
భారత క్రికెట్ వర్గాల్లో ఇద్దరు ఆటగాళ్లు ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్నారు. ఒకరు టీమిండియా టెస్టు కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (Shubman Gill) అయితే.. మరొకరు భారత యువ క్రికెట్ సంచలనం వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi). వీరిద్దరూ ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉన్నారు.
గిల్ శతకాల మోత
ఇంగ్లండ్‌తో టెండుల్కర్- ఆండర్సన్ ట్రోఫీ (Tenudulkar- Anderson Trophy)లో భాగంగా గిల్ కెప్టెన్‌గా తన తొలి టెస్టులోనే శతకం (147) బాదడంతో పాటు.. రెండో టెస్టులో భారీ డబుల్ సెంచరీ (269)తో చెలరేగాడు. తద్వారా ఎడ్జ్‌బాస్టన్ మైదానంలో ఇప్పటి వరకు ఏ భారత క్రికెటర్‌కూ సాధ్యం కాని ఘనత సాధించాడు.
వైభవ్ తుఫాన్ ఇన్నింగ్స్
ఈ వేదికపై అత్యధిక వ్యక్తిగత స్కోరు (269) సాధించిన భారత తొలి క్రికెటర్, కెప్టెన్‌గా గిల్ చరిత్ర సృష్టించాడు. మరోవైపు.. వైభవ్ సూర్యవంశీ అండర్-19 భారత జట్టు తరఫున అదరగొడుతున్నాడు. ఇంగ్లండ్ అండర్-19 జట్టుతో జరుగుతున్న యూత్ వన్డే సిరీస్‌లో ఈ బిహారీ చిచ్చరపిడుగు దుమ్ములేపుతున్నాడు.
ఆయుశ్ మాత్రే సారథ్యంలోని జట్టులో భాగమైన పద్నాలుగేళ్ల వైభవ్.. తొలి మూడు వన్డేల్లో వరుసగా 19 బంతుల్లో 48, 34 బంతుల్లో 45, 31 బంతుల్లోనే 81 పరుగులతో అదరగొట్టాడు. చివరగా మూడో యూత్ వన్డేలో సంచలన ఇన్నింగ్స్‌తో మెరిసిన వైభవ్.. ఆ తర్వాత వెంటనే తమ జట్టుతో కలిసి ఎడ్జ్‌బాస్టన్‌కు వెళ్లాడు.
ఇంగ్లండ్‌తో తలపడుతున్న సీనియర్ జట్టు ఆటను ప్రత్యక్షంగా వీక్షించేందుకు యువ జట్టును బీసీసీఐ అక్కడకు పిలిపించింది. ఈ నేపథ్యంలో గిల్ అద్భుత, చిరస్మరణీయ ఇన్నింగ్స్‌ను ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం వైభవ్‌తో పాటు యువ ఆటగాళ్లందరికీ కలిగింది.
టెస్టుల్లో ఆడతా.. నా రోల్ మోడల్ అతడే
ఈ నేపథ్యంలో టీమిండియా బ్యాటింగ్ ముగిసిన అనంతరం వైభవ్ సూర్యవంశీ మాట్లాడుతూ.. ‘‘ఇంగ్లండ్‌లో నాకిదే తొలి టెస్టు. ఇక్కడ టెస్టు మ్యాచ్ చూడటం ఇదే తొలిసారి. మ్యాచ్ ఎలా సాగుతుందో ప్రత్యక్షంగా వీక్షించాను. నాకెంతో సంతోషంగా ఉంది. మ్యాచ్ చూసేందుకే మమ్మల్ని ప్రత్యేకంగా ఇక్కడకు తీసుకువచ్చారు.
టీమిండియా ఆట చూసి మేమెంతగానో స్ఫూర్తి పొందాము. శుబ్‌మన్ గిల్ మా అందరికీ రోల్ మోడల్. దేశం తరఫున రెడ్ బాల్ క్రికెట్ ఆడాలని ప్రతి ఒక్క క్రికెటర్ కోరుకుంటాడు’’ అని పేర్కొన్నాడు. టెస్టుల్లో టీమిండియాకు ప్రాతినిథ్యం వహించడమే తన చిరకాల కోరిక అని చెప్పుకొచ్చాడు. కాగా అనేక మంది క్రికెటర్ల మాదిరి.. భారత దిగ్గజాలైన విరాట్ కోహ్లి, రోహిత్ శర్మల పేర్లు కాకుండా టీమిండియా యువ సారథి గిల్‌ను వైభవ్ తన రోల్‌మోడల్‌గా చెప్పడం విశేషం.
యువ భారత్‌దే పైచేయి
కాగా ఇంగ్లండ్ యువ జట్టుతో ఐదు యూత్ వన్డేలు, రెండు యూత్ టెస్టులు ఆడేందుకు భారత అండర్-19 జట్టు అక్కడికి వెళ్లింది. ఇప్పటికి మూడు యూత్ వన్డేలు పూర్తి కాగా భారత్ రెండింట గెలిచి 2-1తో ఆధిక్యంలో ఉంది. వోర్సెస్టర్ వేదికగా శనివారం నాటి నాలుగో యూత్ వన్డేలో గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని పట్టుదలగా ఉంది. మరోవైపు.. ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌లో తలపడుతున్న టీమిండియా తొలి టెస్టులో ఓడింది. ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో గెలిచి సిరీస్ సమం చేయాలని పట్టుదలగా ఉంది.
చదవండి: WCL: భారత జట్టు ప్రకటన.. కెప్టెన్‌గా యువరాజ్ సింగ్