యాషెస్ సిరీస్ 2025-26ను సొంతం చేసుకుని గెలుపు జోష్‌లో ఉన్న ఆస్ట్రేలియాకు ఊహించని షాక్ తగిలింది. ఈ సిరీస్‌లో మిగిలిన రెండు మ్యాచ్‌లకు ఆ జట్టు స్టార్ స్పిన్నర్ నాథన్ లియోన్ గాయం కారణంగా దూరం కానున్నట్లు తెలుస్తోంది. అడిలైడ్ వేదికగా మూడో టెస్టు ఐదో రోజు ఆటలో ఫీల్డింగ్ చేస్తుండగా లియోన్ తొడ కండరాలు పట్టేశాయి.
దీంతో అతడు తీవ్ర ఇబ్బంది పడ్డాడు. వెంటనే ఫిజియో సాయంతో మైదానాన్ని వీడాడు. అయితే మ్యాచ్ ముగిసిన లియోన్ క్రచెస్ (ఊత కర్రల) సహాయంతో నడుస్తూ కనిపించడం అందరిని షాక్‌కు గురిచేసింది. దీని బట్టి అతడి గాయం తీవ్రమైనదిగా పరిగణించవచ్చు.
ఇప్పటికే జోష్ హాజిల్‌వుడ్, స్టీవ్ స్మిత్ వంటి స్టార్ ప్లేయర్లు గాయాల బారిన పడ్డారు. అయితే డిసెంబర్ 26 నుంచి మెల్‌బోర్న్ వేదికగా జరగనున్న బాక్సింగ్ డే టెస్టుకు స్మిత్ అందుబాటులోకి వచ్చే అవకాశముంది. అతడు తిరిగి వస్తే జాక్ వెదరాల్డ్‌పై వేటు పడే అవకాశముంది.
ఇక లియోన్ గాయంపై ఆసీస్ స్పీడ్ స్టార్ మిచెల్ స్టార్క్ స్పందించాడు. "నాథన్ లియోన్‌కి ఇలా జరగడం చాలా బాధాకరం. అడిలైడ్ టెస్టు విజయంలో అతడిది కీలక పాత్ర. కచ్చితంగా అతడికి క్రెడిట్ ఇవ్వాల్సిందే. నాథన్ తిరిగి రిహాబిలిటేషన్ సెంటర్‌కు వెళ్లనున్నాడు.
గతంలో కూడా అతడి పిక్క గాయం కారణంగా రిహాబిలిటేషన్‌లో ఉన్నాడు. కాబట్టి ఎలా కోలుకోవాలన్నదానిపై అతడికి అవగాహన ఉంది. మరికొన్నాళ్ల పాటు క్రికెట్ ఆస్ట్రేలియాకు తన సేవలను అతడు అందించాలనుకుంటున్నాడు. నాథర్ వేగంగా కోలుకుని తిరిగి మైదానంలో అడుగుపెట్టాలని ఆశిస్తున్నాను" అని స్టార్క్ పేర్కొన్నాడు.
మూడో టెస్టులో లియోన్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. 5 వికెట్లు పడగొట్టి ఇంగ్లండ్ ఓటమిని శాసించాడు. కాగా తొలి మూడు టెస్టులో విజయం సాధించిన ఆస్ట్రేలియా.. యాషెస్ సిరీస్‌ను 3-0 తేడాతో రిటైన్ చేసుకుంది.
చదవండి: పాకిస్తాన్ ఓవరాక్షన్!.. అసలు కప్పు గెలిస్తే ఇంకేమైనా ఉందా?


