మాంగ్ కాక్ వేదికగా హాంకాంగ్ సిక్సెస్-2025 టోర్నమెంట్లో శుభారంభం అందుకున్న భారత జట్టు దానిని కొనసాగించలేకపోతోంది. తొలి మ్యాచ్‌లో దినేశ్ కార్తిక్ సేన పాకిస్తాన్‌పై గెలుపొందిన విషయం తెలిసిందే. రాబిన్ ఉతప్ప (11 బంతుల్లో 28; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు), భరత్ చిప్లి (13 బంతుల్లో 24; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) మెరిపించడంతో భారత్ చేతిలో పాకిస్తాన్ చిత్తయ్యింది.
పాక్‌పై గెలుపు
పూల్ ‘సి’లో భాగంగా శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో భారత్ డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో 2 పరుగుల తేడాతో పాక్‌పై గెలుపొందింది. భారత్ మొదట నిర్ణీత 6 ఓవర్లలో 4 వికెట్లకు 84 పరుగులు చేసింది.
కెప్టెన్ దినేశ్ కార్తీక్ (6 బంతుల్లో 17 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) కూడా ధాటిగా ఆడాడు. మొహమ్మద్ షహజాద్ 2, అబ్దుల్ సమద్ ఒక వికెట్ తీశారు. అనంతరం వర్షం వల్ల లక్ష్యాన్ని 3 ఓవర్లలో 44 పరుగులుగా సవరించారు.
అయితే పాక్ ఈ 3 ఓవర్లలో వికెట్ నష్టానికి 41 పరుగులు చేసింది. ఖాజా నఫే (9 బంతుల్లో 18 నాటౌట్; 1 ఫోర్, 2 సిక్స్‌లు), సమద్ (6 బంతుల్లో 16 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) గెలిపించేందుకు విఫల యత్నం చేశారు. స్టువర్ట్ బిన్నీకి ఒక వికెట్ దక్కింది.
14 బంతుల్లోనే
ఈ క్రమంలో శనివారం తమ మొదటి మ్యాచ్‌లో భారత్ కువైట్ జట్టుతో తలపడింది. టాస్ గెలిచిన డీకే సేన... కువైట్‌ను తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఈ క్రమంలో నిర్ణీత ఆరు ఓవర్లలో కువైట్ ఐదు వికెట్ల నష్టానికి 106 పరుగులు చేసింది.
ఓపెనర్లు అద్నాన్ ఐద్రీస్ (6), మీట్ భావ్సర్ (0), వికెట్ కీపర్ బ్యాటర్ రవీజా సందరువాన్ (7) పూర్తిగా విఫలం కాగా.. యాసిన్ పటేల్ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో మెరిశాడు. కేవలం 14 బంతుల్లోనే రెండు ఫోర్లు, ఎనిమిది సిక్సర్ల సాయంతో ఏకంగా 58 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఆఖర్లో మొహమద్ షఫీక్ నాలుగు బంతుల్లో 9 పరుగులు చేశాడు.
భారత బౌలర్లలో అభిమన్యు మిథున్ రెండు, షాబాజ్ నదీం, స్టువర్ట్ బిన్ని, దినేశ్ కార్తిక్ తలా ఒక వికెట్ తీశారు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన భారత జట్టు 5.4 ఓవర్లలో కేవలం 79 పరుగులే చేసి ఆలౌట్ అయింది.
మూకుమ్మడిగా విఫలం.. కువైట్ చేతిలో చిత్తు
ఓపెనర్లలో రాబిన్ ఊతప్ప డకౌట్ కాగా.. ప్రియాంక్ పాంచల్ (10 బంతుల్లో 17).. వన్‌డౌన్ బ్యాటర్, కెప్టెన్ దినేశ్ కార్తిక్ (8), స్టువర్ట్ బిన్నీ (2) కూడా పూర్తిగా విఫలమయ్యారు. ఆఖర్లో అభిమన్యు మిథున్ (9 బంతుల్లో 26), షాబాజ్ నదీమ్ (8 బంతుల్లో 19) వేగంగా ఆడే ప్రయత్నం చేసినా.. జట్టును గట్టెక్కించలేకపోయారు. ఫలితంగా డీకే సేన కువైట్ చేతిలో 27 పరుగుల తేడాతో ఓడిపోయింది.
యూఏఈతో మ్యాచ్
అనంతరం.. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌తో భారత జట్టు తలపడింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడిన డీకే సేన తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లు భరత్ చిప్లి (4 బంతుల్లో 4), ప్రియాంక్ పాంచల్ (0) దారుణంగా విఫలం కాగా.. బిన్నీ సైతం డకౌట్ అయ్యాడు.
ఆకాశమే హద్దుగా మిథున్
ఇలాంటి దశలో అభిమన్యు మిథున్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 16 బంతుల్లోనే 4 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 50 పరుగులు చేశాడు. అయితే, అతడు రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరగడం ప్రభావం చూపింది.
ఇక దినేశ్ కార్తిక్ 14 బంతుల్లో 42, షాబాజ్ నదీమ్ రెండు బంతుల్లో 5 పరుగులతో అజేయంగా నిలిచారు. ఫలితంగా నిర్ణీత ఆరు ఓవర్లలో మూడు వికెట్లు నష్టపోయిన భారత్ 107 పరుగులు చేసింది. యూఏఈ బౌలర్లలో నీలాన్ష్ కేశ్వాణి రెండు వికెట్లు తీయగా.. అన్ష్ టాండన్ ఒక వికెట్ దక్కించుకున్నాడు.
కెప్టెన్ ఖలీద్ షా గెలిపించాడు
ఇక యూఏఈ ఒక బంతి మిగిలి ఉండగానే లక్ష్య ఛేదనను పూర్తి చేసింది. ఓపెనర్, కెప్టెన్ ఖలీద్ షా 14 బంతుల్లో 50 పరుగుల (రిటైర్డ్ హర్ట్)తో విధ్వంసం సృష్టించగా.. సాఘిర్ ఖాన్ 11 బంతుల్లో 31 పరుగులతో అలరించాడు. అన్ష్ టాండన్ (2) విఫలమైనా.. ముహమ్మద్ అర్ఫాన్ (5 బంతుల్లో 20) సునామీ ఇన్నింగ్స్‌తో చెలరేగాడు.
అతడికి తోడుగా కేశ్వాణి (2 బంతుల్లో 5) రాణించగా.. 5.5 ఓవర్లలో కేవలం రెండు వికెట్ల నష్టానికి 111 పరుగులు చేసింది. ఫలితంగా భారత జట్టుపై నాలుగు వికెట్ల తేడాతో యూఏఈ గెలుపొందింది. కాగా క్రికెట్ ప్రపంచంలో పసికూనలుగా పరిగణించే కువైట్, యూఏఈ.. డీకే సేనను చిత్తు చేయడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.
చదవండి: ‘గిల్ కోసం బలి.. సంజూను కాదని జితేశ్ శర్మను అందుకే ఆడిస్తున్నారు’
భారత జట్టు ప్రకటన.. కెప్టెన్‌గా డీకే.. పన్నెండు జట్ల వివరాలు ఇవే


