
టీమిండియాతో ఐదో టెస్టు సందర్భంగా ఇంగ్లండ్ స్టార్ క్రికెటర్ హ్యారీ బ్రూక్ Harry Brook) చేసిన ఓ పని నెట్టింట వైరల్‌గా మారింది. ఓవల్ మ్యాచ్‌లో నాలుగో రోజు ఆటలో ఈ మిడిలార్డర్ బ్యాటర్ ఆకాశమే హద్దుగా చెలరేగిన విషయం తెలిసిందే.
పందొమ్మిది పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద బ్రూక్ ఇచ్చిన క్యాచ్‌ను ఒడిసిపట్టిన టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ (Mohammed Siraj).. ఆ వెంటనే బౌండరీ లైన్ తొక్కేశాడు. దీంతో లైఫ్‌లైన్ పొందిన బ్రూక్ ఆ తర్వాత వెనుదిరిగి చూడలేదు. ధనాధన్ దంచికొట్టి భారత బౌలర్లకు కొరకరాని కొయ్యగా తయారయ్యాడు.
చెవి వెనుక అతికించి.. ఆపై
కేవలం 98 బంతుల్లోనే హ్యారీ బ్రూక్.. 111 పరుగులతో సత్తా చాటి మ్యాచ్‌ను ఇంగ్లండ్ వైపునకు తిప్పే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో డ్రింక్స్ విరామ సమయంలో ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. డ్రింక్స్‌తో తన శరీరాన్ని హైడ్రేట్ చేసుకున్న తర్వాత.. చెవి వెనుక అతికించి పెట్టిన చ్యూయింగ్ గమ్ తీసి నోట్లో వేసుకున్నాడు. అంటే అప్పటికి దానిని బాగా నమిలిన బ్రూక్.. డ్రింక్స్ బ్రేక్ కోసం చెవి వెనక పెట్టాడన్న మాట!
ఛీ! ఇదేం పని బ్రూక్
ఇందుకు సంబంధించిన వీడియోను ఇంగ్లండ్ క్రికెట్ సోషల్ మీడియాలో షేర్ చేయగా నెటిజన్లను ఆకర్షిస్తోంది. ‘‘ఛీ! ఇదేం పని బ్రూక్.. బబుల్ గమ్ అంటే మరీ ఇంత పిచ్చి ఉంటుందా?’’ అంటూ నెటిజన్లు అతడిని సరదాగా ట్రోల్ చేస్తున్నారు. ఇక ఆ సమయంలో కామెంటేటర్లు రిక్కీ పాంటింగ్, రవిశాస్త్రి తమదైన శైలిలో బ్రూక్‌పై చణుకులు విసిరారు.
ఎక్కడో దాచి ఉంటాడు
‘‘రిక్కీ.. నువ్వు చూశావా? అదైతే చెవికి సంబంధించిన వస్తువు కాదు. అది కచ్చితంగా చ్యూయింగ్ గమ్ అని చెప్పగలను’’ అని రవిశాస్త్రి అన్నాడు. ఇందుకు బదులిస్తూ.. ‘‘అవును.. ఇలాంటిది నేనైతే ఇంతకు ముందెన్నడూ చూడలేదు. నాకు తెలిసి అతడి దగ్గర మరో రెండు పీసులు ఉండి ఉంటాయి. వాటిని ఎక్కడో దాచి ఉంటాడు’’ అని రిక్కీ పాంటింగ్ జోక్ చేశాడు.
ఇక ఇందుకు స్పందనగా.. ‘‘అతడు నీళ్లు తాగేశాడు. ఆ వెంటనే గమ్ అతడి నోట్లోకి వెళ్లింది. మళ్లీ బయటకు.. మళ్లీ లోపలకు. ప్రతిసారి అతడు చ్యూయింగ్ నములుతూనే ఉంటాడు’’ అని రవిశాస్త్రి అనగానే రిక్కీ పాంటింగ్ గట్టిగా నవ్వేశాడు.
టీమిండియా విజయం.. సిరీస్ సమం
ఇదిలా ఉంటే.. ఓవల్ టెస్టులో బ్రూక్ మెరుపులు వృథా అయ్యాయి. ఆఖరిదైన ఐదో రోజు ఇంగ్లండ్‌కు 35 పరుగులు కావాల్సి ఉండగా.. సిరాజ్ అద్బుత రీతిలో రాణించి ఆతిథ్య జట్టుకు చుక్కలు చూపించాడు. విజయానికి ఆరు పరుగుల దూరంలో ఉన్న వేళ ఇంగ్లండ్‌ను ఆలౌట్ చేసి.. టీమిండియాను గెలిపించాడు.
ఫలితంగా భారత్- ఇంగ్లండ్ మధ్య ఐదు మ్యాచ్‌ల ఆండర్సన్- టెండుల్కర్ ట్రోఫీ 2-2తో సమమైంది. హెడింగ్లీ, లార్డ్స్‌లో ఇంగ్లండ్ గెలవగా.. ఎడ్జ్‌బాస్టన్, ఓవల్‌లో టీమిండియా విజయం సాధించింది. మాంచెస్టర్‌లో జరిగిన నాలుగో టెస్టు డ్రా అయింది.
చదవండి: నువ్వు టీమిండియాలోకి ఎలా వచ్చావో మర్చిపోవద్దు: జైస్వాల్‌తో రోహిత్