నవంబర్ 19, 2023.. భారత క్రికెట్ అభిమానులకు గుండె కోత మిగిల్చిన రోజు. అదే రోజు రాత్రి కోట్లాది భారతీయుల కలలు, ఆశలు ఒక్క ఓటమితో అవిరయ్యాయి. వన్డే వరల్డ్‌కప్-2023 టోర్నీ ఆధ్యంతం ఆధిపత్యం ప్రదర్శించిన టీమిండియా.. అనూహ్యంగా ఆఖరి మెట్టుపై బోల్తా పడింది.
అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓటమి పాలైంది. అయితే ఆ ఓటమిని ఇప్పటికీ అప్పటి టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ జీర్ణించుకోలేకపోతున్నాడు. తాజాగా ఓ కార్యక్రమానికి హాజరైన రోహిత్ అప్పటి చేదు జ్ఞాపకాన్ని గుర్తుచేసుకున్నాడు. ఆ ఓటమి తనను ఎంతగానో కృంగదీసిందని హిట్‌మ్యాన్ భావోద్వేగానికి గురయ్యాడు.
"2023 వరల్డ్ కప్ ఫైనల్ ఓటమి తర్వాత నేను మానసికంగా కుంగిపోయాను. ఇకపై క్రికెట్ ఆడకూడదని, వెంటనే తప్పుకోవాలని అనుకున్నాను. ఎందుకంటే ఆ టోర్నీ కోసం నేను ఎంతగానో కష్టపడ్డాను. ఇక సాధించడానికి ఏమి మిగిల లేదన్పించింది. 2022లో కెప్టెన్సీ చేపట్టినప్పటి నుండి ప్రపంచకప్ గెలవడమే లక్ష్యంగా పెట్టుకున్నాను.
అటువంటిది ట్రోఫీకి అడుగుదూరంలో నిలిచిపోవడం నేను జీర్ణించుకోలేకపోయాను. మళ్లీ నాకు నేనే ధైర్యం చెప్పుకొని నెమ్మదిగా ఆ బాధ నుంచి బయటకు వచ్చాను. మరోసారి లక్ష్యంగా దిశగా అడుగులు వేయాలని నిర్ణయించుకున్నాను. జీవితం అక్కడితో అగిపోదు.. కొత్తగా నా ప్రయాణాన్ని ప్రారంభించాలనుకున్నాను. ఆ పట్టుదలే 2024 టీ20 ప్రపంచ కప్ విజేతగా మమ్మల్ని నిలబెట్టింది" అని మాస్టర్స్ యూనియన్ కార్యక్రమంలో రోహిత్ పేర్కొన్నాడు.
చదవండి: IND vs SL: చరిత్ర సృష్టించిన స్మృతి మంధాన.. తొలి ప్లేయర్‌గా


