
‘వీడి వల్ల ఏమవుతుందిలే? క్రికెట్ ఆడుతున్న ప్రతోడు సచిన్, కోహ్లి అయిపోతారా ఏంటి? వీడిపై పెట్టుబడి దండగ. డబ్బు వృథా’ అంటూ గేలి చేసిన వాళ్ల ముందే టీమిండియాకు ఆడటమే కాదు.. చిన్న వయసులోనే ఐసీసీ ట్రోఫీని ముద్దాడితే.. ఆ కిక్కే వేరప్పా!!
భారత యువ పేసర్ హర్షిత్ రాణా Harshit Rana) విషయంలో ఇదే నిజమైంది. తనను హేళన చేసిన బంధువుల ముందే తండ్రిని సగర్వంగా తలెత్తుకునేలా చేశాడు 23 ఏళ్ల ఈ ఫాస్ట్‌బౌలర్. దండగ అంటూ తిట్టినోళ్లే తనను పొగిడేలా చేసుకున్నాడు. అప్పుడు కనీసం తనతో మాట్లాడని వాళ్లు కూడా.. ఇప్పుడు ఫోన్లు చేస్తుంటే కాస్త గొప్పగానే అనిపిస్తున్నా.. వారికి రిప్లై మాత్రం ఇవ్వడం లేదంటున్నాడు హర్షిత్ రాణా.
పేరుప్రఖ్యాతులు రాగానే..
దేశానికి ఆడే స్థాయికి చేరుకునే క్రమంలో తనకు బంధువుల నుంచి ఎదురైన తిరస్కారం గురించి హర్షిత్ రాణా స్వయంగా వెల్లడించాడు. ‘‘మనకు ఒక్కసారి పేరుప్రఖ్యాతులు రాగానే.. అప్పటిదాకా దూరంగా ఉన్నవాళ్లంతా ఒక్కసారిగా ‘దగ్గరై బంధువు’లైపోతారు.

నిరాశపరిచే వారే ఎక్కువ
నేను క్రికెటర్ అవుతానంటే నవ్విన నా సోదరసోదరీమణులు, మా బంధువులు.. అనవసరంగా వాడి కోసం కష్టపడుతున్నావంటూ మా నాన్నను వెనక్కిలాగే ప్రయత్నం చేసిన వాళ్లు ఎంతో మంది ఉన్నారు.
వాళ్ల కాల్స్ లిఫ్ట్ చేయను
వీడి వల్ల ఏం కాదు.. క్రికెట్‌లో అసలేం ఉందని నిరాశపరిచిన వాళ్లే ఎక్కువ. అయితే, ఈరోజు వాళ్లే మళ్లీ మా నాన్నకు ఫోన్ చేసి.. నీ కష్టానికి ఫలితం దక్కిందంటూ పొగడటం వింతగా అనిపిస్తుంది. వాళ్లు నాకు కూడా ఫోన్లు చేస్తారు. కానీ నేను మాత్రం వాళ్ల కాల్స్ లిఫ్ట్ చేయను.
ఇదేమీ నా ఓవర్ ఆటిట్యూడ్ కాదు. గతంలో వాళ్లు నన్ను చాలా మాటలు అన్నారు. అలాంటి వాళ్లతో ఇప్పుడు నేను మాట్లాడాల్సిన అవసరం లేదనే అనుకుంటాను’’ అంటూ హర్షిత్ రాణా ఉద్వేగానికి లోనయ్యాడు. యూట్యూబర్ రణ్‌వీర్ అల్లాబాదియా పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ ఈ ఢిల్లీ ఎక్స్‌ప్రెస్.. తన మనసులోని భావాలు పంచుకున్నాడు.
ఐపీఎల్ నుంచి టీమిండియా బాట
కాగా 2022లో కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో అడుగుపెట్టిన హర్షిత్ రాణా.. గతేడాది అద్భుత ఆట తీరుతో ఆకట్టుకున్నాడు. 2024లో కేకేఆర్ టైటిల్ గెలవడంలో ఈ రైటార్మ్ పేసర్ తన వంతు పాత్ర పోషించాడు.
ఈ క్రమంలోనే టీమిండియా సెలక్టర్ల దృష్టిని ఆకర్షించిన హర్షిత్ రాణా.. 2024లోనే టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు. బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో పెర్త్‌లో జరిగిన తొలి టెస్టుతో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. ఈ ఏడాది వన్డే, టీ20లలోనూ టీమిండియా తరఫున ఎంట్రీ ఇచ్చాడు.
ఇప్పటి వరకు తన కెరీర్‌లో రెండు టెస్టులు, ఐదు వన్డేలు, ఒక టీ20 మ్యాచ్ ఆడిన 23 ఏళ్ల హర్షిత్ రాణా.. ఆయా ఫార్మాట్లలో వరుసగా 4, 10, 3 వికెట్లు పడగొట్టాడు. ఈ ఏడాది రోహిత్ శర్మ సారథ్యంలో ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 (ICC Champions Trophy) గెలిచిన భారత జట్టులోనూ అతడు సభ్యుడు. చివరగా ఈ మెగా వన్డే టోర్నీలో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో హర్షిత్ ఆడి ఓ వికెట్ తీశాడు కూడా!
చదవండి: Mohammed Siraj: అసదుద్దీన్ ఒవైసీకి సిరాజ్ రిప్లై ఇదే.. పోస్ట్ వైరల్