ఈ జనరేషన్‌లో అత్యుత్తమ బ్యాటర్ ఎవరని అడిగితే.. కొద్ది రోజుల కిందటి వరకు ఈ ప్రశ్నకు జవాబు చెప్పేందుకు క్రికెట్ అభిమానులు ఇబ్బంది పడేవారు. ఎందుకంటే, ఫాబ్ ఫోర్‌గా పిలువబడే విరాట్ కోహ్లి, స్టీవ్ స్మిత్, కేన్ విలియమ్సన్, జో రూట్ మధ్య అత్యుత్తమ బ్యాటర్ అనిపించుకునేందుకు తీవ్రమైన పోటీ ఉండేది. వీరంతా ఫార్మాట్లకతీతంగా సత్తా చాటుతూ, ఏ ఒక్కరికీ అత్యుత్తమ బ్యాటర్ అనే కీర్తి దక్కకుండా పోటీపడేవారు.
అయితే గత కొద్ది రోజులగా ఈ పరిస్థితిలో మార్పు కనిపిస్తుంది. అత్యుత్తమ బ్యాటర్ అనిపించుకునేందుకు జో రూట్ సోలోగా ముందుకొస్తున్నాడు. సహచరులు విరాట్, స్టీవ్, కేన్‌ను వెనక్కు నెడుతూ తానే అత్యుత్తమ బ్యాటర్‌నంటూ బ్యాట్‌తో సమాధానం చెబుతున్నాడు.
విరాట్ (37), స్టీవ్ (36), కేన్ (35) వయసు మీద పడటంతో ఏదో ఒక ఫార్మాట్‌కు/ఫార్మాట్లకు పరిమితం కాగా.. రూట్ (35) కూడా వారి ఏజ్ గ్రూప్‌లోనే ఉన్నా, మూడు ఫార్మాట్లలో కొనసాగుతూ టెస్ట్, వన్డే ఫార్మాట్లలో అత్యుత్తమంగా సత్తా చాటుతున్నాడు. రూట్ మినహా ఫాబ్‌లోని మిగతా ముగ్గురు ఏదో ఒక ఫార్మాట్లో మాత్రమే రాణిస్తున్నారు.
టెస్ట్, టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన విరాట్ వన్డేల్లో దూసుకుపోతుండగా.. వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించిన స్టీవ్ స్మిత్ టెస్ట్‌ల్లో మాత్రమే సత్తా చాటుతున్నాడు. కేన్ విషయానికొస్తే.. ఇటీవలికాలంలో ఫాబ్-4లో బాగా వెనుకపడిపోయింది ఇతనే. టీ20 ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన కేన్.. టెస్ట్, వన్డే ఫార్మాట్లలో కొనసాగుతున్నా, ఏ ఒక్క ఫార్మాట్‌కు న్యాయం చేయలేకపోతున్నాడు.
రూట్ పరిస్థితి మాత్రం పై ముగ్గురికి భిన్నంగా ఉంది. ఇతను ఏ ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించకుండా మూడు ఫార్మాట్లలోనూ కొనసాగుతున్నాడు. ముఖ్యంగా టెస్ట్, వన్డే ఫార్మాట్లలో అకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. లేటు వయసులోనూ అదిరిపోయే ప్రదర్శనలతో యంగస్టర్లకు సైతం పోటీగా మారాడు.
ఇటీవలికాలంలో టెస్ట్, వన్డేల్లో రూట్ ప్రదర్శనలు చూస్తే ఔరా అనక మానదు. గత ఆరేడేళ్ల కాలంలో అతను పట్టపగ్గాల్లేకుండా దూసుకుపోతున్నాడు. సెంచరీల మీద సెంచరీలు బాదుతూ ఫాబ్-4లోని మిగతా ముగ్గురికి అందనంత ఎత్తుకు ఎదుగుతున్నాడు.
ముఖ్యంగా టెస్ట్‌ల్లో రూట్‌కు కల్లెం వేయడం ఎవ్వరి వల్ల కావడం లేదు. ఈ మధ్యకాలంలో అతను ఏకంగా 22 సెంచరీలు బాదాడు. వన్డేల్లో కెరీర్ ముగిసిందనుకున్న దశలో ఈ ఫార్మాట్‌లోనూ రూట్ మెరుపులు ప్రారంభమయ్యాయి. చాలాకాలం సైలెంట్‌గా ఉన్న అతను.. ఈ మధ్యకాలంలో ఈ ఫార్మాట్లోనూ మూడు, నాలుగు సెంచరీలు చేశాడు.
తాజాగా శ్రీలంకతో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో రూట్ తన అత్యుత్తమ ప్రదర్శనను కనబరుస్తున్నాడు. తొలి రెండు మ్యాచ్‌ల్లో అర్ద సెంచరీలతో సర్దుకున్న అతను.. ఇవాళ జరుగుతున్న మూడో వన్డేలో సూపర్ సెంచరీతో మెరిశాడు. రూట్‌కు వన్డేల్లో ఇది 20వ సెంచరీ. ఓవరాల్‌గా 61వది. ప్రస్తుత తరం బ్యాటర్లలో విరాట్ కోహ్లి (85) మాత్రమే రూట్ కంటే ముందున్నాడు.
వాస్తవానికి విరాట్, స్టీవ్, కేన్ కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడు రూట్ చాలా వెనుకపడి ఉండేవాడు. వారికి రూట్‌కు పదుల సంఖ్యలో సెంచరీల వ్యత్యాసం ఉండేది. వారంతా రూట్ కంటే చాలా ముందుండే వారు. అయితే ఐదేళ్లలో సీన్ మొత్తం తలకిందులైంది.
అతను స్టీవ్ స్మిత్, కేన్ విలియమ్సన్‌ను వెనక్కు నెట్టి విరాట్‌తో పోటీపడుతున్నాడు. వాస్తవానికి విరాట్ కూడా టెస్ట్‌ల్లో రూట్ ముందు దిగదుడుపే. నంబర్ల విషయంలో అతన్ని రూట్ ఎప్పుడో దాటేశాడు. ఇక టెస్ట్‌ల్లో రూట్ ముందున్న ఏకైక టార్గెట్ సచిన్ టెండూల్కర్ మాత్రమే. రూట్ తర్వలోనే సచిన్ ఆల్‌టైమ్ రికార్డులను బద్దలు కొట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు. వన్డేల్లోనూ రూట్ జోరు ఇలాగే కొనసాగితే విరాట్ సెంచరీల సంఖ్య దాటడం పెద్ద కష్టం కాకపోవచ్చు.


