వాటే ఫామ్‌!.. ధనాధన్‌ దంచికొట్టి.. గిల్‌, పంత్‌ హాఫ్‌ సెంచరీలు | Ind vs Eng 2nd Test Day 4: Captain Gill And Pant Slams Fifties India Leads | Sakshi
Sakshi News home page

వాటే ఫామ్‌!.. ధనాధన్‌ దంచికొట్టి.. గిల్‌, పంత్‌ హాఫ్‌ సెంచరీలు

Jul 5 2025 6:39 PM | Updated on Jul 5 2025 6:54 PM

Ind vs Eng 2nd Test Day 4: Captain Gill And Pant Slams Fifties India Leads

టీమిండియా కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌ (Shubman Gill) సూపర్‌ ఫామ్‌లో ఉన్నాడు. ఇంగ్లండ్‌ (Ind vs Eng)తో తొలి టెస్టులో శతకం (147) బాదిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్‌.. రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఏకంగా డబుల్‌ సెంచరీతో చెలరేగాడు. మిడిలార్డర్‌లో కీలకమైన నాలుగో స్థానంలో విరాట్‌ కోహ్లి (Virat Kohli) లేని లోటు పూడుస్తూ.. ఇంగ్లండ్‌ గడ్డ మీద అతడి రికార్డునే బద్దలు కొట్టాడు.

భారీ ద్విశతకం (269)తో ఆకట్టుకుని.. ఎడ్జ్‌బాస్టన్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన టీమిండియా క్రికెటర్‌, కెప్టెన్‌గా నిలిచాడు. ఇక రెండో ఇన్నింగ్స్‌లోనూ శుబ్‌మన్‌ గిల్‌ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. యాభై ఏడు బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. జోష్‌ టంగ్‌ బౌలింగ్‌లో ఫోర్‌ బాది 51 పరుగులు సాధించాడు.

మరోవైపు.. గిల్‌కు తోడుగా వైస్‌ కెప్టెన్‌ బ్యాటర్‌ రిషభ్‌ పంత్‌ కూడా అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు. ఈ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ 51 బంతుల్లోనే 50 పరుగుల మార్కు అందుకున్నాడు. ఈ క్రమంలో 44 ఓవర్ల ఆట పూర్తయ్యేసరికి మూడు వికెట్ల నష్టానికి 224 పరుగులు చేసిన టీమిండియా ఆధిక్యం.. 400కు చేరింది.

పంత్‌ అవుటైన తర్వాత స్కోరు ఇలా
కాగా ఎడ్జ్‌బాస్టన్‌ టెస్టులో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమిండియా 587 పరుగుల భారీ స్కోరు చేసి ఆలౌట్‌ అయింది. కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌ డబుల్‌ సెంచరీ (269)తో అదరగొట్టగా.. రవీంద్ర జడేజా (89), యశస్వి జైస్వాల్‌ (87) రాణించారు. ఇంగ్లండ్‌ బౌలర్లలో షోయబ్‌ బషీర్‌ మూడు వికెట్లు తీయగా.. క్రిస్‌వోక్స్‌, జోష్‌ టంగ్‌ రెండేసి వికెట్లు కూల్చారు. బ్రైడన్‌ కార్స్‌, కెప్టెన్‌ బెన్‌స్టోక్స్‌ ఒక్కో వికెట్‌ దక్కించుకున్నారు.

ఇక ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 407 పరుగులకు ఆలౌట్‌ అయింది. హ్యారీ బ్రూక్‌ (158), జేమీ స్మిత్‌ (184 నాటౌట్‌) శతకాలతో చెలరేగారు. భారత బౌలర్లలో మహ్మద్‌ సిరాజ్‌ ఆరు, ఆకాశ్‌ దీప్‌ నాలుగు వికెట్లు పడగొట్టారు. ఈ క్రమంలో తొలి ఇన్నింగ్స్‌తో కలుపుకొని భారత్‌కు 180 పరుగుల ఆధిక్యం లభించింది.

ఈ క్రమంలో 64/1 ఓవర్‌నైట్‌ స్కోరుతో శనివారం నాటి నాలుగో రోజు ఆట మొదలుపెట్టిన భారత్‌.. కేఎల్‌ రాహుల్‌ (55), రిషభ్‌ పంత్‌ (65) అర్ధ శతకాలు.. గిల్‌ అజేయ హాఫ్‌ సెంచరీ (ప్రస్తుతానికి 58) కారణంగా 46.2 ఓవర్ల ఆట ముగిసే సరికి నాలుగు వికెట్ల నష్టానికి 236 పరుగులు చేసి.. 416 పరుగుల ఆధిక్యంలో ఉంది. పంత్‌ 65 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద షోయబ్‌ బషీర్‌ బౌలింగ్‌లో డకెట్‌కు క్యాచ్‌ ఇచ్చి అవుటయ్యాడు.  

చదవండి: వైభవ్‌ సూర్యవంశీ విధ్వంసకర శతకం.. మరోసారి సునామీ ఇన్నింగ్స్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement