టీమిండియా టీ20 ఓపెనర్ అభిషేక్ శర్మ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. న్యూజిలాండ్‌తో తొలి టీ20లో అద్భుత ప్రదర్శనతో భారత్‌కు అతడు శుభారంభం అందించాడు. కేవలం 22 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుని మరోసారి తన సత్తా ఏమిటో నిరూపించుకున్నాడు ఈ వరల్డ్ నంబర్ వన్ బ్యాటర్.
1199 పరుగులు
ఈ మ్యాచ్‌లో మొత్తంగా 35 బంతులు ఎదుర్కొన్న అభిషేక్ శర్మ ఐదు ఫోర్లు, ఎనిమిది సిక్సర్ల సాయంతో 84 పరుగులు సాధించాడు. తద్వారా టీమిండియా తరఫున ఇప్పటికి 34 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న ఈ లెఫ్టాండర్ బ్యాటర్.. 1199 పరుగులు సాధించాడు. ఇందులో రెండు శతకాలతో పాటు ఏడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. స్ట్రైక్‌రేటు 190.93 కావడం విశేషం.
వరల్డ్‌కప్ -2027 జట్టులోనూ
ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ అభిషేక్ శర్మను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వన్డే జట్టులోకి తీసుకోవడమే కాకుండా.. వరల్డ్‌కప్ -2027 జట్టులోనూ అతడికి చోటు ఇవ్వాలని అభిప్రాయపడ్డాడు.
ఈ మేరకు.. ‘‘యాభై ఓవర్ల ప్రపంచకప్ టోర్నీ ఎంపిక సమయంలో అభిషేక్ శర్మ పేరు కూడా పరిగణనలోకి తీసుకోవాలి. ప్రస్తుతానికి యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్ అతడి కంటే ముందు వరుసలో ఉన్నారు.
అయితే, ఒకవేళ అన్నీ కలిసి వచ్చి టీ20లలో మాదిరే వన్డే పవర్‌ప్లేలోనూ అభిషేక్ శర్మ సిక్సర్లు బాదితే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి’’ అని ఇర్ఫాన్ పఠాన్ ఎక్స్ వేదికగా తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. కాగా అభిషేక్ శర్మ ఇంత వరకు వన్డేల్లో అరంగేట్రమే చేయలేదు.
రోహిత్- గిల్ జోడీ
ఇక వన్డేల్లో మాజీ కెప్టెన్ రోహిత్ శర్మకు ఓపెనింగ్ జోడీగా ప్రస్తుత సారథి శుబ్‌మన్ గిల్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. భారత్- శ్రీలంక వేదికలుగా ఫిబ్రవరి 7- మార్చి 8 వరకు టీ20 ప్రపంచకప్-2026 టోర్నీ నిర్వహించనున్నారు. ఇందుకు సన్నాహకంగా సాగుతున్న న్యూజిలాండ్‌తో సిరీస్‌లో అభిషేక్ శర్మ ఇదే జోరు కనబరిస్తే టీమిండియా ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది.
ఇక గత కొంతకాలంగా వరుస సిరీస్ విజయాలతో దూసుకుపోతున్న భారత్ ఈసారి కూడా హాట్ ఫేవరెట్‌గా వరల్డ్‌కప్ బరిలో దిగుతోంది. కాగా 2024లో రోహిత్ శర్మ కెప్టెన్సీలో టీమిండియా చాంపియన్‌గా నిలిచిన విషయం తెలిసిందే.
చదవండి: షాకిచ్చిన ఐసీసీ.. బంగ్లాదేశ్ స్పందన ఇదే.. తుది నిర్ణయం వారిదే!


