ఒలింపిక్స్‌ నిర్వహణకు భారత్‌ సిద్ధం: ప్రధాని మోదీ | National Games: PM Modi Says India pushing for hosting rights of 2036 Olympics | Sakshi
Sakshi News home page

ఒలింపిక్స్‌ నిర్వహణకు భారత్‌ సిద్ధం: ప్రధాని మోదీ

Jan 29 2025 10:13 AM | Updated on Jan 29 2025 10:57 AM

National Games: PM Modi Says India pushing for hosting rights of 2036 Olympics

గ్రామీణ ప్రతిభకు పట్టం కట్టే జాతీయ క్రీడలు... అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. మంగళవారం ఉత్తరాఖండ్‌ వేదికగా 38వ జాతీయ క్రీడలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శ్రీకారం చుట్టారు. వచ్చే నెల 14 వరకు జరగనున్న ఈ క్రీడల్లో 10 వేల మందికి పైగా అథ్లెట్లు పాల్గొంటున్నారు. 

ఉత్తరాఖండ్‌ రాష్ట్రం ఆవిర్భవించి 25 ఏళ్లు అయిన సందర్భంగా ఈ క్రీడలకు ఆతిథ్యమిస్తున్న ఆ రాష్ట్రం... ఆద్యంతం తమ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా ఆరంభ వేడుకలు నిర్వహించింది.

ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ ... 2036లో భారత్‌లో ఒలింపిక్స్‌ నిర్వహించడమే తమ లక్ష్యమని... దీంతో దేశవ్యాప్తంగా క్రీడలకు మరింత ఆదరణ పెరుగుతుందని అన్నారు. ‘మీ సామర్థ్యాలను పెంపొందించుకునేందుకు ప్రయ త్నాలు కొనసాగించండి.

వాటికి మద్దతివ్వడంపై మేము దృష్టి పెడతాం. దేశాభివృద్ధిలో క్రీడలు ముఖ్యమైన భాగం అని బలంగా విశ్వసిస్తున్నాం. విశ్వక్రీడలకు ఆతిథ్యమిచ్చేందుకు ఆసక్తిగా ఉన్నాం. ఒలింపిక్స్‌ ఎక్కడ జరిగినా అన్నీ రంగాలు లాభపడతాయి. ఇలాంటి మెగా టోర్నీలతో అథ్లెట్లకు మరింత మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయి’ అని నరేంద్ర మోదీ అన్నారు. 

కాగా రెండేళ్ల క్రితం ముంబై వేదికగా జరిగిన అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ సెషన్‌లో ప్రధాని మోదీ 2036 ఒలింపిక్స్‌ఆతిథ్యానికి సిద్ధం అని ప్రకటించగా... దీనికి సంబంధించిన నివేదికను భారత ఒలింపిక్‌ సంఘం.. అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీకి అందించింది.

ఈ క్రీడలకు డెహ్రాడూన్‌ ప్రధాన వేదిక కాగా... మొత్తం 7 నగరాల్లో పోటీలు నిర్వహిస్తున్నారు. 18 రోజుల పాటు జరగనున్న ఈ ఆటల్లో 32 క్రీడాంశాల్లో పోటీలు జరగనున్నాయి. 

జాతీయ క్రీడల ఆరంభ వేడుకలు సాంస్కృతిక నృత్య కళారూపం ‘తాండవ్‌’తో ప్రారంభం కాగా.. ప్రముఖ సినీ గాయకుడు జుబిన్‌ నౌటియాల్‌ ప్రదర్శన ఆహుతులను ఆకట్టుకుంది. అంతకుముందు ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి పుష్కర్‌సింగ్‌ ధామితో కలిసి ప్రధాని మోదీ గోల్ఫ్‌ కార్ట్‌లో మైదానమంతా కలియతిరిగారు.

అనంతరం స్థానిక సంప్రదాయ దుస్తుల్లో అథ్లెట్ల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అథ్లెట్ల మార్చ్‌పాస్ట్‌ అనంతరం ఉత్తరాఖండ్‌కు చెందిన భారత స్టార్‌ షట్లర్‌ లక్ష్యసేన్‌... క్రీడాజ్యోతిని ప్రధాని మోదీకి అందించారు. 

