మన మహిళలు రెడీ | India will face Pakistan today in the T20 World Cup | Sakshi
Sakshi News home page

మన మహిళలు రెడీ

Jun 14 2026 4:25 AM | Updated on Jun 14 2026 4:25 AM

India will face Pakistan today in the T20 World Cup

టి20 ప్రపంచకప్‌లో నేడు భారత్‌ తొలి మ్యాచ్‌ 

పాకిస్తాన్‌తో పోరుకు సిద్ధమైన హర్మన్‌ సేన 

రా.గం.7:00 నుంచి స్టార్‌ స్పోర్ట్స్, హాట్‌స్టార్‌లలో ప్రసారం

బర్మింగ్‌హామ్‌: మహిళల వన్డే వరల్డ్‌ కప్‌ చాంపియన్‌ భారత్‌ తొలి సారి టి20 ప్రపంచకప్‌ను కూడా అందుకోవాలనే లక్ష్యంతో బరిలోకి దిగుతోంది. టోర్నీలో నేడు జరిగే తమ తొలి మ్యాచ్‌లో భారత్‌ చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో తలపడనుంది. ప్రస్తుత ఫామ్, ఓవరాల్‌గా ఆటగాళ్ల రికార్డులను బట్టి చూస్తే అన్ని రంగాల్లో పాక్‌కంటే పటిష్టంగా కనిపిస్తోంది. వరల్డ్‌ కప్‌కు ముందు ఆ్రస్టేలియా, ఇంగ్లండ్‌లను వారి సొంతగడ్డపై ఓడించిన హర్మన్‌ప్రీత్‌ సేన... స్వదేశంలో శ్రీలంకను 5–0తో చిత్తు చేసింది. 

ఇటీవల దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్‌ల చేతుల్లో సిరీస్‌లు కోల్పోయినా... జట్టు కూర్పులో భాగంగా చేసిన పలు ప్రయోగాల్లో ఈ ఫలితాలు వచ్చాయి కాబట్టి ఆందోళన చెందాల్సిన పని లేదు. ఇప్పటి వరకు టి20 ప్రపంచకప్‌లలో పాక్‌పై భారత్‌ 6–2తో ఆధిక్యంలో ఉండగా... ఓవరాల్‌గా టి20ల్లో కూడా భారత్‌ 13–3తో పైచేయి సాధించింది.  

ఓపెనర్లు స్మృతి మంధాన, షఫాలీ వర్మ దూకుడుగా ఆరంభిస్తే భారత్‌ భారీ స్కోరు చేసేందుకు అవకాశం ఉంటుంది. మూడో స్థానంలో యస్తిక భాటియా, భారతి ఫుల్మలిలలో ఎవరికి అవకాశం లభిస్తుందనేది చూడాలి. మిడిలార్డర్‌లో జెమీమా, హర్మన్‌ తమ స్థాయికి తగ్గి ప్రదర్శన చేయాల్సి ఉంది. ఎప్పటిలాగే ఫినిషింగ్‌లో రిచా ఘోష్‌ మెరుపు బ్యాటింగ్‌ కనబర్చగల సమర్థురాలు. 

ప్రధాన పేసర్‌గా క్రాంతి గౌడ్‌ ఖాయం కాగా...అరుంధతి రెడ్డి, రేణుకా ఠాకూర్‌లలో ఒకరికే రెండో పేసర్‌గా చాన్స్‌ లభిస్తుంది. ముగ్గురు స్పిన్నర్లు శ్రీచరణి, నందిని శర్మ, దీప్తి శర్మలతో భారత్‌ ఆడటం ఖాయమైంది. మరో వైపు 2024 వరల్డ్‌ కప్‌లో భారత్‌ చేతిలో చిత్తయిన పాక్‌ జట్టు ఈ సారైనా పోటీనివ్వాలని భావిస్తోంది. జట్టు కెపె్టన్‌ ఫాతిమా సనా ఆల్‌రౌండ్‌ ప్రదర్శనపై జట్టు ప్రధానంగా ఆధారపడుతోంది. మ్యాచ్‌కు ముందు ప్రాక్టీస్‌ సందర్భంగా బంతి తగలడంతో సనా మోకాలికి గాయమైంది. 

