
టీమిండియా యాజమాన్యం తీరుపై భారత మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధు (Navjot Singh Sidhu) ఆగ్రహం వ్యక్తం చేశాడు. గాయంతో బాధపడుతున్న ఆటగాడిపై కనికరం చూపకపోవడం ఏమిటని ప్రశ్నించాడు. కొంతమంది ఆటగాళ్లను బెంచ్‌కే పరిమితం చేసి.. మరికొందరిని మాత్రం రేసు గుర్రాల్లా ఎందుకు పరుగెత్తిస్తున్నారంటూ మండిపడ్డాడు.
అసలేం జరిగిందంటే.. ఇంగ్లండ్ (IND vs ENG)తో చావోరేవో తేల్చుకోవాల్సిన ఐదో టెస్టులో టీమిండియా ఆఖరి వరకు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చిన విషయం తెలిసిందే. ఓవల్ టెస్టులో భారత్ విధించిన 374 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఇంగ్లండ్ బ్యాటర్లు జో రూట్ (105), హ్యారీ బ్రూక్ (111) శతకాలతో చెలరేగి తమ జట్టును పటిష్ట స్థితిలో నిలిపారు.
ఇంజక్షన్ తీసుకున్నావా?
ఆరంభంలోనే ఈ జోడీని విడదీసేందుకు భారత బౌలర్లు ఎంత కష్టపడినా ఫలితం దక్కలేదు. ఈ తరుణంలో కెప్టెన్ శుబ్‌మన్ గిల్.. పేసర్ ఆకాశ్ దీప్‌ను ఉద్దేశించి.. ‘‘ఇంజక్షన్ తీసుకున్నావా’’ అంటూ ఆరా తీయడం స్టంప్ మైకులో రికార్డయింది. కాగా వెన్నునొప్పి వల్ల నాలుగో టెస్టుకు దూరమైన ఈ రైటార్మ్ పేసర్‌కు.. ఐదో టెస్టులోనూ కాలికి గాయమైంది. అయినా సరే అతడిని ఆటలో కొనసాగించారు.
ఎట్టకేలకు ఆఖరిదైన ఐదో రోజు టీమిండియా విజయానికి నాలుగు వికెట్లు అవసరం కాగా.. మహ్మద్ సిరాజ్ మూడు, ప్రసిద్ కృష్ణ ఒక వికెట్ తీసి జట్టును గెలిపించారు. ఈ పరిణామాల నేపథ్యంలో నవజ్యోత్ సింగ్ సిద్ధు మాట్లాడుతూ.. ‘‘ఆకాశ్ దీప్ ఇంజక్షన్ తీసుకున్నాడా? లేదా? అన్న విషయం గురించి అడిగినట్లు ఇంగ్లిష్ కామెంట్రీలో స్పష్టంగా వినిపించింది.
హేయమైన చర్య
ఓ బౌలర్‌కు ఇంజక్షన్ ఇచ్చిన తర్వాత కూడా టెస్టు మ్యాచ్ ఆడిస్తున్నారా? ఫిట్‌గా ఉన్న లెఫ్టార్మ్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్‌ను మాత్రం బెంచ్ మీదే ఉంచుతారు. ఆకాశ్ బదులు అతడిని ఎందుకు ఆడించరు?
పూర్తి ఫిట్‌గా లేని ఆటగాడితో బరిలోకి దిగడం నేరం లాంటిదే. హేయమైన తప్పిదం. మీ జట్టులోని మరో ఇద్దరు బౌలర్లు పూర్తి ఫిట్‌గా ఉన్నా వారిని ఆడించరు. రేసుగుర్రాల్లా మిగతావారిని పరిగెత్తిస్తారు.
సిరాజ్‌కు విశ్రాంతే లేదు
సిరాజ్‌ను కూడా మీరు వరుస మ్యాచ్‌లలో వాడుకున్నారు. అతడు కూడా పూర్తిగా అలసిపోయాడు. అదే ఇంగ్లండ్ జట్టును చూడండి. వాళ్లు నలుగురు పేస్ బౌలర్లను ఆడించారు. అందులో ఒక్కరు గాయపడినా.. మిగతా ముగ్గురు బాగానే ఉన్నారు.
మీకు మాత్రం ముగ్గురంటే ముగ్గురే బౌలర్లు. అందులో ఒకరు సగం సగం ఫిట్‌గా ఉంటారు. అయినా ఇందులో ఆకాశ్ దీప్ తప్పేం లేదు’’ అని నవజ్యోత్ సింగ్ సిద్ధు టీమిండియా మేనేజ్‌మెంట్ తీరును విమర్శించాడు. ఇదిలా ఉంటే.. పనిభారం తగ్గించే దృష్ట్యా ప్రధాన పేసర్ జస్‌ప్రీత్ బుమ్రాను ఇంగ్లండ్‌లో ఐదింట కేవలం మూడు మ్యాచ్‌లలోనే యాజమాన్యం ఆడించింది.
వారిద్దరు ఒక్క మ్యాచ్ ఆడకుండానే..
మరోవైపు.. సిరాజ్ మాత్రం ఐదింటిలోనూ ఆడి వెయ్యికి పైగా బంతులు వేసి 23 వికెట్లు కూల్చాడు. ఇక.. చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌కు ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం రాకపోగా.. అర్ష్‌దీప్ సింగ్ టెస్టు అరంగేట్రం కూడా వాయిదా పడింది. ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్‌తో ఆండర్సన్- టెండుల్కర్ ట్రోఫీని టీమిండియా 2-2తో సమం చేసింది.
చదవండి: చెవికి అతికించి.. ఛీ!.. ఇలా చేశావేంటి?.. హ్యారీ బ్రూక్ చర్య వైరల్