IND vs ENG: 500కు పైగా పరుగులు చేశాడు.. సంకుచిత బుద్ధి! | Ind Vs Eng: Ex India Star Dodda Ganesh Roasts LSG For Ignoring Former IPL Skipper In Photo Album, Check Post Inside | Sakshi
Sakshi News home page

IND vs ENG: 500కు పైగా పరుగులు చేశాడు.. మీ సంకుచిత బుద్ధి మారదా?

Aug 9 2025 9:11 AM | Updated on Aug 9 2025 10:58 AM

Ind vs Eng: Ex india star roasts lsg for ignoring former ipl skipper in photo album

ఐపీఎల్‌ ఫ్రాంఛైజీ లక్నో సూపర్‌ జెయింట్స్‌ (LSG) మరోసారి విమర్శల పాలైంది. ‘‘ఇంత సంకుచిత బుద్ధి ఎందుకు?. అసలు మిమ్మల్ని ఎవరు ఆ పోస్టు పెట్టమన్నారు’’ అంటూ నెటిజన్లు ఫైర్‌ అవుతున్నారు. విషయం ఏమిటంటే.. టీమిండియా ఇటీవల ఇంగ్లండ్‌ (IND vs ENG)తో ఆండర్సన్‌- టెండుల్కర్‌ ట్రోఫీ ఆడిన విషయం తెలిసిందే.

ఇంగ్లండ్‌ గడ్డ మీద జరిగిన ఈ ఐదు టెస్టుల సిరీస్‌ను భారత జట్టు 2-2తో సమం చేసింది. టీమిండియా టెస్టు కెప్టెన్‌గా తొలి ప్రయత్నంలోనే బ్యాటర్‌గా చిరస్మరణీయ రికార్డులు సాధించిన శుబ్‌మన్‌ గిల్‌ (Shubman Gill).. సారథిగానూ మంచి మార్కులే కొట్టేశాడు. మరోవైపు.. వైస్‌ కెప్టెన్‌ రిషభ్‌ పంత్‌, యశస్వి జైస్వాల్‌లతో పాటు పేసర్లు మహ్మద్‌ సిరాజ్‌, ఆకాశ్‌ దీప్‌ కూడా అదరగొట్టారు.

నిలకడగా రాణించిన ఏకైక ఆటగాడు
అయితే, ఈ సిరీస్‌ ఆసాంతం నిలకడగా రాణించిన ఆటగాడు ఎవరైనా ఉన్నారా అంటే.. అది ఓపెనింగ్‌ బ్యాటర్‌ కేఎల్‌ రాహుల్‌. ఐదు టెస్టుల్లో కలిపి 53.20 సగటుతో ఈ కర్ణాటక ఆటగాడు 532 పరుగులు సాధించాడు. ఇందులో రెండు శతకాలు, రెండు అర్ధ శతకాలు ఉన్నాయి.

హెడింగ్లీలో తొలి టెస్టులో 137 పరుగులు సాధించిన కేఎల్‌ రాహుల్‌.. లార్డ్స్‌లో 100 పరుగులు చేశాడు. ఇక ఎడ్జ్‌బాస్టన్‌లో 55, ఓల్డ్‌ ట్రఫోర్డ్‌ మైదానంలో 90 పరుగులు సాధించాడు. ఓవరాల్‌గా ఈ సిరీస్‌లో శుబ్‌మన్‌ గిల్‌ (754), జో రూట్‌ (537) తర్వాత మూడో టాప్‌ రన్‌ స్కోరర్‌గా నిలిచాడు.

రాహుల్‌ ఫొటో లేకుండానే..
అసలు విషయానికి వస్తే.. లక్నో సూపర్‌ జెయింట్స్‌ తమ సోషల్‌ మీడియా ఖాతాలో శుక్రవారం ఓ పోస్టు పెట్టింది. ‘‘యుగాల పాటు నిలిచిపోయే ఫొటో ఆల్బమ్‌’’ అంటూ టీమిండియా ఆటగాళ్లతో కూడిన ఫొటోలను షేర్‌ చేసింది. అయితే, ఇందులో ఎక్కడా కేఎల్‌ రాహుల్‌ లేడు.

ఒక్కటీ దొరకలేదా?
ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్‌, కర్ణాటకకు చెందిన దొడ్డ గణేశ్‌ లక్నో యాజమాన్యం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ‘‘ఇలా చేయడం అస్సలు బాలేదు. చాలా ఇబ్బందికరంగా అనిపిస్తోంది.

ఓపెనర్‌గా వచ్చి కొత్త బంతిని ఎదుర్కొని 500కు పైగా పరుగులు చేసిన ఆటగాడి ఫొటో మాత్రం మీకు దొరకలేదా?’’ అంటూ దొడ్డ గణేశ్‌ ప్రశ్నించాడు. 

నెటిజన్లు ఇందుకు స్పందిస్తూ.. ‘‘అంతే సార్‌.. వాళ్లకు గొప్పగా ఆడినవాళ్లు కనబడరు. అయినా లక్నోకు ఇలా చేయడం అలవాటే. వాళ్ల ఓనర్‌ సంజయ్‌ గోయెంకానే వారికి ఆదర్శం’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

గతేడాది లక్నోను వీడిన రాహుల్‌
కాగా ఐపీఎల్‌-2022 సందర్భంగా క్యాష్‌ రిచ్‌ లీగ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఎల్‌ఎస్‌జీకి కేఎల్‌ రాహుల్‌ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. మూడేళ్లపాటు అదే జట్టుతో కొనసాగిన అతడు రెండుసార్లు జట్టును ప్లే ఆఫ్స్‌నకు చేర్చాడు. 

అయితే, గతేడాది లక్నో పేలవ ప్రదర్శన నేపథ్యంలో సంజీవ్‌ గోయెంకా అందరిముందే కేఎల్‌ రాహుల్‌ను తిట్టడం విమర్శలకు దారితీసింది. అనంతరం రాహుల్‌ జట్టును వీడి.. ఢిల్లీ క్యాపిటల్స్‌లో చేరాడు.

అయితే, టీమిండియా తరఫున అతడు గొప్పగా చాటినా లక్నో తమ సోషల్‌ మీడియా అకౌంట్లలో షేర్‌ చేసే ఫొటోల్లో అతడిపై వివక్ష చూపించడం.. వారి సంకుచిత బుద్ధికి నిదర్శనం అని కేఎల్‌ రాహుల్‌ అభిమానులు మండిపడుతున్నారు.

చదవండి: చెవికి అతికించి.. ఛీ!.. ఇలా చేశావేంటి?.. హ్యారీ బ్రూక్‌ చర్య వైరల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement