ఇంజక్షన్‌ తీసుకున్నావా?.. పరితపించిపోయిన శుబ్‌మన్‌ గిల్‌ | Shubman Gill Desperate Query To India Pacer Caught On Stump Mic, Video Went Viral On Social Media | Sakshi
Sakshi News home page

ఇంజక్షన్‌ తీసుకున్నావా?.. పరితపించిపోయిన శుబ్‌మన్‌ గిల్‌

Aug 4 2025 9:21 AM | Updated on Aug 4 2025 10:44 AM

Injection Liya: Gill Desperate Query To India Pacer Caught On Stump Mic

టీమిండియా టెస్టు కెప్టెన్‌గా అరంగేట్రంలోనే బ్యాట్‌తో అదరగొట్టాడు శుబ్‌మన్‌ గిల్‌ (Shubman Gill). ఇంగ్లండ్‌తో లీడ్స్‌ టెస్టులో శతక్కొట్టిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్‌.. ఎడ్జ్‌బాస్టన్‌లో డబుల్‌ సెంచరీ, సెంచరీలతో అలరించాడు. తద్వారా ఈ వేదికపై అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన భారత సారథిగా నిలిచిన గిల్‌..  ఈ మైదానంలో తొలిసారి భారత్‌కు టెస్టు విజయం అందించిన కెప్టెన్‌గా చరిత్రకెక్కాడు.

మరోసారి శతక్కొట్టి
ఇక లార్డ్స్‌లో జరిగిన మూడో టెస్టులో విఫలమైనా.. మాంచెస్టర్‌ టెస్టులో సెంచరీ సాధించి డ్రా కావడంలో శుబ్‌మన్‌ గిల్‌ కీలక పాత్ర పోషించాడు. ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌ను సమం చేయాలంటే ఆఖరిదైన ఐదో టెస్టు (IND vs ENG 5th Test)లో టీమిండియా తప్పక గెలవాల్సిన పరిస్థితి.

రూట్‌, బ్రూక్‌ సెంచరీలు
చావోరేవో తేల్చుకోవాల్సిన ఈ మ్యాచ్‌లో టీమిండియా ఇంగ్లండ్‌కు 374 పరుగుల మేర మెరుగైన లక్ష్యమే విధించింది. కానీ ఫీల్డింగ్‌ తప్పిదాల కారణంగా భారీ మూల్యం చెల్లించాల్సిన పరిస్థితి వచ్చింది. జో రూట్‌ (Joe Root- 105) మరోసారి తన అనుభవంతో ఇంగ్లండ్‌ను గట్టెక్కించగా.. యువ ఆటగాడు హ్యారీ బ్రూక్‌ (111) అతడికి అండగా నిలిచాడు.

ఈ జోడీని విడదీసేందుకు భారత బౌలర్లు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. బౌలర్లను మార్చుతున్నా ప్రయోజనం లేకపోయింది. పేసర్లు మహ్మద్‌ సిరాజ్‌,  ప్రసిద్‌ కృష్ణలను వరుస విరామాల్లో బరిలోకి దించిన గిల్‌.. స్పిన్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్లు రవీంద్ర జడేజా, వాషింగ్టన్‌ సుందర్‌ సేవలను కూడా వాడుకున్నాడు.

నువ్వు ఇంజక్షన్‌ తీసుకున్నావా?
అయితే, వీరిద్దరు పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. దీంతో విసుగెత్తిన గిల్‌.. ఎలాగైనా మ్యాచ్‌ను తమవైపునకు తిప్పుకోవాలనే యోచనతో.. గాయపడిన ఆకాశ్‌ దీప్‌ను సిద్ధంగా ఉన్నావంటూ అడిగాడు. కాగా వెన్నునొప్పి కారణంగా నాలుగో టెస్టుకు దూరమైన ఆకాశ్‌ దీప్‌.. ఈ మ్యాచ్‌లో హ్యారీ బ్రూక్‌కు వేసిన బంతిని.. అతడు స్ట్రెయిట్‌ షాట్‌గా మలచగా.. దానిని ఆపే క్రమంలో గాయపడ్డాడు. అతడి కాలికి గాయమైంది.

అయితే, భోజన విరామ సమయానికి ముందు ఆకాశ్‌ దీప్‌ సేవలు వాడుకోవాలని భావించిన గిల్‌.. ‘‘నువ్వు ఇంజక్షన్‌ తీసుకున్నావా?’’ అంటూ అతడిని ప్రశ్నించాడు. ఈ మాటలు స్టంప్‌ మైకులో రికార్డు కాగా.. నెట్టింట వైరల్‌గా మారాయి. 

ఈ నేపథ్యంలో కామెంటేటర్‌, టీమిండియా మాజీ కోచ్‌ సంజయ్‌ బంగర్‌ స్పందిస్తూ.. ‘‘లంచ్‌ బ్రేక్‌ తర్వాత మరోసారి పేసర్లనే బరిలోకి దించాలని గిల్‌ భావిస్తున్నాడు’’ అంటూ ప్రత్యర్థి జట్టు వికెట్లు పడగొట్టేందుకు భారత సారథి ఎంతగా పరితపించిపోతున్నాడో తెలియజేశాడు.

కాగా బ్రూక్‌ను ఆకాశ్‌ దీప్‌ అవుట్‌ చేయగా.. రూట్‌ను ప్రసిద్‌ పెవిలియన్‌కు పంపాడు. నాలుగో రోజు ఆట ముగిసేసరికి ఇంగ్లండ్‌ ఆరు వికెట్ల నష్టానికి 339 పరుగులు చేసింది. ప్రసిద్‌ మూడు, సిరాజ్‌ రెండు, ఆకాశ్‌ దీప్‌ ఒక వికెట్‌ తమ ఖాతాలో వేసుకున్నారు.

ఈ నేపథ్యంలో భారత్‌- ఇంగ్లండ్‌ మధ్య ఐదో టెస్టు ఆఖరి రోజైన సోమవారం గిల్‌ సేన విజయానికి నాలుగు వికెట్లు అవసరం. అలా అయితేనే.. సిరీస్‌ను 2-2తో డ్రా చేయగలుగుతుంది. మరోవైపు.. ఆతిథ్య జట్టు గెలుపునకు 35 పరుగుల దూరంలో ఉంది. కాగా ఇంగ్లండ్‌తో ఆండర్సన్‌- టెండుల్కర్‌ ట్రోఫీతో గిల్‌ భారత టెస్టు జట్టు కెప్టెన్‌గా తన ప్రయాణం ఆరంభించిన విషయం తెలిసిందే.

చదవండి: IND vs ENG: అక్కడ నిల్చుని ఏం ఆలోచిస్తున్నావు సిరాజ్‌?.. రిక్కీ పాంటింగ్‌ ఫైర్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement