
భారత్- ఇంగ్లండ్ మధ్య టెస్టు సిరీస్ (IND vs ENG) సందర్భంగా ఇద్దరు ఆటగాళ్లు దేశం కోసం ఆడటం పట్ల తమ నిబద్ధతను మరోసారి నిరూపించుకున్నారు. గాయం తాలుకు బాధ వెంటాడుతున్నా జట్టు ప్రయోజనాల కోసం మైదానంలో దిగి.. అభిమానుల హృదయాలు గెలుచుకున్నారు.
వారిద్దరు ఎవరో ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది. అవును.. టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ (Rishabh Pant).. ఇంగ్లండ్ పేస్ బౌలర్ క్రిస్ వోక్స్ (Chris Woakes). మాంచెస్టర్‌లో జరిగిన నాలుగో టెస్టు సందర్భంగా వోక్స్ బౌలింగ్‌లోనే పంత్ గాయపడ్డాడు. వోక్స్ వేసిన బంతి పంత్ కుడికాలి పాదానికి బలంగా తాకడంతో ఉబ్బిపోయింది.
బొటనవేలు ఫ్రాక్చర్
దీంతో నొప్పితో విలవిల్లాడుతూ మైదానం వీడిన పంత్ స్కానింగ్‌కు వెళ్లగా.. బొటనవేలు ఫ్రాక్చర్ అయినట్లు తేలింది. అయితే, సిరీస్ ఆశలు సజీవంగా ఉంచుకోవాలంటే రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగిన ఈ లెఫ్టాండ్ బ్యాటర్ మళ్లీ బరిలో దిగాల్సిన పరిస్థితి. జట్టు ప్రయోజనాలు, దేశం కోసం ఆడటమే పరమావధిగా భావించే పంత్.. కట్టుతోనే బ్యాట్‌తో బరిలోకి దిగి అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు.
అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో పంత్ ఆడాల్సిన అవసరం రాకపోగా.. ఈ టెస్టు డ్రా అయింది. ఇక ఐదో టెస్టుకు పంత్ దూరమయ్యాడు. ఇదిలా ఉంటే.. ఆఖరిదైన ఐదో టెస్టులో విజయం ఇరుజట్ల మధ్య ఆఖరి రోజు వరకు దోబూచులాడింది. ఐదో రోజు ఇంగ్లండ్ విజయానికి 35 పరుగులు.. టీమిండియా నాలుగు వికెట్ల దూరంలో ఉన్న వేళ భారత పేసర్లు విజృంభించారు.
అతడూ జట్టే ముఖ్యం అనుకున్నాడు
ఈ క్రమంలో తొమ్మిదో వికెట్ పడగానే క్రిస్ వోక్స్ బ్యాట్ పట్టుకుని మైదానంలోకి రావాల్సి వచ్చింది. అంతకుముందే ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో కిందపడ్డగా.. అతడి భుజం విరిగింది. అయినప్పటికీ పంత్ మాదిరే అతడూ జట్టే తనకు ముఖ్యం అనుకున్నాడు.
అయితే, వోక్స్‌కు ఇబ్బంది కలుగకుండా మరో ఎండ్‌లో ఉన్న గస్ అట్కిన్సన్ స్ట్రైక్‌రొటేట్ చేస్తూ తానే క్రీజులో ఉండేలా చూసుకున్నాడు. అయితే, మహ్మద్ సిరాజ్ అద్భుత బంతితో అట్కిన్సన్‌ను బౌల్డ్ చేయడంతో ఇంగ్లండ్ కథ ముగిసిపోయింది. విజయానికి ఆరు పరుగుల దూరంలో ఆతిథ్య జట్టు నిలిచిపోగా.. టీమిండియా జయభేరి మోగించి సిరీస్‌ను 2-2తో సమం చేసింది.
సెల్యూట్ చేసిన రిషభ్ పంత్.. సారీ చెప్పిన ఇంగ్లండ్ ప్లేయర్
ఈ నేపథ్యంలో రిషభ్ పంత్‌తో జరిగిన సంభాషణ గురించి క్రిస్ వోక్స్ తాజాగా వెల్లడించాడు. ‘‘నా ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ రిషభ్ సెల్యూట్ ఎమోజీతో అభినందించాడు. అందుకు నేను అతడికి కృతజ్ఞతలు చెప్పాను.
నాపై ప్రేమ చూపినందుకు థాంక్యూ.. నీ పాదం నొప్పి ఎలా ఉంది అని అడిగాను. అప్పుడు నాకు రిషభ్ వాయిస్ నోట్ పంపించాడు. ‘మరేం పర్లేదు. త్వరగానే కోలుకుంటానని అనుకుంటున్నాను. తొందర్లోనే మనం మళ్లీ తిరిగి కలవాలని కోరుకుంటున్నా’ అన్నాడు.
అయితే, తన పాదం విరగడానికి పరోక్ష కారణం నేనే కాబట్టి.. రిషభ్‌కు సారీ చెప్పకుండా ఉండలేకపోయాను’’ అని క్రిస్ వోక్స్ మైదానంలో ప్రత్యర్థులుగా ఉన్నా.. ఆటగాళ్లుగా తమ మధ్య ఉండే అనుబంధం గురించి తెలిపాడు.
ఇక మ్యాచ్ ముగియగానే టీమిండియా కెప్టెన్ శుబ్‌మన్ గిల్ కూడా క్రిస్ వోక్స్‌ను ప్రత్యేకంగా అభినందించాడు. ఈ విషయం గురించి వోక్స్ ది గార్డియన్‌తో మాట్లాడుతూ.. ‘‘నువ్వు నిజంగా సాహసమే చేశావు’ అని గిల్ నాతో అన్నాడు.
అందుకు బదులిస్తూ.. ‘మీరు అసాధారణ రీతిలో సిరీస్ పూర్తి చేసుకున్నారు. అద్భుతంగా ఆడారు. ఇందుకు మీ జట్టుకు క్రెడిట్ ఇవ్వాల్సిందే’ అని నేను అన్నాను’’ అని తెలిపాడు.
చదవండి: ప్రతోడు సచిన్, కోహ్లి అవుతారా?.. వాళ్ల ఫోన్లు కూడా ఎత్తను: టీమిండియా పేసర్