‘అందుకే.. సంజూను కాదని జితేశ్‌ శర్మను ఆడిస్తున్నారు’ | IND vs AUS: Kaif reasons why Sanju Samson lost his place in playing XI | Sakshi
Sakshi News home page

‘గిల్‌ కోసం బలి.. సంజూను కాదని జితేశ్‌ శర్మను అందుకే ఆడిస్తున్నారు’

Nov 7 2025 5:32 PM | Updated on Nov 7 2025 5:46 PM

IND vs AUS: Kaif reasons why Sanju Samson lost his place in playing XI

ఆసియా కప్‌-2025 సందర్భంగా భారత టీ20 జట్టులోకి శుబ్‌మన్‌ గిల్‌ (Shubman Gill) తిరిగి వచ్చిన నాటి నుంచి సంజూ శాంసన్‌ (Sanju Samson) చిక్కుల్లో పడ్డాడు. గిల్‌ గైర్హాజరీలో దాదాపు ఏడాది పాటు ఓపెనర్‌గా అదరగొట్టిన ఈ కేరళ బ్యాటర్‌కు ఇప్పుడు తుదిజట్టులో చోటే కరువయ్యే పరిస్థితి నెలకొంది.

ఏ స్థానంలో బ్యాటింగ్‌కు రావాలో తెలియదు
ఒకవేళ ప్లేయింగ్‌ ఎలెవన్‌కు ఎంపికైనా.. ఏ స్థానంలో బ్యాటింగ్‌కు రావాలో ఆఖరి నిమిషం వరకు తనకే తెలియని దుస్థితి. ఆస్ట్రేలియా తాజా పర్యటన (IND vs AUS)లో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి టీ20 వర్షార్పణం కాగా.. రెండో టీ20లో సంజూను వన్‌డౌన్‌లో ఆడించారు. అయితే, ఈ స్థానంలో సంజూ దారుణంగా విఫలమయ్యాడు. కేవలం రెండు పరుగులే చేసి నాథన్‌ ఎల్లిస్‌ బౌలింగ్‌లో బౌల్డ్‌ అయ్యాడు.

ఈ క్రమంలో మూడో టీ20 నుంచి సంజూను తప్పించిన యాజమాన్యం అతడి స్థానంలో మరో వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ జితేశ్‌ శర్మకు చోటు కల్పించింది. ఏడో స్థానంలో వచ్చిన జితేశ్‌ 13 బంతుల్లో 22 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఇక నాలుగో టీ20లో మాత్రం కేవలం మూడే పరుగులు చేసి నిష్క్రమించాడు.

ఇదిలా ఉంటే.. ఆసీస్‌తో నాలుగో టీ20లో టీమిండియా మేనేజ్‌మెంట్‌ మరో ప్రయోగం చేసింది. ఆల్‌రౌండర్‌ శివం దూబేను మూడో స్థానంలో పంపింది. ఈ పరిణామాల నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్‌ మొహమ్మద్‌ కైఫ్‌.. గిల్‌, సంజూ, జితేశ్‌లతో పాటు యశస్వి జైస్వాల్‌ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశాడు.

గిల్‌ కోసం బలి
‘‘ఒకవేళ సంజూ శాంసన్‌ తుదిజట్టులో ఉంటే బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ఎలాంటి కన్ఫ్యూజన్‌ ఉండదు. అయితే, వైస్‌ కెప్టెన్‌ హోదాలో శుబ్‌మన్‌ గిల్‌ అన్ని మ్యాచ్‌లు ఆడటం ఖాయం. అందుకే సంజూను పక్కనపెట్టారు.

సంజూను కాదని ..
ఇక ఐదు లేదంటే ఆరో స్థానంలో ఫినిషర్‌గా.. సంజూ కంటే జితేశ్‌ మెరుగు అని భావించి అతడి వైపు మేనేజ్‌మెంట్‌ మొగ్గు చూపుతోంది. గిల్‌ కాబోయే కెప్టెన్‌ కాబట్టి సంజూకు ఇక స్థానం దక్కకపోవచ్చు.

ఏదేమైనా సంజూ రికార్డు అద్భుతంగా ఉంది. 150కి పైగా స్ట్రైక్‌రేటుతో అతడు పరుగులు రాబట్టాడు. కానీ ఇప్పుడు ఏ స్థానంలో ఎవరు బెటర్‌ అన్న అంశం ఆధారంగానే జట్టును ఎంపిక చేస్తున్నారు కాబట్టి సంజూకు అవకాశం దక్కడం లేదు.

గిల్‌ టీ20లలో మరీ అంత తీసిపారేసే బ్యాటరేమీ కాదు. ఐపీఎల్‌లో గుజరాత్‌ టైటాన్స్‌ ఓపెనర్‌గా మెరుగ్గా ఆడుతున్నాడు. కానీ అంతర్జాతీయ ఫార్మాట్లోనే విఫలమవుతున్నాడు. భారీ ఇన్నింగ్స్‌ ఆడితే తప్ప అతడిపై విమర్శలు ఆగవు.  

సంజూతో పాటు జైసూ జట్టులోకి!
అప్పుడే సంజూ, యశస్వి జైస్వాల్‌ గురించి ఎవరూ మాట్లాడరు. సౌతాఫ్రికాతో స్వదేశంలో టీ20 సిరీస్‌లో గిల్‌కు విశ్రాంతినిచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఓపెనింగ్‌ స్థానంలో సంజూ, జైసూ జట్టులోకి రావొచ్చు. వీరిద్దరు గనుక మరోసారి నిరూపించుకుంటే.. వరల్డ్‌కప్‌ రేసులో తప్పక ఉంటారు’’ అని కైఫ్‌ అభిప్రాయపడ్డాడు.

కాగా ఆసీస్‌తో నాలుగు టీ20లలో కలిపి గిల్‌ కేవలం 103 పరుగులు రాబట్టాడు. ఈ సిరీస్‌లో భారత్‌ 2-1తో ముందంజలో ఉండగా.. ఇరుజట్ల మధ్య నిర్ణయాత్మక శనివారం నాటి ఐదో టీ20కి గబ్బా వేదిక.

చదవండి: ICC: జై షా జోక్యం.. నాకూ వరల్డ్‌కప్‌ మెడల్‌: ప్రతికా రావల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement