వాళ్లని మెచ్చుకో.. తప్పులేదు.. అతడిని ఇప్పటికైనా వదిలేయ్‌! | Leave Him Alone: Sanjay Manjrekar Faces Criticism While Praising Jaiswal Rahul | Sakshi
Sakshi News home page

వాళ్లని మెచ్చుకోవడంలో తప్పులేదు.. అతడిని ఇప్పటికైనా వదిలేయ్‌!

Jun 20 2025 6:48 PM | Updated on Jun 20 2025 7:23 PM

Leave Him Alone: Sanjay Manjrekar Faces Criticism While Praising Jaiswal Rahul

టీమిండియా మాజీ క్రికెటర్‌, కామెంటేటర్‌ సంజయ్‌ మంజ్రేకర్‌పై భారత దిగ్గజ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రిటైర్మెంట్‌ ప్రకటించిన తర్వాత ఇంకా ‘కింగ్‌’ను కించపరిచేలా వ్యాఖ్యానాలు చేయడం ఎందుకని ఫైర్‌ అవుతున్నారు. అసలేం జరిగిందంటే..?!

భారత్‌- ఇంగ్లండ్‌ మధ్య ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా శుక్రవారం తొలి టెస్టు మొదలైన విషయం తెలిసిందే. లీడ్స్‌లోని హెడింగ్లీ వేదికగా టాస్‌ గెలిచిన ఇంగ్లండ్‌ కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌.. టీమిండియాను తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు.

రాహుల్‌, జైస్వాల్‌ జోరు
ఈ క్రమంలో ఓపెనర్లు కేఎల్‌ రాహుల్‌- యశస్వి జైస్వాల్‌ కలిసి భారత్‌కు శుభారంభం అందించారు. ఇద్దరూ కలిసి తొలి వికెట్‌కు 91 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. లీడ్స్‌లో టీమిండియా ఓపెనింగ్‌ జంటకు ఇదే అత్యధిక స్కోరు కావడం విశేషం.

ఈ నేపథ్యంలో కేఎల్‌ రాహుల్‌, జైస్వాల్‌లను కామెంటేటర్‌ సంజయ్‌ మంజ్రేకర్‌ ప్రశంసించాడు. అవుట్‌ సైడ్‌ ఆఫ్‌ దిశగా వెళ్తున్న బంతులను వదిలేసి మంచి పనిచేశారంటూ కొనియాడాడు. అదే సమయంలో పరోక్షంగా కోహ్లిని ఉద్దేశించి విమర్శలు చేశాడు.

వాళ్లని మెచ్చుకో.. తప్పులేదు.. అతడిని ఇప్పటికైనా వదిలేయ్‌!
‘‘ఓ మాజీ బ్యాటర్‌.. పదే పదే ఇలాంటి బంతుల వెనుక పడి.. తనను తాను చిక్కుల్లో పడేసుకునేవాడు’’ అంటూ కోహ్లి పేరు ప్రస్తావించకుండానే మంజ్రేకర్‌ పరోక్షంగా అతడిని విమర్శించాడు. ఈ నేపథ్యంలో కోహ్లి అభిమానులు మంజ్రేకర్‌పై మండిపడుతున్నారు.

‘‘బాగా ఆడినందుకు రాహుల్‌- జైస్వాల్‌లను మెచ్చుకోవడంలో తప్పులేదు. కానీ ఇప్పటికీ కోహ్లి పేరును వాడుకోవడం ఎందుకు? అతడు రిటైర్‌ అయిపోయాడు. ఇప్పటికైనా అతడిని వదిలేయండి. మంజ్రేకర్‌ సాబ్‌.. మీ పేరు నలుగురి నోళ్లలో నానేందుకు ఇలా చేయడం సరికాదు’’ అని చురకలు అంటిస్తున్నారు.

కాగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ 2025-27 సైకిల్‌ను టీమిండియా ఇంగ్లండ్‌తో పర్యటనతో ఆరంభించింది. ఈ సిరీస్‌కు ముందే కెప్టెన్‌ రోహిత్‌ శర్మతో పాటు దిగ్గజ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి టెస్టులకు వీడ్కోలు పలికారు. ఈ నేపథ్యంలో రోహిత్‌ స్థానంలో శుబ్‌మన్‌ గిల్‌ కొత్త కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.

ఇక కోహ్లి, రోహిత్‌ చివరగా ఆస్ట్రేలియాతో బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీలో భాగంగా టెస్టులు ఆడారు. నాటి టూర్‌లో కోహ్లి పదే పదే అవుట్‌ సైడ్‌ ఆఫ్‌ దిశగా వెళ్తున్న బంతులను ఆడే క్రమంలో అత్యధికసార్లు వికెట్‌ పారేసుకున్న విషయం తెలిసిందే.

జైసూ హాఫ్‌ సెంచరీ..
మ్యాచ్‌ విషయానికొస్తే.. భోజన విరామ సమయానికి ముందే కేఎల్‌ రాహుల్‌ 42 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నిష్క్రమించాడు. అరంగేట్ర ఆటగాడు, మూడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన సాయి సుదర్శన్‌ పరుగుల ఖాతా తెరవకుండానే వెనుదిరిగాడు. 35 ఓవర్లు ముగిసే సరికి మరో ఓపెనర్‌ జైస్వాల్‌ అర్ధ శతకం పూర్తి చేసుకోగా.. కెప్టెన్‌ గిల్‌ 36 బంతుల్లో 33 పరుగులు సాధించాడు. జట్టు స్కోరు: 135/2 (35) . 

చదవండి: చరిత్ర సృష్టించిన శుబ్‌మన్‌ గిల్‌.. ఈ శతాబ్దంలో ఒకే ఒక్కడు!

Advertisement
 
Advertisement
Advertisement