
ముంబై జట్టును వీడాలని నిర్ణయించుకున్న టీమిండియా స్టార్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal) అనూహ్యంగా యూటర్న్ తీసుకున్నాడు. గోవాకు వెళ్లిపోవాలని నిశ్చయించుకున్న ఈ యువ ఆటగాడు తిరిగి ముంబైకే ఆడాలని ఫిక్సయ్యాడు. అయితే, జైసూ తన నిర్ణయం మార్చుకోవడానికి ప్రధాన కారణం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma).
ఈ విషయాన్ని ముంబై క్రికెట్ అసోసియేషన్ (MCA) అధ్యక్షుడు అజింక్య నాయక్ వెల్లడించాడు. ‘‘ముంబై వంటి జట్టుకు ప్రాతినిథ్యం వహించడం ఎంతటి గర్వకారణమో రోహిత్ శర్మ.. యశస్వికి అర్థమయ్యేలా చెప్పాడు.
టీమిండియాలోకి ఎలా వచ్చావో మర్చిపోవద్దు
రికార్డు స్థాయిలో 42సార్లు రంజీ ట్రోఫీ గెలిచిన ఘనమైన చరిత్ర ముంబైకి ఉంది. అంతేకాదు.. తన ప్రతిభను నిరూపించుకోవడానికి వేదికను కల్పించి.. టీమిండియాకు ఆడే స్థాయికి తీసుకువచ్చింది ముంబై అసోసియేషన్ అన్న విషయం మర్చిపోవద్దని రోహిత్.. యశస్వికి గుర్తు చేశాడు.
ఇందుకు యశస్వి ముంబైకి రుణపడి ఉండాలని హితబోధ చేశాడు. ముంబైలోనే క్రికెట్ ప్రయాణం మొదలుపెట్టిన యశస్వి.. ఇక్కడ అన్ని ఏజ్ గ్రూపుల జట్లకు ఎంపికైన విషయాన్ని మర్చిపోవద్దని సూచించాడు.
యశస్వి రిక్వెస్ట్.. మేము కూడా ఓకే చెప్పాము
రోహిత్ శర్మతో పాటు ముంబైకి ఆడిన మరి కొందరు దిగ్గజ క్రికెటర్లతో చర్చించిన తర్వాత యశస్వి జైస్వాల్ తనకు మంజూరు చేసిన నిరభ్యంతర పత్రాన్ని వెనక్కి తీసుకోవాలంటూ మాకు మరోసారి ఈ-మెయిల్ పంపాడు.
తాను గోవా జట్టుకు మారడం లేదని తెలిపాడు. మేము అతడి అభ్యర్థనకు సానుకూలంగా స్పందించి ఆమోదం తెలిపాము’’ అని అజింక్య నాయక్ పేర్కొన్నట్లు ముంబై మిర్రర్ తన కథనంలో వెల్లడించింది.
యూపీ నుంచి ముంబై.. టీమిండియా దాకా ఇలా
కాగా ఉత్తరప్రదేశ్‌కు చెందిన యశస్వి జైస్వాల్ క్రికెటర్ కావాలన్న కలను నెరవేర్చుకునేందుకు పదకొండేళ్ల వయసులో ముంబైకి వచ్చాడు. అంచెలంచెలుగా ఎదిగి భారత్ అండర్-19 జట్టులో చోటు సంపాదించిన ఈ లెఫ్టాండర్ బ్యాటర్.. 2020 వరల్డ్‌కప్‌లో రన్నరప్‌గా నిలిచిన జట్టులో సభ్యుడు. అంతకంటే ముందు ముంబై తరఫున దేశీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో డబుల్ సెంచరీ చేసి వెలుగులోకి వచ్చాడు.
అయితే, ముంబై జట్టులోని సీనియర్ ఆటగాడితో విభేదాలు అంటూ వార్తలు వచ్చిన వేళ.. తాను గోవాకు ఆడాలనుకుంటున్నట్లు ఎంసీఏకు యశస్వి లేఖ రాశాడు. అయితే, కొన్నిరోజుల తర్వాత మళ్లీ ముంబైకే ఆడతానని స్పష్టం చేశాడు. కాగా యశస్వి జైస్వాల్ ఇటీవల ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా ఐదు టెస్టుల సిరీస్ ఆడాడు. ఆండర్సన్ - టెండుల్కర్ ట్రోఫీలో జైసూ మొత్తంగా 400 పరుగులు సాధించాడు. ఇందులో రెండు శతకాలు, ఓ హాఫ్ సెంచరీ ఉన్నాయి.
ఇదిలా ఉంటే.. అంతర్జాతీయ టీ20లు, టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన ముంబై దిగ్గజం రోహిత్ శర్మ.. ప్రస్తుతం టీమిండియా వన్డే జట్టు కెప్టెన్‌గా కొనసాగుతున్నాడు. కాగా జైసూ రోహిత్ శర్మకు ఓపెనింగ్ జోడీగా తన టెస్టు కెరీర్ ఆరంభించిన విషయం తెలిసిందే.
చదవండి: IND vs WI: అతడి ఖేల్ ఖతం.. శ్రేయస్ అయ్యర్ రీ ఎంట్రీ పక్కా!