
భారత యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) అద్భుత ఫామ్ కొనసాగుతోంది. ఇంగ్లండ్‌తో యూత్ వన్డేల్లో పద్నాలుగేళ్ల ఈ చిచ్చరపిడుగు ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. హోవ్ వేదికగా ఇంగ్లండ్ అండర్-19 జట్టుతో తొలి వన్డేలో ఈ ఓపెనింగ్ బ్యాటర్ దుమ్ములేపిన విషయం తెలిసిందే. కేవలం 19 బంతుల్లోనే మూడు ఫోర్లు, ఐదు సిక్సర్ల సాయంతో.. 252కు పైగా స్ట్రైక్‌రేటుతో 48 పరుగులు సాధించాడు.
వరుసగా నాలుగో మ్యాచ్‌లో..
ఇక రెండో యూత్ వన్డేలో 34 బంతుల్లో 45 పరుగులతో ఫర్వాలేదనిపించిన వైభవ్.. మూడో మ్యాచ్‌లో మరోసారి తన విశ్వరూపం ప్రదర్శించాడు. నార్తాంప్టన్ వేదికగా ఈ ఎడమచేతి వాటం బ్యాటర్ 31 బంతుల్లో ఆరు ఫోర్లు, తొమ్మిది సిక్సర్లు బాది 86 పరుగులతో విధ్వంసం సృష్టించాడు.
వైభవ్ వీరబాదుడు
తాజాగా వోర్సెస్టర్ వేదికగా నాలుగో యూత్ వన్డేలో వైభవ్ సూర్యవంశీ మరోసారి బ్యాట్ ఝులిపించాడు. ఇంగ్లండ్ బౌలింగ్‌ను చితక్కొడుతూ కేవలం 24 బంతుల్లోనే అర్ధ శతకం బాదాడు. ఇందులో 46 పరుగులు బౌండరీల ద్వారానే రావడం విశేషం. దీనిని బట్టి వైభవ్ వీరబాదుడు ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఫాస్టెస్ట్ సెంచరీ
అంతటితో వైభవ్ పరుగుల దాహం తీరలేదు. అర్ధ శతకాన్ని సెంచరీగా మార్చేశాడు యువ సంచలనం. కేవలం 52 బంతుల్లోనే వంద పరుగుల మార్కు అందుకుని.. తన వీరవిహారాన్ని కొనసాగిస్తున్నాడు. కాగా యూత్ వన్డేలలో ఇదే ఫాస్టెస్ట్ సెంచరీ అని తెలుస్తోంది.
కాగా ఐదు యూత్ వన్డేలు, రెండు యూత్ టెస్టులు ఆడేందుకు భారత అండర్-19 క్రికెట్ జట్టు ఇంగ్లండ్‌లో పర్యటిస్తోంది. ఇందులో భాగంగా తొలి మూడు యూత్ వన్డేల్లో రెండు గెలిచిన ఆయుశ్ మాత్రే సేన.. శనివారం నాలుగో మ్యాచ్‌లోనూ దుమ్ములేపుతోంది.
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేస్తున్న భారత్.. సగం ఆట అంటే 25 ఓవర్లు పూర్తయ్యే సరికి వికెట్ నష్టానికి 216 పరుగులు సాధించింది. ఓపెనర్ ఆయుశ్ మాత్రే (5) మరోసారి నిరాశపరచగా.. వైభవ్ 74 బంతుల్లో 140, విహాన్ మల్హోత్రా 62 బంతుల్లో 47 పరుగులతో ఆడుతున్నారు.
143 పరుగులు చేసి అవుట్..
ఇక ఈ మ్యాచ్‌లో మొత్తంగా 78 బంతులు ఎదుర్కొన్న వైభవ్ సూర్యవంశీ.. 143 పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్‌లో 13 ఫోర్లతో పాటు 10 సిక్సర్లు ఉన్నాయి. అయితే, బెన్ మాయెస్ బౌలింగ్‌లో జోసెఫ్ మూరేస్‌కు క్యాచ్ ఇవ్వడంతో వైభవ్ విధ్వంసకర శతక ఇన్నింగ్స్‌కు తెరపడింది.
చదవండి: కోహ్లి, రోహిత్ కాదు!.. వైభవ్ సూర్యవంశీ రోల్‌మోడల్ ఆ సూపర్‌స్టారే!