ఆసియా కప్‌-2025 జట్టు ఇదే: సంజూ, రింకూ, తిలక్‌లకు నో ఛాన్స్‌! | No Sanju Tilak Rinku: Harbhajan Singh Picks His Asia Cup 2025 Squad | Sakshi
Sakshi News home page

‘ఆసియా కప్‌-2025 జట్టు ఇదే: సంజూ, రింకూ, తిలక్‌లకు నో ఛాన్స్‌’

Aug 16 2025 12:47 PM | Updated on Aug 16 2025 1:56 PM

No Sanju Tilak Rinku: Harbhajan Singh Picks His Asia Cup 2025 Squad

ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌ ముగించుకున్న భారత క్రికెట్‌ జట్టు తదుపరి ఆసియా కప్‌-2025 (Asia Cup)కి సన్నద్ధం కానుంది. యూఏఈ వేదికగా సెప్టెంబరు 9- 28 మధ్య టీ20 ఫార్మాట్లో ఈ టోర్నమెంట్‌ను నిర్వహించనున్నారు. ఈ మెగా ఈవెంట్‌కు సంబంధించి భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (BCCI) ఆగష్టు ఆఖరి వారంలో జట్టును ప్రకటించే అవకాశం ఉంది.

గిల్‌, జైసూ, శ్రేయస్‌ రైట్‌ రైట్‌
ఈ నేపథ్యంలో.. వరల్డ్‌కప్‌ చాంపియన్‌, టీమిండియా దిగ్గజ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌ ఆసియా కప్‌ టోర్నీకి తన జట్టును ప్రకటించాడు. రెగ్యులర్‌ కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌నే సారథిగా కొనసాగించాలన్న భజ్జీ.. టెస్టు కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌ (Shubman Gil)తో పాటు యశస్వి జైస్వాల్‌ (Yashasvi Jaiswal)ను కూడా ఈ టోర్నీలో ఆడించాలని బీసీసీఐకి సూచించాడు.

సంజూ వద్దు.. రిషభ్‌ ముద్దు
అదే విధంగా.. వీరితో పాటు శ్రేయస్‌ అయ్యర్‌ను కూడా తిరిగి టీ20 జట్టులోకి తీసుకుంటే బాగుంటుందని భజ్జీ అభిప్రాయపడ్డాడు. ఇక ఏడాది కాలంగా టీ20 ఫార్మాట్లో టీమిండియా ఓపెనర్‌, వికెట్‌ కీపర్‌గా ప్రధాన పాత్ర పోషిస్తున్న సంజూ శాంసన్‌ను భజ్జీ పక్కనపెట్టాడు. వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌గా కేఎల్‌ రాహుల్‌ మంచి ఆప్షన్‌ అని.. అయితే, తాను మాత్రం రిషభ్‌ పంత్‌కే ఓటు వేస్తానని హర్భజన్‌ సింగ్‌ స్పష్టం చేశాడు.

రియాన్‌ పరాగ్‌కు చోటు.. రింకూకు మొండిచేయి
ఇక పేస్‌ దళంలో నాయకుడు జస్‌ప్రీత్‌ బుమ్రాతో పాటు మహ్మద్‌ సిరాజ్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌లకు భజ్జీ స్థానం ఇచ్చాడు.  అదే విధంగా ఆల్‌రౌండర్ల కోటాలో హార్దిక్‌ పాండ్యా, వాషింగ్టన్‌ సుందర్‌, అక్షర్‌ పటేల్‌, రియాన్‌ పరాగ్‌లను హర్భజన్‌ ఎంపిక చేశాడు. ఇక చైనామన్‌ స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌కు కూడా భజ్జీ తన జట్టులో చోటిచ్చాడు.

ఓపెనర్‌గా అభిషేక్‌ శర్మను కొనసాగించాలన్న భజ్జీ.. అతడికి జోడీగా సంజూను కాదని యశస్వి జైస్వాల్‌ను ఎంచుకున్నాడు. ఇక మూడో స్థానంలో తిలక్‌ వర్మను కాదని శుబ్‌మన్‌ గిల్‌కు ఓటేశాడు. ఇక నయా ఫినిషర్‌గా పేరొందిన రింకూ సింగ్‌కు కూడా భజ్జీ మొండిచేయి చూపాడు. టైమ్స్‌ ఆఫ్‌ ఇండియాతో మాట్లాడుతూ హర్భజన్‌ సింగ్‌ ఈ మేరకు తన అభిప్రాయాలు పంచుకున్నాడు.

కాగా కఠినమైన సౌతాఫ్రికా పిచ్‌లపై వరుస శతకాలు బాదిన కేరళ బ్యాటర్‌ సంజూ శాంసన్‌, హైదరాబాదీ తిలక్‌ వర్మలను భజ్జీ పక్కన పెట్టడంపై సోషల్‌ మీడియా వేదికగా విమర్శలు వస్తున్నాయి. గిల్‌, జైసూల టీమిండియా టీ20 రీ ఎంట్రీ కోసం సౌత్‌ ప్లేయర్లపై వేటు వేయాలనడం సరికాదని నెటిజన్లు హితవు పలుకుతున్నారు.

ఆసియా కప్‌-2025కి హర్భజన్‌ సింగ్‌ ఎంచుకున్న భారత జట్టు
యశస్వి జైస్వాల్‌, అభిషేక్ శర్మ, శుబ్‌మన్‌ గిల్‌, సూర్యకుమార్‌ యాదవ్‌ (కెప్టెన్‌), హార్దిక్‌ పాండ్యా, శ్రేయస్‌ అయ్యర్‌, వాషింగ్టన్‌ సుందర్‌, రిషభ్‌ పంత్‌/కేఎల్‌ రాహుల్‌, రియాన్‌ పరాగ్‌, కుల్దీప్‌ యాదవ్‌, అక్షర్‌ పటేల్‌, మహ్మద్‌ సిరాజ్‌, జస్‌ప్రీత్‌ బుమ్రా, అర్ష్‌దీప్‌ సింగ్‌.

చదవండి: సంజూ శాంసన్‌ మెరుపు ఇన్నింగ్స్‌.. టీమిండియా సెలక్టర్లకు వార్నింగ్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement