
టీమిండియా ఓపెనర్ యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal) ఇంగ్లండ్‌తో ఐదో టెస్టులో అద్బుత శతకంతో మెరిశాడు. ఓవల్ మైదానంలో శుక్రవారం నాటి రెండో రోజు ఆటలో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న జైసూ.. శనివారం దానిని శతకంగా మలచుకున్నాడు. ఈ ఎడమచేతి వాటం 127 బంతుల్లో వంద పరుగులు పూర్తి చేసుకున్నాడు.
మొత్తంగా 164 బంతులు ఎదుర్కొన్న జైస్వాల్ పద్నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 71కి పైగా స్ట్రైక్‌రేటుతో 118 పరుగులు సాధించాడు. నిజానికి రెండో రోజు భారత్.. ఓపెనర్ కేఎల్ రాహుల్ (7), వన్‌డౌన్ బ్యాటర్ సాయి సుదర్శన్ (11) రూపంలో రెండు కీలక వికెట్లు కోల్పోయింది.
ఆరంభం నుంచే అదరగొట్టారు
ఈ క్రమంలో నైట్ వాచ్‌మన్‌గా ఆకాశ్ దీప్ (Akash Deep).. యశస్వికి జతయ్యాడు. అయితే, ఇద్దరూ కలిసి చక్కటి సమన్వయంతో స్ట్రైక్ రొటేట్ చేసుకుంటూ.. మూడో రోజు ఆరంభం నుంచే అదరగొట్టారు. ఇక ఆకాశ్ దీప్ ఊహించని రీతిలో బౌండరీలు బాదుతూ.. జైస్వాల్‌పై ఒత్తిడి తగ్గించాడు. మరోవైపు.. ఇంగ్లండ్ ఫీల్డర్ల తప్పిదాలు కూడా వీరికి కలిసివచ్చాయి.
తొలి అర్ధ శతకం
ఈ క్రమంలో ఆకాశ్ దీప్ తన టెస్టు కెరీర్‌లో తొలి అర్ధ శతకం (66) సాధించగా.. జైసూ ఆరో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలోనే 23 ఏళ్ల యశస్వి జైస్వాలో ఇంత వరకు టెస్టు క్రికెట్‌లో ఏ ఆటగాడికీ సాధ్యం కాని అత్యంత అరుదైన ఘనత సాధించాడు.
జైస్వాల్ ప్రపంచ రికార్డు
జైస్వాల్ సాధించిన సెంచరీ (వంద పరుగులు)లో 82 పరుగులు బిహైండ్ స్క్వేర్ పొజిషన్ నుంచి వచ్చినవే. ఇప్పటికి టెస్టు చరిత్రలో 1526 శతకాలు నమోదు కాగా.. ఇలా ఒక ప్రత్యేకమైన ఏరియా నుంచి ఏకంగా 82 పరుగులు సాధించి... శతకం పూర్తి చేసుకున్న ఏకైక ఆటగాడిగా జైస్వాల్ ప్రపంచ రికార్డు సృష్టించాడు.
నువ్వా- నేనా
ఇక మ్యాచ్ విషయానికొస్తే.. లండన్‌లోని ఓవల్ మైదానంలో ఇంగ్లండ్‌తో గురువారం మొదలైన ఐదో టెస్టులో టాస్ ఓడిన భారత్ తొలుత బ్యాటింగ్ చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో 224 పరుగులకు ఆలౌట్ అయింది. సాయి సుదర్శన్ (38) ఫర్వాలేదనిపించగా.. కరుణ్ నాయర్ (57) అర్ధ శతకంతో రాణించాడు.
ఇక ఇందుకు బదులుగా ఇంగ్లండ్ తమ మొదటి ఇన్నింగ్స్‌లో 247 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఆతిథ్య జట్టు ఆరంభంలో అదరగొట్టినా.. భారత పేసర్లు మహ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ చెరో నాలుగు వికెట్లు కూల్చి.. బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించారు. ఆకాశ్ దీప్ ఒక వికెట్ దక్కించుకున్నాడు.
ఈ క్రమంలో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన టీమిండియా శనివారం 74 ఓవర్ల ఆట పూర్తయ్యేసరికి ఆరు వికెట్ల నష్టానికి 312 పరుగులు చేసి.. 289 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. ధ్రువ్ జురెల్ 32, రవీంద్ర జడేజా 27 పరుగులతో ఆడుతున్నారు. ఇద్దరూ కలిసి 58 బంతుల్లో 39 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఇక ఇంగ్లండ్ బౌలర్లలో గస్ అట్కిన్సన్ మూడు, జోష్ టంగ్ రెండు వికెట్లు తీయగా.. జేమీ ఓవర్టన్ ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు.
చదవండి: బహిష్కరించిన భారత్.. పాక్ క్రికెట్ బోర్డు సంచలన నిర్ణయం!