అయితే ఇది ప్రమాదకరమైందని కాదని, ఆమె బరిలోకి దిగుతుందని పాక్‌ మేనేజ్‌మెట్‌ ప్రకటించింది. సీనియర్‌ ఓపెన్‌ మునీబా, గుల్‌ ఫెరోజా ఎలాంటి ఆటతీరు కనబరుస్తారనేది చూడాలి. పాక్‌ జట్టులో ఈ సారి కొత్త ప్లేయర్‌ ఇమాన్‌ ఫాతిమాపై అందరి దృష్టీ నిలిచింది. అండర్‌–19 స్థాయినుంచి వచ్చిన ఆమె టి20ల్లో 150కు పైగా స్ట్రైక్‌రేట్‌తో బ్యాటింగ్‌ చేయగల సమర్థురాలు. ఫినిషర్‌గా ఇప్పటికే పేరు తెచ్చుకున్న ఇమాన్‌పై పాక్‌ ఆశలు పెట్టుకుంది.

డానీ వ్యాట్‌ సెంచరీ
మహిళల టి20 ప్రపంచకప్‌ తొలి మ్యాచ్‌లో ఆతిథ్య ఇంగ్లండ్‌ శుభారంభం చేసింది. శుక్రవారం అర్ధరాత్రి దాటాక జరిగిన గ్రూప్‌–2 మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ 87 పరుగుల తేడాతో శ్రీలంకపై విజయం సాధించింది. మొదట ఇంగ్లండ్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఒక వికెట్‌ నష్టానికి 219 పరుగులు చేసింది. మహిళల టి20 ప్రపంచకప్‌ చరిత్రలో ఒక జట్టు అత్యధిక స్కోరు ఇదే. 

‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’, ఓపెనర్‌ డానీ వ్యాట్‌ (62 బంతుల్లో 105 నాటౌట్‌; 13 ఫోర్లు, 1 సిక్స్‌) అజేయ సెంచరీతో చెలరేగింది. అమీ జోన్స్‌ (38 బంతుల్లో 53; 4 ఫోర్లు, 1 సిక్స్‌), కెప్టెన్‌ సీవర్‌ బ్రంట్‌ (22 బంతుల్లో 46 నాటౌట్‌; 6 ఫోర్లు, 1 సిక్స్‌) కూడా మెరవడంతో ఇంగ్లండ్‌ భారీ స్కోరు చేసింది. అనంతరం లక్ష్యఛేదనలో శ్రీలంక జట్టు 20 ఓవర్లలో 132 పరుగులకు ఆలౌటైంది. నీలాక్షిక (39; 2 ఫోర్లు, 1 సిక్స్‌) టాప్‌ స్కోరర్‌ కాగా... ఇంగ్లండ్‌ బౌలర్లలో ఫ్రెయా కెంప్‌ 4 వికెట్లు పడగొట్టింది.

ఆ్రస్టేలియా అదరహో...
మాంచెస్టర్‌: మహిళల టి20 ప్రపంచకప్‌లో అగ్రశ్రేణి జట్టు ఆస్ట్రేలియా శుభారంభం చేసింది. శనివారం జరిగిన తొలి మ్యాచ్‌లో ఆసీస్‌ 65 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను చిత్తు చేసింది. ముందుగా  ఫోబ్‌ లిచ్‌ఫీల్డ్‌ (24 బంతుల్లో 50; 9 ఫోర్లు, 1 సిక్స్‌), ఎలైస్‌ పెరీ (36), వేర్‌హామ్‌ (32) మెరుపులతో ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 172 పరుగులు సాధించగా... దక్షిణాఫ్రికా 16.4 ఓవర్లలో 107 పరుగులకే కుప్పకూలింది. మరో మ్యాచ్‌లో స్కాట్లాండ్‌ 40 పరుగులతో ఐర్లాండ్‌పై ఘన విజయం సాధించింది. స్కాట్లాండ్‌ 20 ఓవర్లలో 5 వికెట్లకు 161 పరుగులు చేయగా, ఐర్లాండ్‌ 19.1 ఓవర్లలో 121 పరుగులకు ఆలౌటైంది.   

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement