టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ (Abhishek Sharma) సరికొత్త చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ టీ20 ఫార్మాట్లో అతి తక్కువ బంతుల్లోనే వెయ్యి పరుగుల మార్కు అందుకున్న ఆటగాడిగా ఈ ఎడమచేతి వాటం బ్యాటర్ ప్రపంచ రికార్డు సాధించాడు. ఆస్ట్రేలియాతో ఐదో టీ20 సందర్భంగా శనివారం నాటి మ్యాచ్‌లో అభిషేక్ శర్మ ఈ ఫీట్ నమోదు చేశాడు.
పంజాబ్‌కు చెందిన అభిషేక్ శర్మ ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరపున సత్తా చాటి.. గతేడాది టీమిండియాలో అడుగుపెట్టాడు. టీ20 ఫార్మాట్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లో ఎంట్రీ ఇచ్చాడు.
ఆస్ట్రేలియా పర్యటనలో..
ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటన (IND vs AUS)లో ఉన్న అభిషేక్ శర్మ.. కంగారూ గడ్డపై సత్తా చాటుతున్నాడు. ఇందులో భాగంగా ఆసీస్‌తో ఆడిన నాలుగు టీ20లలో వరుసగా.. 19, 68, 25, 28 పరుగులు సాధించాడు.
ఈ క్రమంలో భారత్ తరఫున ఇప్పటి వరకు 28 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న అభిషేక్ శర్మ.. 521 బంతుల్లో 989 పరుగులు సాధించాడు. ఇక ఈ సిరీస్‌లో ఇప్పటికే 2-1తో ఆధిక్యంలో ఉన్న టీమిండియా బ్రిస్బేన్‌లో ఆఖరిదైన ఐదో టీ20లో గెలిచి సిరీస్‌ను సొంతం చేసుకోవాలని పట్టుదలగా ఉంది.
ఈ నేపథ్యంలో గాబా మైదానంలో టాస్ ఓడిన భారత్ తొలుత బ్యాటింగ్‌కు దిగింది. ఓపెనర్లు అభిషేక్ శర్మ, శుబ్‌మన్ గిల్ ధనాధన్ దంచికొట్టడంతో 4.5 ఓవర్లలోనే వికెట్ నష్టపోకుండా 52 పరుగులు సాధించింది. మెరుపులు... వర్షం మొదలుకావడంతో అక్కడికి ఆటను ఆపివేశారు. ఆటగాళ్లను డ్రెసింగ్‌రూమ్‌లోకి పిలిచారు.
రెండుసార్లు లైఫ్
కాగా ఈ మ్యాచ్‌లో ఐదు పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అభిషేక్ శర్మకు లైఫ్ లభించింది. అతడు ఇచ్చిన క్యాచ్‌ను గ్లెన్ మాక్స్‌వెల్ జారవిడిచాడు. అదే విధంగా.. పదమూడు పరుగుల వద్ద ఉన్న వేళ బెన్ డ్వార్షుయిస్ క్యాచ్ డ్రాప్ చేయడంతో అభిషేక్‌కు మరో లైఫ్ వచ్చింది.
ఈ క్రమంలోనే అభిషేక్ శర్మ అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. పదకొండు పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అంతర్జాతీయ టీ20లలో ఈ లెఫ్టాండర్ వెయ్యి పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఇందుకోసం అతడు తీసుకున్న బంతులు కేవలం 528.
ప్రపంచ రికార్డు
తద్వారా అతి తక్కువ బంతుల్లోనే ఈ మైలురాయి చేరుకున్న క్రికెటర్‌గా అభిషేక్ శర్మ చరిత్రకెక్కాడు. అంతేకాదు తక్కువ ఇన్నింగ్స్‌లోనే వెయ్యి పరుగుల మార్కు అందుకున్న రెండో భారత బ్యాటర్‌గానూ నిలిచాడు. కాగా ఆట నిలిచేసరికి అభిషేక్ శర్మ 13 బంతుల్లో 23, శుబ్‌మన్ గిల్ 16 బంతుల్లో 29 పరుగులతో ఉన్నారు.
అతి తక్కువ బంతుల్లో అంతర్జాతీయ టీ20లలో వెయ్యి పరుగులు పూర్తి చేసుకున్న ఆటగాళ్లు
🏏అభిషేక్ శర్మ- 528 బంతుల్లో
🏏సూర్యకుమార్ యాదవ్- 573 బంతుల్లో
🏏ఫిల్ సాల్ట్- 599 బంతుల్లో
🏏గ్లెన్ మాక్స్‌వెల్- 604 బంతుల్లో
🏏ఆండ్రీ రసెల్, ఫిన్ అలెన్- 609 బంతుల్లో.
తక్కువ ఇన్నింగ్స్‌లో అంతర్జాతీయ టీ20లలో వెయ్యి పరుగులు పూర్తి చేసుకున్న భారత బ్యాటర్లు
🏏విరాట్ కోహ్లి- 27 ఇన్నింగ్స్‌లో
🏏అభిషేక్ శర్మ- 28 ఇన్నింగ్స్‌లో
🏏కేఎల్ రాహుల్- 29 ఇన్నింగ్స్‌లో
🏏సూర్యకుమార్ యాదవ్- 31 ఇన్నింగ్స్‌లో
🏏రోహిత్ శర్మ- 40 ఇన్నింగ్స్‌లో.
చదవండి: భారత జట్టుకు ఘోర పరాభవం.. కువైట్, యూఏఈ చేతిలో చిత్తు
Pace off from the bowler, POWER ON from #AbhishekSharma! 🧨🤩
Absolutely smashed over the ropes for a flat six! 💪#AUSvIND 👉 5th T20I | LIVE NOW 👉 https://t.co/KVDenaqq4f pic.twitter.com/aGYxqj5hhP— Star Sports (@StarSportsIndia) November 8, 2025


