
ఇంగ్లండ్ గడ్డ మీద అదరగొట్టిన టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ (Mohammed Siraj)పై ప్రశంసల వర్షం కొనసాగుతూనే ఉంది. ఓడిపోతామనుకున్న ఆఖరి టెస్టు (IND vs ENG 5th Test)లో అద్భుత ప్రదర్శనతో సిరాజ్ భారత్‌ను గెలిపించిన తీరు.. అమోఘమంటూ మాజీ క్రికెటర్లతో పాటు అభిమానులూ కొనియాడుతున్నారు.
ఆల్వేస్ వి న్నర్
ఇందులో భాగంగా సిరాజ్ మియాను ఉద్దేశించి హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ప్రశంసాపూర్వక ట్వీట్ చేశారు. ‘‘‘ఎల్లప్పుడూ విజేతే.. మన హైదరాబాదీ శైలిలో చెప్పాలంటే.. పూరా ఖోల్ దియే పాషా!’’ అంటూ ఒవైసీ సిరాజ్‌ను అభినందించారు. బౌలర్‌గా అత్యుత్తమ ప్రదర్శన కనబరిచాడని కితాబు ఇచ్చారు.
ఒవైసీకి సిరాజ్ రిప్లై ఇదే
ఇక సిరాజ్ కూడా ఇందుకు బదులిస్తూ.. ‘‘ధన్యవాదాలు సార్.. ఎల్లవేళలా నన్ను ప్రోత్సహిస్తూ చీర్ చేస్తున్నందకు కృతజ్ఞతలు’’ అంటూ హార్ట్ సింబల్‌తో పాటు నమస్కారం పెడుతున్నట్లుగా ఉండే ఎమోజీని షేర్ చేశాడు. సిరాజ్ ఈ మేరకు ఒవైసీకి థాంక్యూ చెబుతూ చేసిన పోస్ట్ అర మిలియన్ వ్యూస్‌తో దూసుకుపోతోంది.
కెరీర్ బెస్ట్ ర్యాంకులో సిరాజ్
ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లో అద్భుత ప్రదర్శన కనబర్చిన సిరాజ్ అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ర్యాంకింగ్స్‌లోనూ దూసుకుపోయాడు. ఓవల్‌లో జరిగిన చివరి టెస్టులో 9 వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన ఈ హైదరాబాదీ బౌలర్.. బుధవారం విడుదల చేసిన ఐసీసీ బౌలర్ల తాజా ర్యాంకింగ్స్‌లో 12 స్థానాలు ఎగబాకాడు. సిరాజ్ 674 రేటింగ్ పాయింట్లతో 15వ స్థానంలో నిలిచాడు. గతంలో సిరాజ్ అత్యుత్తమంగా 16వ ర్యాంక్ సాధించాడు.
ఈ జాబితాలో జస్‌ప్రీత్ బుమ్రా (889 పాయింట్లు) అగ్ర స్థానంలో కొనసాగుతుండగా... భారత్ నుంచి రవీంద్ర జడేజా (17వ స్థానం) కూడా టాప్–20లో ఉన్నాడు. టెస్టు బ్యాటర్ల జాబితాలో భారత ఓపెనర్ యశస్వి జైస్వాల్ మూడు స్థానాలు మెరుగుపర్చుకొని ఐదో ర్యాంక్ (792 రేటింగ్ పాయింట్లు)కు చేరుకున్నాడు. ఇంగ్లండ్‌తో సిరీస్‌లో జైస్వాల్ 2 సెంచరీలు సహా మొత్తం 411 పరుగులు చేశాడు.
ఈ జాబితాలో జో రూట్ (908) తన అగ్ర స్థానాన్ని నిలబెట్టుకోగా... రిషభ్ పంత్ (8వ), శుబ్‌మన్ గిల్ (13వ)లకు టాప్–20లో చోటు లభించింది. టెస్టు ఆల్‌రౌండర్ల జాబితాలో రవీంద్ర జడేజా (405 పాయింట్లు) నిలకడగా నంబర్‌వన్‌గా కొనసాగుతుండగా... వాషింగ్టన్ సుందర్ 16వ ర్యాంక్‌లో ఉన్నాడు.
హైదరాబాద్‌లో సన్మానం!
ఇంగ్లండ్‌తో జరిగిన ఐదు టెస్టుల పోరులో అత్యధికంగా 23 వికెట్లు తీసి సిరీస్‌ను భారత్ సమంగా ముగించడంలో కీలక పాత్ర పోషించిన సిరాజ్ సొంతగడ్డకు చేరుకున్నాడు. బుధవారం ఉదయం శంషాబాద్ విమానాశ్రయంలో సన్నిహితులు, అభిమానులు అతనికి స్వాగతం పలికారు.
ఫీల్డింగ్ కోచ్ టి.దిలీప్‌తో కలిసి లండన్ నుంచి నేరుగా ముంబైకి చేరుకున్న సిరాజ్ ఆ తర్వాత స్వస్థలానికి వచ్చాడు. వచ్చే నెలలో జరిగే ఆసియా కప్ వరకు భారత జట్టు ఎలాంటి మ్యాచ్‌లు ఆడటం లేదు.
ఈ నేపథ్యంలో నగరంలోనే ఉండనున్న సిరాజ్‌కు త్వరలోనే ప్రత్యేక సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయాలని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) యోచిస్తోంది. ప్రస్తుతానికి అధ్యక్ష, కార్యదర్శులు వివిధ ఆరోపణలతో జైలులో ఉన్నందుకు ఈ కార్యక్రమ నిర్వహణ తదితర అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది.
చదవండి: Asia Cup 2025: అతడు భేష్.. ఇతడు ఓకే.. టీమిండియా సెలక్టర్లకు తలనొప్పి!