
ఆసియా దేశాల మధ్య క్రికెట్ సమరానికి సమయం అసన్నమవుతోంది. సెప్టెంబర్ 9 నుంచి యూఏఈ వేదికగా ఈ మెగా టోర్నీ ప్రారంభం కానుంది. ఈ ఈవెంట్‌లో మొత్తం 8 జట్లు టైటిల్ కోసం పోటీపడనున్నాయి. ఇందుకోసం ఆయా జట్లు తమ అస్త్రశస్త్రాలను సిద్దం చేసుకుంటున్నాయి.
ఇప్పటికే పాకిస్తాన్, భారత్, బంగ్లాదేశ్ వంటి క్రికెట్ బోర్డులు తమ జట్లను ప్రకటించాయి. ఈ క్రమంలో ఈ ఆసియాకప్ ఎప్పుడు మొదలైంది? ఈ ఖండాంతర టోర్నీలో భారత జట్టు రికార్డు ఎలా ఉందో ఓ లుక్కేద్దాం.
సెప్టెంబర్ 13.. 1984న ఒక కొత్త వన్డే టోర్నమెంట్ క్రికెట్ ప్రపంచానికి పరిచియమైంది. అదే ఆసియా కప్. దక్షిణాసియా పొరుగు దేశాలైన భారత్, పాకిస్తాన్, శ్రీలంకల మధ్య క్రికెట్, దైపాక్షిక సంబంధాలను మెరుగుపరుచేందుకు 19 సెప్టెంబర్, 1983న ఆసియా క్రికెట్ కౌన్సిల్‌ను స్ధాపించారు. ఈ ఏసీసీనే ఆసియాకప్ పుట్టుకకు కారణమైంది.

తొలి టైటిల్ మనదే..
ఆసియాకప్ తొలి ఎడిషన్‌కు యూఏఈలోని షార్జా అతిథ్యమిచ్చింది. అయితే ఈ టోర్నీలో 1983 ఐసీసీ ప్రూడెన్షియల్ ప్రపంచ కప్ విజేతగా నిలిచిన టీమిండియా పాల్గొనడంతో మరింత ప్రాధన్యత సంతరించుకుంది. అయితే ఈ టోర్నీకి 1983 ప్రపంచ కప్ గెలిచిన పూర్తి జట్టును బీసీసీఐ పంపలేదు. కపిల్ దేవ్, కె శ్రీకాంత్, సయ్యద్ కిర్మాణి, మోహిందర్ అమర్‌నాథ్ వంటి ఆటగాళ్లకు విశ్రాంతి ఇచ్చారు.
వారి స్దానంలో మనోజ్ ప్రభాకర్, చేతన్ శర్మ, సురీందర్ ఖన్నా వంటి ఆటగాళ్లు మాత్రం తొట్ట తొలి ఆసియాకప్‌లో భాగమమయ్యారు. శ్రీలంకతో జరిగిన తొలి మ్యాచ్‌లోనే సునీల్ గావస్కర్ సారథ్యంలోని భారత బృందం అద్బుతం చేసింది.
ఈ మ్యాచ్‌లో శ్రీలంకను ఏకంగా 10 వికెట్ల తేడాతో టీమిండియా చిత్తు చేసింది. అయితే తొలి ఎడిషన్‌లో కేవలం శ్రీలంక, భారత్, పాక్ జట్లు మాత్రమే తలపడ్డాయి. ఫైనల్లో పాక్‌ను చిత్తు చేసిన భారత్ తొట్ట తొలి ఆసియాకప్ టైటిల్‌ను సొంతం చేసుకుంది.

ఏకైక జట్టుగా శ్రీలంక..
ఇప్పటివరకు 16 ఆసియాకప్‌లు జరిగితే అన్ని టోర్నీలో ఆడిన ఆడిన ఏకైక జట్టుగా శ్రీలంక నిలిచింది. ఇక భారత్, పాకిస్తాన్‌లు చెరో 15 సార్లు ఆసియాకప్‌లో పాల్గొన్నాయి. శ్రీలంకతో క్రికెట్ సంబంధాలు దెబ్బతిన్న కారణంగా 1986 టోర్నమెంట్‌ను భారత్ బహిష్కరించింది. అనంతరం భారత్ వేదికగా 1990-91 ఆసియాకప్‌ను పాక్ బాయ్‌కట్ చేసింది. ఇదే కారణంతో 1993లో ఆసియాకప్‌ను నిర్వహించలేదు. బంగ్లాదేశ్ కూడా 15 సార్లు ఆసియాకప్‌లో భాగమైంది.

ఐసీసీ జోక్యం..
కాగా 2015లో ఆసియాకప్‌నకు సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకుంది. టోర్నీ నిర్వహించే ఆసియా క్రికెట్ కౌన్సిల్‌కు ఐసీసీ అధికారాలు తగ్గించింది. ఇకపై ఆసియాకప్ రెండేళ్లకోసారి వన్డే, టి20 ఫార్మాట్‌లో రొటేషన్ పద్దతిలో జరుగుతుందని తెలిపింది.
ఐసీసీ టోర్నీలకు అనుగుణంగా ఆసియాకప్‌ను నిర్వహించనున్నట్లు పేర్కొంది. ఫలితంగా 2016లో ఆసియాకప్‌ను తొలిసారి టీ20 ఫార్మాట్‌లో నిర్వహించారు. టీ20 ప్రపంచకప్-2026కు ముందు సన్నాహక టోర్నమెంట్‌గా అది ఉపయోగపడింది. మొట్టమొదటి ఆసియాకప్ టీ20 టోర్నీ టైటిల్‌ను కూడా టీమిండియానే కైవసం చేసుకుంది.

తిరుగులేని భారత్..
1984 నుంచి 2023 వరకు 16 సార్లు ఆసియా కప్‌ను నిర్వహించారు. 2022 లో చివరిసారిగా టీ20 ఫార్మాట్‌లో నిర్వహించగా, నాడు ఫైనల్లో పాకిస్తాన్‌ను ఓడించి శ్రీలంక విజేతగా నిలిచింది. అయితే ఈ టోర్నీలో భారత జట్టుకు మాత్రం ఘనమైన రికార్డు ఉంది.
ఇక ఆసియాకప్ చరిత్రలో భారత్ అత్యధికంగా ఎనిమిది సార్లు ఛాంపియన్‌గా నిలిచింది. అందులో 7 సార్లు వన్డే ఫార్మాట్‌లో టైటిల్‌ను సొంతం చేసుకోగా.. ఒక్కసారి టీ20 ఫార్మాట్‌లో టీమిండియా విజేతగా నిలిచింది. ఇక భారత్ తర్వాత శ్రీలంక ఆరు సార్లు, పాకిస్తాన్ రెండుసార్లు ఈ టోర్నీని ముద్దాడాయి.
చదవండి: Asia Cup 2025: 'ఆసియాకప్ గెలిచేది ఆ జట్టే'.. వీరేంద్ర సెహ్వాగ్ జోస్యం