
టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ (Mohammed Siraj) తీరుపై ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం రిక్కీ పాంటింగ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. సిరాజ్ చేసిన తప్పు కారణంగా భారత జట్టు భారీ మూల్యమే చెల్లించాల్సి వస్తుందని అభిప్రాయపడ్డాడు. కాగా భారత్- ఇంగ్లండ్ (IND vs ENG) మధ్య ఐదో టెస్టు తుది అంకానికి చేరుకుంది.
దోబూచులాడుతున్న విజయం
క్రికెట్ ప్రేమికులకు అసలైన మజాను అందిస్తూ ఆఖరిదైన ఐదో రోజుకు చేరుకున్న ఆటలో సోమవారం ఫలితం వెలువడనుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా గెలవాలంటే ఇంకా నాలుగు వికెట్లు అవసరం కాగా.. ఇంగ్లండ్ విజయానికి 35 పరుగుల దూరంలో నిలిచింది.
నిజానికి ఓవల్ టెస్టులో టీమిండియాదే పైచేయి కావాల్సింది. కానీ హ్యారీ బ్రూక్ (Harry Brook- 111), జో రూట్ (105) శతకాలతో అదరగొట్టి ఇంగ్లండ్‌ను పటిష్ట స్థితిలో నిలిపారు. నిజానికి బ్రూక్ 19 పరుగుల వద్దే అవుటవ్వాలి.
సిరాజ్ చేసిన పొరపాటు వల్ల
కానీ సిరాజ్ చేసిన పొరపాటు ఇంగ్లండ్ శిబిరానికి బాగా కలిసి వచ్చింది. ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో 35వ ఓవర్ వేసిన ప్రసిధ్ కృష్ణ తొలి బంతికి బ్రూక్ భారీ షాట్‌కు ప్రయత్నించగా... ఫైన్ లెగ్‌లో ఉన్న సిరాజ్ చక్కగా క్యాచ్‌ను ఒడిసిపట్టాడు.
కానీ బంతి పట్టిన తర్వాత కుడికాలు కదిపి బౌండరీ లైన్ తొక్కేశాడు. దీంతో అది అనూహ్యంగా సిక్సర్ అయ్యింది. క్యాచ్ పట్టడంతోనే బౌలర్ ప్రసిధ్ సంబరం మొదలుపెడితే... సిక్సర్ కావడంతో బ్రూక్ పండగ చేసుకున్నాడు. అప్పటికి జట్టు స్కోరు 137/3 మాత్రమే!
ఇంగ్లండ్ ఇంకా లక్ష్యానికి 237 పరుగుల బహుదూరంలో ఉంది. ఇక్కడ బ్రూక్ ఒకవేళ నిష్క్రమించి ఉంటే... నాలుగో వికెట్ పడేది. ఇప్పటికే వోక్స్ అందుబాటులో లేకపోవడంతో చేతిలో ఉన్న 5 వికెట్లతో ఇంగ్లండ్ లక్ష్యఛేదన క్లిష్టమయ్యేది!
అక్కడ నిల్చుని ఏం ఆలోచిస్తున్నావు సిరాజ్?
కానీ తనకు దొరికిన లైఫ్‌లైన్‌ను సద్వినియోగం చేసుకున్న బ్రూక్ ఏకంగా సెంచరీ కొట్టేశాడు. ఈ నేపథ్యంలో కామెంటేటర్ రిక్కీ పాంటింగ్ మాట్లాడుతూ.. ‘‘అక్కడ నిల్చుని అతడు అసలు ఏం ఆలోచిస్తున్నాడు? నాకైతే అతడు బిక్కముఖం వేసుకుని చూస్తున్నాడనిపించింది.
నిజానికి ఆ క్యాచ్ పట్టడానికి కదిలే పనేలేదు. ఉన్నచోటే ఉండి బంతిని ఒడిసిపట్టవచ్చు. ఈ తప్పిదం కారణంగా భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చినా ఆశ్చర్యం లేదు. బ్రూక్ ఎంత బాగా బ్యాటింగ్ చేస్తున్నాడో చూస్తూనే ఉన్నాం. టీ20 మ్యాచ్ మాదిరి టెస్టులోనూ అతడు బౌలర్లను రీడ్ చేసి అనుకున్న ఫలితాలు రాబట్టడంలో దిట్ట’’ అంటూ సిరాజ్ తీరును విమర్శించాడు.
ఆట నిలిచే సమయానికి ఇలా..
ఇక 374 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ సోమవారం వెలుతురులేమి కారణంగా ఆట నిలిచే సమయానికి ఆరు వికెట్ల నష్టానికి 339 పరుగులు చేసింది. వికెట్ కీపర్ బ్యాటర్ జేమీ స్మిత్ రెండు, జేమీ ఓవర్టన్ సున్నా పరుగులతో క్రీజులో ఉన్నారు.
ఇక ఇంగ్లండ్ విజయానికి చేరువకావడంతో అవసరం పడితే.. ఆఖరి రోజు క్రిస్ వోక్స్ క్రీజులోకి దిగే అవకాశం ఉంది. కాగా గాయం కారణంగా తొలి ఇన్నింగ్స్‌లో అతడు ఆబ్సెంట్ హర్ట్‌గా వెనుదిరిగిన విషయం తెలిసిందే.
చదవండి: యశస్వి జైస్వాల్ వరల్డ్ రికార్డు.. ప్రపంచంలోనే ఏకైక ప్లేయర్‌గా..
Out? Six!?
What's Siraj done 😱 pic.twitter.com/hp6io4X27l— England Cricket (@englandcricket) August 3, 2025