ఫిఫా ప్రపంచకప్‌లో అల్జీరియాపై విజయంతో జోష్ మీదున్న అర్జెంటీనాకు ఊహించని షాక్ ఎదురైంది. రిఫరీ పూర్ అంపైరింగ్ కారణంగా తాము మ్యాచ్ ఓడిపోయామంటూ అల్జీరియా ఫిఫాకు ఫిర్యాదు చేసింది. ఈ మ్యాచ్‌లోనే లియోనల్ మెస్సీ హ్యాట్రిక్ గోల్స్‌తో మెరిసిన సంగతి తెలిసిందే. అయితే మెస్సీ మ్యాచ్‌లో నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించాడని కూడా అల్జీరియా తన ఫిర్యాదులో పేర్కొంది. తమ జట్టు ఆటగాడిని ఉద్దేశపూర్వకంగానే కిందపడేసినప్పటికీ మెస్సీకి రిఫరీ రెడ్‌కార్డ్ జారీ చేయకపోవడం తమకు ఆశ్చర్యం కలిగించిందని అల్జీరియా పేర్కొంది.
రాయిటర్స్ కథనం ప్రకారం మ్యాచ్ సరైన రీతిలో జరగలేదంటూ మ్యాచ్‌లో జరిగిన తప్పిదాలను హైలైట్ చేస్తూ ఫిఫా రిఫరీయింగ్ కమిషన్‌కు ఫిర్యాదు లేఖను అందించింది. లేఖలో పేర్కొన్న ప్రకారం.. ‘ఆట మొదటి అర్ధభాగంలో అర్జెంటీనా కెప్టెన్ లియోనల్ మెస్సీ ఉద్దేశపూర్వకంగానే అల్జీరియా కెప్టెన్ ఐస్సా మాండీ పిక్కపై కాలు వేసి అతడి పడిపోయేటట్లుగా చేయడం కనిపించింది.
ఆ తర్వాత వెనక నుంచి మెస్సీ తన కాలి బూటుతో మాండీని తన్నినట్లు కూడా తెలుస్తోంది. మెస్సీకి రెడ్‌కార్డ్ ఇచ్చి మైదానం నుంచి బయటికి పంపాలని తాము డిమాండ్ చేసినప్పటికీ, మ్యాచ్‌కు రిఫరీగా వ్యవహరించిన పోలండ్‌కు చెందిన సైమన్ మార్సినియాక్ మెస్సీపై ఎలాంటి క్రమశిక్షణా చర్యలు తీసుకోలేదు.
ఇక రెండో అర్ధభాగంలో అర్జెంటీనా మిడ్‌ఫీల్డర్ అలెక్సిస్‌మాక్ అల్లిస్టర్ తమ జట్టు ఆటగాడు ఇబ్రహీం మజాపై మోచేతితో దాడి చేసినట్లు అల్జీరియా లేఖలో ఆరోపించింది. ఈ దాడి పట్ల కూడా రిఫరీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం తమకు ఆశ్చర్యం కలిగించింది. మ్యాచ్ మొత్తంలో రిఫరీ అర్జెంటీనాకు సానుకూలంగా ఉన్నారని, ఆయన తప్పిదాల వల్లే ఇవాళ అర్జెంటీనా మ్యాచ్‌లో విజయం సాధించింది. వెంటనే మెస్సీతో పాటు రిఫరీపై యాక్షన్ తీసుకోవాలని కోరుతున్నాం.’ అని ఫిర్యాదులో పేర్కొంది.
అయితే అర్జెంటీనా, అల్జీరియా మ్యాచ్‌కు రిఫరీగా వ్యవహరించిన సైమన్ మార్సినియాక్ 2022 ఫిఫా ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌కు కూడా రిఫరీగా వ్యవహరించడం గమనార్హం. ఆనాటి ఫైనల్లో అర్జెంటీనా పెనాల్టీ షూటౌట్‌లో ఫ్రాన్స్‌ను ఓడించి జగజ్జేతగా నిలిచింది.


