ఇంగ్లండ్‌కు మరోసారి ఘోర పరాభవం ఎదురైంది. ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌ను వరుసగా రెండోసారి ఆస్ట్రేలియాకు కోల్పోయింది. సొంతగడ్డపై ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన కంగారూలు... మరో రెండు మ్యాచ్‌లు మిగిలుండగానే సిరీస్‌ను చేజిక్కించుకున్నారు. దీంతో ఇంగ్లండ్ బిక్కముఖం వేయాల్సి వచ్చింది.
సంపూర్ణ ఆధిపత్యం
ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా తొలి రెండు మ్యాచ్‌లలో ఇంగ్లండ్‌పై సంపూర్ణ ఆధిపత్యంతో గెలిచిన ఆసీస్.. మూడో టెస్టులోనూ దుమ్ములేపింది. అడిలైడ్ వేదికగా ఆదివారం ముగిసిన ఈ మ్యాచ్‌లో ఆసీస్ 82 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ను చిత్తుచేసింది.
ఆసీస్ విధించిన 435 పరుగుల విజయలక్ష్యంతో ఓవర్‌నైట్ స్కోరు 207/6తో చివరి రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఇంగ్లండ్... చివరకు 102.5 ఓవర్లలో 352 పరుగుల వద్ద ఆలౌటైంది.
ఇక 2011 నుంచి సొంతగడ్డపై ‘యాషెస్’ సిరీస్ కోల్పోని కంగారూలు... ఈసారి కూడా పూర్తి ఆధిపత్యం కనబర్చగా... అప్పటి నుంచి కనీసం ఒక్క మ్యాచ్‌లో అయినా విజయం సాధించాలనుకుంటున్న ఇంగ్లండ్ జట్టుకు మరోసారి నిరాశ తప్పలేదు.
చెలరేగిన బౌలర్లు
ఇంగ్లండ్ వికెట్ కీపర్ బ్యాటర్ జేమీ స్మిత్ (83 బంతుల్లో 60; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) కాస్త పోరాడగా... అతడికి విల్ జాక్స్ (137 బంతుల్లో 47; 3 ఫోర్లు), బ్రైడన్ కార్స్(64 బంతుల్లో 39 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్స్) సహకరించారు.
జేమీ స్మిత్‌తో కలిసి ఏడో వికెట్‌కు 91 పరుగులు జోడించిన జాక్స్... ఎనిమిదో వికెట్‌కు కార్స్‌తో 52 పరుగులు జతచేశాడు. దీంతో ఒకదశలో ఇంగ్లండ్‌కు ఆశలు చిగురించగా... స్టార్ పేసర్ స్టార్క్... స్మిత్, జాక్స్, ఆర్చర్ (3)లను ఆవుట్ చేసి ఇంగ్లండ్‌కు పరాజయం ఖాయం చేశాడు. ఆసీస్ బౌలర్లలో స్టార్క్, కమిన్స్, లయన్ తలా మూడు వికెట్లు పడగొట్టారు.
అంతకుముందు ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 371 పరుగులు చేయగా... ఇంగ్లండ్ 286 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్ 349 పరుగులు చేసి ప్రత్యర్థికి రికార్డు లక్ష్యాన్ని నిర్దేశించింది. అయితే, ఇంగ్లండ్ పని పూర్తి చేయలేక సిరీస్ ఓటమి రూపంలో మరోసారి చేదు అనుభవం ఎదుర్కొంది.
అత్యంత చెత్త జట్టు ఇది
ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ దిగ్గజ పేసర్ స్టువర్ట్ బ్రాడ్.. సిరీస్ విజేత ఆసీస్ జట్టును ఉద్దేశించి.. ‘చెత్త’ అంటూ చేసిన వ్యాఖ్యలను సమర్థించుకోవడం గమనార్హం. కాగా యాషెస్ సిరీస్‌కు ముందు బ్రాడ్ మాట్లాడుతూ.. ‘‘2010-11 తర్వాత యాషెస్ సిరీస్ ఆడుతున్న ఆస్ట్రేలియా అత్యంత చెత్త జట్టు ఇది. ఇదొక ఆప్షన్ కాదు. ఇదే నిజం’’ అని స్టువర్ట్ బ్రాడ్ పేర్కొన్నాడు.
ఇప్పటికీ ఇదే మాట అంటాను
ఈ క్రమంలో మరోసారి సిరీస్ గెలుచుకున్న అనంతరం ఆస్ట్రేలియా ఆటగాళ్లు.. బ్రాడ్‌కు పరోక్షంగా కౌంటర్లు ఇచ్చారు. ఈ నేపథ్యంలో మరోసారి తన వ్యాఖ్యలపై స్పందించిన బ్రాడ్.. ‘‘నేను పశ్చాత్తాపపడుతున్నానా? అస్సలు కాదు.
ఆస్ట్రేలియా అత్యంత చెత్తగా ఆడాల్సింది. ఇంగ్లండ్ అతి గొప్పగా ఆడాల్సింది. అయితే, ఆసీస్ మరీ అంత చెత్తగా ఆడలేదు. ఇంగ్లండ్ కూడా గొప్పగా ఏమీ ఆడలేదు’’ అని ‘ది లవ్ ఆఫ్ క్రికెట్’ పాడ్‌కాస్ట్‌లో పేర్కొన్నాడు.
కాగా కెప్టెన్ ప్యాట్ కమిన్స్‌తో పాటు మరో స్టార్ పేసర్ జోష్ హాజిల్‌వుడ్ కూడా తొలి రెండు టెస్టులకు దూరమయ్యారు. అయితే, మిచెల్ స్టార్క్ అద్భుత రీతిలో చెలరేగి వారు లేని లోటు కనబడకుండా చేశాడు. ఇక మూడో టెస్టుతో కమిన్స్ తిరిగి రాగా.. హాజిల్‌వుడ్ మాత్రం గాయం వల్ల సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు.
చదవండి: వాషీ, ఇషాన్ కిషన్ దండగ!.. ప్రపంచకప్ జట్టులో అవసరమా?


