మౌంట్ మాంగనుయ్ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన మూడో టెస్టులో 323 పరుగుల తేడాతో న్యూజిలాండ్ ఘన విజయం సాధించింది. ఈ విజయంతో మూడు టెస్టుల సిరీస్‌ను 2-0 తేడాతో కివీస్ సొంతం చేసుకుంది. 462 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో 138 పరుగులకే కుప్పకూలింది.
43/0 ఓవర్‌నైట్ స్కోర్‌తో ఐదో రోజు ఆటను ప్రారంభించిన కరేబియన్ జట్టు.. 95 పరుగుల వ్యవధిలోనే మొత్తం పది వికెట్లు కోల్పోయింది. కివీస్ బౌలర్ల ధాటికి విండీస్ బ్యాటర్లు విల్లవిల్లాడారు. ఓపెనర్ బ్రాండెన్ కింగ్(67) మినహా మిగితా ప్లేయర్లంతా దారుణంగా విఫలమయ్యారు. న్యూజిలాండ్ బౌలర్లలో జాకబ్ డఫీ మరోసారి 5 వికెట్లతో సత్తాచాటగా.. అజాజ్ పటేల్ మూడు వికెట్లు పడగొట్టారు.
దుమ్ములేపిన ఓపెనర్లు..
ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 8 వికెట్ల నష్టానికి 575 పరుగులు చేసింది. ఓపెనర్ డెవాన్ కాన్వే(367 బంతుల్లో 31 ఫోర్లతో 227 పరుగులు) డబుల్ సెంచరీతో చెలరేగగా.. టామ్ లాథమ్(137) కదం తొక్కాడు. అనంతరం విండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 420 పరుగులకు ఆలౌట్ అయింది.
ఓపెనర్లు బ్రాండన్ కింగ్ (63), జాన్ కాంప్‌బెల్ (45) మంచి ఆరంభం ఇవ్వగా.. కవేమ్ హాడ్జ్ (123) అజేయ సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్‌లోనూ కివీస్ ఓపెనర్లు దంచికొట్టారు. కాన్వే(101), లాథమ్(101) సెంచరీలతో మెరిశారు. దీంతో కివీస్ రెండో ఇన్నింగ్స్‌ను 306/2 వద్ద డిక్లేర్ చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో లభించిన ఆధిక్యాన్ని జోడించి విండీస్ ముందు 452 లక్ష్యాన్ని బ్లాక్ క్యాప్స్ ఉంచింది. ఈ భారీ లక్ష్యాన్ని చేధించలేక కరేబియన్ జట్టు చతకిల పడింది.
కాన్వే, లాథమ్ 879 పరుగులు...
ఈ సిరీస్‌లోని ఆరు ఇన్నింగ్స్‌ల్లో కలిపి డెవాన్ కాన్వే 75.3 సగటుతో 452 పరుగులు (0, 37, 60, 28, 227, 100) చేయగా... టామ్ లాథమ్ 71.1 సగటుతో 427 పరుగులు (24, 145, 11, 9, 137, 101) చేశాడు. "వాళ్ల (లాథమ్, కాన్వే) కష్టానికి ప్రతిఫలం ఇది. చాన్నాళ్లుగా వాళ్లు ఇలాంటి ప్రదర్శన చేసేందుకు కఠోర సాధన చేస్తున్నారు. మెండైన ఆత్మవిశ్వాసం వల్లే ఇది సాధ్యం. రెండో ఇన్నింగ్స్‌లో వేగంగా ఆడి ప్రత్యర్థి ముందు మంచి లక్ష్యాన్ని నిర్దేశించారు. పిచ్ కూడా బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంది" అని న్యూజిలాండ్ బ్యాటింగ్ కోచ్ ల్యూక్ రోంచీ అన్నాడు.
చదవండి: IND vs SL: చరిత్ర సృష్టించిన స్మృతి మంధాన.. తొలి ప్లేయర్‌గా


