టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్ ఆరంభానికి ముందు ఆస్ట్రేలియాకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. జట్టు స్టార్ పేసర్ ప్యాట్ కమిన్స్ టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. అతడితో పాటు టాపార్డర్ బ్యాటర్ మాథ్యూ షార్ట్ కూడా అందుబాటులో లేకుండా పోయాడు.
కమిన్స్ స్థానంలో అతడే
కమిన్స్, షార్ట్ గాయాల నుంచి కోలుకోని కారణంగా టోర్నీకి దూరమైనట్లు క్రికెట్ ఆస్ట్రేలియా (CA) శనివారం ధ్రువీకరించింది. ఈ విషయం గురించి సెలక్టర్ టోనీ డోడ్‌మేడ్ మాట్లాడుతూ.. ‘‘వెన్నునొప్పి నుంచి కోలుకోవడానికి ప్యాట్ కమిన్స్‌కు ఇంకాస్త సమయం పడుతుంది. అందుకే టోర్నీలో పాల్గొనడం లేదు.
కమిన్స్ స్థానంలో లెఫ్టార్మ్ పేసర్ బెన్ డ్వార్షుయిస్‌ను ఎంపిక చేశాము. ఫీల్డింగ్‌లో రాణించడంతో పాటు లోయర్ ఆర్డర్‌లో హిట్టింగ్ కూడా చేయగలడు. బంతి బాగా స్వింగ్ చేయగల బెన్ రాక పేస్ దళానికి మరింత వైవిధ్యం తీసుకువస్తుంది’’ అని తెలిపాడు.
మాథ్యూ షార్ట్‌కు బదులు అతడే
అదే విధంగా.. మాథ్యూ షార్ట్ స్థానంలో మ్యాట్ రెన్షాను వరల్డ్‌కప్ జట్టులో చేర్చినట్లు టోనీ ఈ సందర్భంగా వెల్లడించాడు. ‘‘ఆస్ట్రేలియా తరఫున వైట్‌బాల్ క్రికెట్‌లో, బిగ్‌బాష్ లీగ్‌లో రెన్షా అద్భుత ప్రదర్శనలతో ఆకట్టుకున్నాడు. మిడిలార్డర్‌లో అతడు జట్టుకు బలంగా మారుతాడు’’ అని పేర్కొన్నాడు.
కాగా భారత్- శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్య ఇస్తున్న టీ20 ప్రపంచకప్-2026 టోర్నీ ఫిబ్రవరి 7- మార్చి 8 మధ్య జరుగనుంది. మిచెల్ మార్ష్ సారథ్యంలో ఆసీస్ ఈ మెగా టోర్నీ బరిలో దిగనుంది.
టీ20 ప్రపంచకప్-2026 టోర్నీకి ఆస్ట్రేలియా జట్టు (Updated)
మిచెల్ మార్ష్ (కెప్టెన్), జేవియర్ బార్ట్‌లెట్, కూపర్ కొన్నోలీ, టిమ్ డేవిడ్, బెన్ డ్వార్షుయిస్, కామెరాన్ గ్రీన్, నాథన్ ఎల్లిస్, జోష్ హాజిల్‌వుడ్, ట్రవిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మాథ్యూ కుహ్నెమాన్, గ్లెన్ మాక్స్‌వెల్, మ్యాట్ రెన్షా, మార్కస్ స్టోయినిస్, ఆడమ్ జంపా.
చదవండి: WC 2026: భారత్‌తో మ్యాచ్‌కు ముందు పాకిస్తాన్‌కు భారీ షాక్