జ్యోతిని నిర్దిష్ట ప్రదేశంలో పెట్టిన ప్రధాని... క్రీడలు అధికారికంగా ప్రారంభమైనట్లు ప్రకటించారు. ఆరంభ వేడుకలు ‘ఏక్‌ భారత్‌ శ్రేష్ఠ్‌ భారత్‌’ స్ఫూర్తి ప్రస్ఫుటించాయని ప్రధాని అన్నారు. ఉత్తరాఖండ్‌ రాష్ట్ర పక్షి మోనల్‌ను పోలి ఉండే విధంగా ‘మౌలి’ మస్కట్‌ను రూపొందించారు.   

మరిన్ని క్రీడావార్తలు
2న రాష్ట్ర ర్యాంకింగ్‌ చెస్‌ టోర్నీ 
సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర చెస్‌ సంఘం (టీజీసీఏ) ఆధ్వర్యంలో ఫిబ్రవరి 2వ తేదీన రాష్ట్ర ర్యాంకింగ్‌ చెస్‌ టోర్నమెంట్‌ జరగనుంది. బషీర్‌బాగ్‌ సమీపంలో లాల్‌బహదూర్‌ స్టేడియం యోగా హాల్‌లో ఈ టోర్నీని ఏర్పాటు చేశారు. అండర్‌–7, 9, 11, 13, 15 బాలబాలికల విభాగాల్లో ఈ టోర్నీ జరుగుతుంది.

1–1–2010న లేదా ఆ తర్వాత పుట్టిన వారే ఈ టోర్నీలో ఆడేందుకు అర్హులు. స్విస్‌ ఫార్మాట్‌లో ఐదు రౌండ్లపాటు టోర్నీని నిర్వహిస్తారు. ప్రతి విభాగంలో టాప్‌–10లో నిలిచిన ప్లేయర్లకు ట్రోఫీలు, సర్టిఫికెట్లు, పతకాలు అందజేస్తామని టీజీసీఏ అధ్యక్షుడు కేఎస్‌ ప్రసాద్‌ తెలిపారు. ఈ టోర్నీలో పాల్గొనాలనుకునే వారు తమ ఎంట్రీలను జనవరి 31వ తేదీలోపు పంపించాలి. స్పాట్‌ ఎంట్రీలు స్వీకరించరు. వివరాలకు 7337578899 లేదా 7337399299 ఫోన్‌నంబర్లలో సంప్రదించాలి.  

శ్రీనిధి, నామ్‌ధారి మ్యాచ్‌ ‘డ్రా’ 
చండీగఢ్‌: ఐ–లీగ్‌లో శ్రీనిధి డెక్కన్‌ ఫుట్‌బాల్‌ క్లబ్‌ (ఎఫ్‌సీ) మూడో ‘డ్రా’ నమోదు చేసుకుంది. మంగళవారం నామ్‌ధారి ఫుట్‌బాల్‌ క్లబ్‌తో జరిగిన పోరును శ్రీనిధి జట్టు 1–1 గోల్స్‌తో ‘డ్రా’గా ముగించింది. శ్రీనిధి డెక్కన్‌ జట్టు తరఫున విలియమ్‌ అల్వెస్‌ ఒలీవైరా (45+1వ నిమిషంలో), నామ్‌ధారి జట్టు తరఫున క్లెడ్సన్‌ కార్వాలో డిసిల్వా (33వ నిమిషంలో) చెరో గోల్‌ చేశారు. ఇరు జట్లు తొలి అర్ధభాగంలోనే ఒక్కో గోల్‌ సాధించాయి.

ద్వితీయార్ధంలో రెండు జట్లు ఎంత ప్రయత్నించినా మరో గోల్‌ చేయలేకపోయాయి. గత నాలుగు మ్యాచ్‌ల్లో శ్రీనిధి జట్టుకు ఇది మూడో ‘డ్రా’ కాగా... వరుస విజయాలతో దూసుకెళ్తున్న నామ్‌ధారి జట్టు గెలుపు జోరుకు శ్రీనిధి క్లబ్‌ అడ్డుకట్ట వేసింది. తాజా సీజన్‌లో 11 మ్యాచ్‌లాడిన శ్రీనిధి జట్టు 3 విజయాలు, 5 పరాజయాలు, 3 ‘డ్రా’లతో 12 పాయింట్లు ఖాతాలో వేసుకొని 8వ స్థానంలో ఉంది. 11 మ్యాచ్‌లాడిన నామ్‌ధారి ఫుట్‌బాల్‌ క్లబ్‌ 6 విజయాలు, 2 పరాజయాలు, 3 ‘డ్రా’లతో 21 పాయింట్లు సాధించి ‘టాప్‌’లో కొనసాగుతోంది.     




 

Advertisement
 
Advertisement
Advertisement