
టీమిండియా కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (Shubman Gill) తన కెరీర్‌లోనే అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. ఇంగ్లండ్ గడ్డ మీద వరుస శతకాలతో దుమ్ములేపుతున్నాడు. ఆతిథ్య జట్టుతో లీడ్స్ వేదికగా తొలి టెస్టులో గిల్ భారీ శతకం (147) బాదిన విషయం తెలిసిందే.
అనంతరం బర్మింగ్‌హామ్‌లో బుధవారం మొదలైన రెండో టెస్టులోనూ శతక్కొట్టిన శుబ్‌మన్ గిల్.. దానిని డబుల్ సెంచరీగా మార్చాడు. రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 387 బంతులు ఎదుర్కొన్న ఈ కుడిచేతి వాటం బ్యాటర్ 30 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 269 పరుగులు సాధించాడు. అయితే, కెరీర్‌లో సాధించిన తొలి ద్విశతకాన్ని ట్రిపుల్ సెంచరీగా మార్చడంలో గిల్ విఫలమయ్యాడు.
జోష్ టంగ్ బౌలింగ్‌లో ఓలీ పోప్‌నకు క్యాచ్ ఇచ్చి గిల్ పెవిలియన్ చేరడంతో.. అతడి భారీ డబుల్ సెంచరీ ఇన్నింగ్స్‌కు తెరపడింది. ఇక శనివారం నాటి నాలుగో రోజు ఆటలో భాగంగా గిల్ మరోసారి బ్యాట్ ఝులిపించాడు. యాభై ఏడు బంతుల్లో అర్ధ శతకం పూర్తి చేసుకున్న కెప్టెన్ సాబ్.. 129 బంతుల్లో తొమ్మిది ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో వంద పరుగుల మార్కు అందుకున్నాడు.
భారీ ఆధిక్యంలో భారత్
ఇదిలా ఉంటే.. 64/1 ఓవర్‌నైట్ స్కోరుతో శనివారం నాటి నాలుగో రోజు ఆట మొదలుపెట్టిన భారత్.. కాసేపటికే వన్‌డౌన్ బ్యాటర్ కరుణ్ నాయర్ (26) వికెట్ కోల్పోయింది. అయితే, ఓపెనింగ్ బ్యాటర్ కేఎల్ రాహుల్ అర్ధ శతకం(55)తో రాణించగా.. వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ మెరుపు హాఫ్ సెంచరీ (58 బంతుల్లో 65) సాధించాడు.
ఇక గిల్ మరోసారి శతక్కొట్టగా.. 68 ఓవర్లు ముగిసే సరికి నాలుగు వికెట్ల నష్టానికి 304 పరుగులు చేసింది. గిల్ సెంచరీ పూర్తి చేసుకునేసరికి, టీ బ్రేక్ సమయానికి తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం (180)తో కలుపుకొని భారత్.. 484 పరుగుల భారీ లీడ్ సాధించింది.
భారత రెండో బ్యాటర్‌గా..
కాగా టెస్టు మ్యాచ్‌లో ఓ ఇన్నింగ్స్‌లో డబుల్ సెంచరీ.. మరో ఇన్నింగ్స్‌లో సెంచరీ బాదిన భారత రెండో బ్యాటర్‌గా గిల్ చరిత్రకెక్కాడు. అతడి కంటే ముందు భారత మాజీ కెప్టెన్ సునిల్ గావస్కర్ 1971లొ పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌వేదికగా వెస్టిండీస్‌పై ఈ ఘనత సాధించాడు. ఇక ఓవరాల్‌గా ఈ జాబితాలో గిల్ తొమ్మిదో ఆటగాడు.
టీమిండియా వర్సెస్ ఇంగ్లండ్ రెండో టెస్టు
షెడ్యూల్: బుధవారం (జూలై 2)- ఆదివారం (జూలై 6)
వేదిక: ఎడ్జ్‌బాస్టన్, బర్మింగ్‌హామ్
టాస్: ఇంగ్లండ్- తొలుత బౌలింగ్
టీమిండియా తొలి ఇన్నింగ్స్ స్కోరు: 587 ఆలౌట్
ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ స్కోరు: 407 ఆలౌట్
టీమిండియాకు తొలి ఇన్నింగ్స్‌లో 180 పరుగుల ఆధిక్యం.
చదవండి: వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర శతకం.. మరోసారి సునామీ ఇన్నింగ్స్