పెట్టిన సొమ్ముకు.. అతడి ఆటకు సంబంధమే లేదు! అయినా.. | RCB Always Target KKR players: Abhishek Nayar On Venkatesh Iyer Demand | Sakshi
Sakshi News home page

ఆర్సీబీ మా వాళ్ల వెంటే పడుతుంది.. అతడి కోసం ట్రై చేశాం.. కానీ..

Dec 22 2025 1:01 PM | Updated on Dec 22 2025 1:08 PM

RCB Always Target KKR players: Abhishek Nayar On Venkatesh Iyer Demand

కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ (కేకేఆర్‌)తో ఆల్‌రౌండర్‌ వెంకటేశ్‌ అయ్యర్‌ ప్రయాణం ముగిసింది. ఐపీఎల్‌-2026లో అతడు రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్సీబీ) తరఫున బరిలోకి దిగనున్నాడు. ఇటీవల అబుదాబిలో జరిగిన మినీ వేలంలో వెంకటేశ్‌ కోసం లక్నో సూపర్‌ జెయింట్స్‌, గుజరాత్‌ టైటాన్స్‌, కేకేఆర్‌, ఆర్సీబీ మధ్య పోటీ నెలకొంది.

ఈ క్రమంలో రూ. 3.2 కోట్ల ధర దాటిని తర్వాత లక్నో, గుజరాత్‌ తప్పుకోగా.. కేకేఆర్‌ (KKR) రూ. 6.8 కోట్ల వరకు బిడ్‌ వేసింది. అయితే, ఆఖరికి రూ. 7 కోట్లకు ఆర్సీబీ అతడిని సొంతం చేసుకుంది. కాగా 2021లో కేకేఆర్‌ తరఫున అరంగేట్రం చేసిన మధ్యప్రదేశ్‌ ఆటగాడు వెంకటేశ్‌ అయ్యర్‌ (Venkatesh Iyer).. 2025 వరకు అదే జట్టుతో కొనసాగాడు.

ధరలో హై జంప్‌
రూ. 20 లక్షల కనీస ధరతో కేకేఆర్‌లో చేరిన వెంకీ అద్భుత ప్రదర్శన కనబరచగా.. మరుసటి ఏడాది వేలానికి ముందు ఏకంగా రూ. 8 కోట్లకు జట్టు రిటైన్‌ చేసుకుంది. 2023, 24 సీజన్లలోనూ ఈ మేర భారీ మొత్తమే చెల్లించింది.  అయితే, 2024లో జట్టు విజేతగా నిలవడంలో కీలక పాత్ర పోషించిన వెంకీ వేలానికి ముందు జట్టును వీడాడు.

అనూహ్య రీతిలో రూ. 23.75 కోట్లు
ఈ క్రమంలో ఆక్షన్‌లో అతడి కోసం కేకేఆర్‌ ఏకంగా రూ. 23.75 కోట్లు ఖర్చు చేసింది. నిజానికి అతడి స్థాయికి అది మించిన ధరే అని చెప్పవచ్చు. అయినప్పటికీ కేకేఆర్‌ వెంకీ కోసం పర్సు నుంచి భారీ మొత్తమే వెచ్చించి అతడిని మళ్లీ జట్టులో చేర్చుకుంది. అయితే, ఈసారి అతడు కనీస స్థాయి ప్రదర్శన కూడా కనబరచలేదు.

పెట్టిన సొమ్ముకు.. అతడి ఆటకు సంబంధమే లేకుండా పోయింది. పదకొండు మ్యాచ్‌లు ఆడి కేలం 142 పరుగులే చేశాడు. ఇక ఈ పేస్‌ ఆల్‌రౌండర్‌ ఒక్క ఓవర్‌ కూడా బౌలింగ్‌ వేయలేదు. ఈ నేపథ్యంలో 2026 మినీ వేలానికి ముందు కేకేఆర్‌ అతడిని విడిచిపెట్టింది. అయినప్పటికీ తిరిగి తెచ్చుకోవాలని భావించగా.. ఆర్సీబీ ఈసారి పట్టు వీడకుండా అతడిని తమ సొంతం చేసుకుంది.

తక్కువ ధరకే కొందాం అనుకొన్నాం
ఈ పరిణామాల నేపథ్యంలో కేకేఆర్‌ హెడ్‌కోచ్‌ అభిషేక్‌ నాయర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆర్సీబీ ఎల్లప్పుడూ తమ ఆటగాళ్ల వెంటే పడుతుందని పేర్కొన్నాడు. జియోహాట్‌స్టార్‌తో మాట్లాడుతూ.. ‘‘తన కెరీర్‌ ఆరంభం నుంచి వెంకటేశ్‌ అయ్యర్‌ మా ఫ్రాంఛైజీతోనే ఉన్నాడు.

అతడిని తిరిగి సొంతగూటికి తీసుకురావాలని మేము ప్రయత్నించాము. వైవిధ్యభరితమైన ఆటగాళ్ల కోసం ఫ్రాంఛైజీలు తమ డబ్బును సేవ్‌ చేసుకుంటాయని అనుకున్నాము. కాబట్టి వెంకటేశ్‌ను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చని భావించాము.

ఆర్సీబీ మా వాళ్ల వెంటే పడుతుంది
అయితే, ఆర్సీబీ ఎల్లప్పుడూ మా ఆటగాళ్ల వెంటే పడుతుంది కదా!.. ఈసారి ఎట్టకేలకు అతడిని సొంతం చేసుకుంది. చాలా ఏళ్లుగా వెంకటేశ్‌ మా జట్టుతో ఉన్నాడు. ఐపీఎల్‌లో అతడి కొత్త ప్రయాణం సజావుగా సాగాలని కోరుకుంటున్నా’’ అని అభిషేక్‌ నాయర్‌ పేర్కొన్నాడు.

కాగా అభిషేక్‌ నాయర్‌ చెప్పినట్లు ఆర్సీబీ మరీ కేకేఆర్‌ ఆటగాళ్ల వెంబడే పడినట్లు ఎప్పుడూ కనిపించలేదు. అయితే, కేకేఆర్‌ మాజీ ప్లేయర్లు ఫిల్‌ సాల్ట్‌, క్రిస్‌ గేల్‌, సూయశ్‌ శర్మ తదితరులు ఆర్సీబీ ఆడారు. ఫ్రాంఛైజీ క్రికెట్‌లో ఇలాంటివి సహజమే. 

ఇక వెంకటేశ్‌ అయ్యర్‌కు బదులు కేకేఆర్‌ ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ కామెరాన్‌ గ్రీన్‌ను జట్టులో చేర్చుకుంది. ఇందుకోసం ఏకంగా రూ. 25.20 కోట్లు ఖర్చుపెట్టింది. తద్వారా ఐపీఎల్‌ చరిత్రలో అత్యధిక ధరకు అమ్ముడుపోయిన విదేశీ ఆటగాడిగా గ్రీన్‌ నిలిచాడు.

చదవండి: Rohit Sharma: చాలా బాధ‌ప‌డ్డాను.. క్రికెట్ వదిలేయాలనుకున్నా

Advertisement
 
Advertisement
Advertisement