భార్య అనుష్కతో కోహ్లి (PC: BCCI/RCB)
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ)కు ఉన్న క్రేజే వేరు. టీమిండియా బ్యాటింగ్ దిగ్గజం, రన్‌మెషీన్ విరాట్ కోహ్లి ఈ జట్టులో భాగం కావడం ఇందుకు ప్రధాన కారణం. అయితే, ప్రతి ఏడాది.. ‘‘ఈసారి కప్ మనదే’’ అనుకుంటూ సోషల్ మీడియాలో సందడి చేసే ఆర్సీబీ అభిమానులకు పదిహేడేళ్లపాటు చేదు అనుభవమే మిగిలింది.
పద్దెనిమిదేళ్లకు
ఎట్టకేలకు సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ గతేడాది రజత్ పాటిదార్ (Rajat Patidar) కెప్టెన్సీలోని ఆర్సీబీ ఐపీఎల్ టైటిల్ నెగ్గింది. లీగ్ మొదలైన (2008) నాటి నుంచి జట్టుతోనే ఉన్న కోహ్లి.. పద్దెనిమిదేళ్లకు తర్వాత తొలిసారి ట్రోఫీని ముద్దాడి ఉద్వేగానికి లోనయ్యాడు.
చేతులు మారనున్న యాజమాన్యం
ఈ క్రమంలో విజయోత్సవాన్ని జరుపుకొనేందుకు సిద్ధమైన ఆర్సీబీ, ఫ్యాన్స్ విషాదంలో మునిగిపోవాల్సి వచ్చింది. తొక్కిసలాటలో అభిమానులు మృతి చెందారు. ఈ నేపథ్యంలో బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం నుంచి ఆర్సీబీ మ్యాచ్‌లు తరలిపోనున్నాయి. ఇందుకు తోడు ఆర్సీబీ యాజమాన్యం కూడా చేతులు మారనుంది.
ఆదార్ పూనావాలా ఆసక్తి
ఆర్సీబీని అమ్మకానికి పెట్టినట్లు ఫ్రాంఛైజీ మేనేజ్‌మెంట్ డియాజియో ఇటీవలే అధికారికంగా వెల్లడించింది. విపరీతమైన ఆదరణ కలిగి ఉన్న ఈ ఫ్రాంఛైజీని కొనుగోలు చేసేందుకు సీరం ఇన్‌స్టిట్యూట్ చీఫ్ ఆదార్ పూనావాలా ఆసక్తి చూపుతున్నట్లు వార్తలు వచ్చాయి.
‘కొనుగోలు’కు సిద్ధమైన అనుష్క శర్మ, రణ్‌బీర్ కపూర్!
తాజా సమాచారం ప్రకారం.. ఆర్సీబీలో వాటాలు కొనేందుకు బాలీవుడ్ ప్రముఖులు కూడా ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. విరాట్ కోహ్లి సతీమణి, బాలీవుడ్ స్టార్ అనుష్క శర్మ ఆర్సీబీలో మూడు శాతం వాటా కోసం సుమారు రూ. 400 కోట్లు వెచ్చించేందుకు ఆసక్తి చూపుతున్నట్లు ఫైనాన్షియల్ ఎక్స్‌ప్రెస్ తెలిపింది.
మరోవైపు.. రణ్‌బీర్ కపూర్ సైతం రెండు శాతం వాటా కొనుగోలుకు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొంది. కాగా ఆర్సీబీ విలువ పెరగడంలో కోహ్లిది కీలక పాత్ర. అలాంటి ఫ్రాంఛైజీలోకి కోహ్లి జీవిత భాగస్వామి పెట్టుబడిదారుగా రావడాన్ని బీసీసీఐ ఆమోదిస్తుందో లేదో చూడాల్సి ఉంది. ద్వంద్వ ప్రయోజనాలు పొందకుండా ఉండేందుకు వీలుగా ఐపీఎల్ జట్లలో ఆటగాళ్లు (యాక్టివ్) ఎలాంటి వాటాలు కొనుగోలు చేయకుండా బీసీసీఐ ఆంక్షలు విధించింది.


