాన్స్‌తో ఫైనల్లో ఓడిపోవడంతో రాజస్తాన్‌తో పాటు కెప్టెన్‌గా కప్పు గెలవాలన్న సంజూ ఆశలకు గండిపడింది.
యాజమాన్యంతో విభేదాలు
కాగా గత కొంతకాలంగా సంజూకు.. రాజస్తాన్ జట్టు యాజమాన్యంతో విభేదాలు తలెత్తినట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఐపీఎల్-2026 వేలానికి ముందే ట్రేడింగ్ ద్వారా జట్టు మారేందుకు సంజూ నిశ్చియించుకున్నాడనే ప్రచారం తాజాగా జోరందుకుంది. చెన్నై సూపర్ కింగ్స్ (CSK) సంజూను రాజస్తాన్ నుంచి ట్రేడింగ్ (స్వాప్ డీల్) ద్వారా దక్కించుకోవడం దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది.
రవీంద్ర జడేజా (Ravindra Jadeja)ను రాజస్తాన్‌కు ఇచ్చి.. అందుకు బదులుగా సంజూను సీఎస్‌కే దక్కించుకోనుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ అదే జరిగితే.. రాజస్తాన్ జట్టుకు కొత్త కెప్టెన్ ఎవరనే చర్చ మొదలైంది.
రియాన్ పరాగ్ కాదు!
కాగా సంజూ గైర్హాజరీలో అస్సాం ఆటగాడు రియాన్ పరాగ్ జట్టును ముందుకు నడిపించాడు. ఐపీఎల్-2025లో సంజూ ఫిట్‌నెస్ సమస్యల వల్ల కెప్టెన్సీని దూరంగా ఉండగా.. పరాగ్ సారథిగా ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాడు.
ఈసారి రాజస్తాన్ మరీ దారుణంగా పద్నాలుగింట కేవలం నాలుగు మాత్రమే గెలిచి తొమ్మిదో స్థానానికి పరిమితమైంది. ఈ నేపథ్యంలో పరాగ్‌కు కెప్టెన్సీ ఇవ్వకపోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తం అవుతుండగా... టీమిండియా నయా సంచలనం ధ్రువ్ జురెల్ పేరు తెర మీదకు వచ్చింది.
కెప్టెన్సీ రేసులో ఇద్దరు
రూ. 20 లక్షల కనీస ధరతో రాజస్తాన్ క్యాంపులోకి వచ్చిన జురెల్ అనతికాలంలోనే.. జట్టులో కీలక ఆటగాడిగా ఎదిగాడు. ఈ క్రమంలోనే అతడిని ఫ్రాంఛైజీ రూ. 14 కోట్ల భారీ మొత్తానికి గతేడాది రిటైన్ చేసుకుంది. గత కొంతకాలంగా అతడు సూపర్‌ఫామ్‌లో ఉన్నాడు. టీమిండియాలోనూ కీలక సభ్యుడిగా మారాడు.
అంతేకాదు.. అనధికారిక టెస్టు సిరీస్‌లో భారత్- ‘ఎ’ జట్టు కెప్టెన్‌గా పనిచేసిన అనుభవం కూడా జురెల్‌కు ఉంది. అదే విధంగా.. అండర్-19 స్థాయిలో 2020 వరల్డ్‌కప్‌లో భారత జట్టు వైస్ కెప్టెన్‌గానూ జురెల్ సేవలు అందించాడు. ఇక యూపీ టీ20 లీగ్‌లో గోరఖ్‌పూర్ లయన్స్ జట్టుకు సారథి కూడా జురెలే!
ఈ నేపథ్యంలో పరాగ్‌ను కాదని.. మేనేజ్‌మెంట్ జురెల్ వైపే మొగ్గుచూపుతుందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అయితే, మరికొందరు విశ్లేషకులు మాత్రం టీమిండియా స్టార్ ఓపెనర్ యశస్వి జైస్వాల్‌కే రాజస్తాన్ పగ్గాలు అప్పగిస్తారనే విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.
కాగా 2020లో రాజస్తాన్ తరఫున అరంగేట్రం చేసిన జైస్వాల్.. ఇప్పటికి 66 మ్యాచ్‌లలో కలిపి 2166 పరుగులు సాధించాడు. ఈ లెఫ్టాండర్ ఖాతాలో రెండు సెంచరీలు కూడా ఉన్నాయి. అయితే, 23 ఏళ్ల జైసూకు ఏ స్థాయిలోనూ కెప్టెన్‌గా పనిచేసిన అనుభవం మాత్రం లేదు. అయితే, అతడి అవకాశాలను మాత్రం కొట్టిపడేయలేము.
రాయల్స్ కొత్త కెప్టెన్‌గా అతడే!
రాజస్తాన్ రాయల్స్ కొత్త హెడ్‌కోచ్ కుమార్ సంగక్కర.. జురెల్‌తో పాటు జైస్వాల్ కెప్టెన్సీ రేసులో ఉన్నాడని చెప్పినట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం పేర్కొనడం గమనార్హం. అయితే, ఇంపాక్ట్ రూల్ ప్రకారం ఓపెనర్‌గా జైసూకు ప్రత్యామ్నాయం ఉంటుంది. కానీ వికెట్ కీపర్‌గా 24 ఏళ్ల జురెల్ కొనసాగుతాడు! కాబట్టి ప్లేయింగ్ ఎలెవన్‌లో తప్పకుండా ఉంటాడు. అందుకే అతడికే కెప్టెన్సీ చేపట్టే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
చదవండి: ‘ఆడమని బతిమిలాడినా పట్టించుకోలేదు... సెలక్టర్లు అడిగినా రాలేదు’


