భారత్ ఐసీసీ మహిళల వన్డే వరల్డ్‌కప్-2025 ట్రోఫీ గెలవడంలో ప్రతికా రావల్ (Pratika Rawal)ది కూడా కీలక పాత్ర. టీమిండియా ఓపెనర్‌గా వచ్చిన నాటి నుంచి సత్తా చాటుతున్న ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. ప్రపంచకప్ టోర్నీలోనూ అదరగొట్టింది.
ఆరు ఇన్నింగ్స్‌లో కలిపి 308 పరుగులు రాబట్టిన ప్రతికా ఖాతాలో ఓ శతకం.. ఓ హాఫ్ సెంచరీ ఉన్నాయి. అయితే, దురదృష్టవశాత్తూ ఆస్ట్రేలియాతో సెమీ ఫైనల్‌కు ముందు ప్రతికా గాయపడింది. లీగ్ దశలో చివరగా బంగ్లాదేశ్‌తో నామమాత్రపు మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో ఆమె చీలమండకు గాయమైంది.
ప్రతికా స్థానంలో ‘లేడీ సెహ్వాగ్’
ఈ క్రమంలో నొప్పితో విలవిల్లాడుతూ మైదానం వీడిన ప్రతికా రావల్.. ఆ తర్వాతి మ్యాచ్‌లకు దూరమైంది. ఆమె స్థానంలో ‘లేడీ సెహ్వాగ్’ షఫాలీ వర్మ (Shafali Verma) జట్టులోకి వచ్చింది. ఆసీస్‌తో సెమీస్‌లో తేలిపోయినా.. సౌతాఫ్రికాతో ఫైనల్లో (IND vs SA) షఫాలీ సత్తా చాటింది. ఈ ఓపెనింగ్ బ్యాటర్ ఏకంగా 87 పరుగులు రాబట్టడంతో పాటు రెండు వికెట్లు తీసి సత్తా చాటింది.
ప్రతికా స్థానంలో తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న షఫాలీ.. భారత్ విజయంలో కీలక పాత్ర పోషించి మెడల్ గెలుచుకుంది. మరోవైపు.. గాయం వల్ల జట్టుకు దూరమైన ప్రతికాకు నిబంధనల కారణంగా వరల్డ్‌కప్ మెడల్ దక్కలేదు.
వీల్‌చైర్‌లోనే మైదానానికి వచ్చి..
అయితే, భారత్ సౌతాఫ్రికాను ఓడించి విజేతగా నిలిచిన తర్వాత ప్రతికా వీల్‌చైర్‌లోనే మైదానానికి వచ్చి.. సహచరులతో కలిసి సంబరాలు జరుపుకొంది. అయితే, అప్పుడు ఆమెకు మెడల్ దక్కలేదు. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీతో వన్డే వరల్డ్‌కప్ విజేత జట్టు సమావేశమైన సందర్భంగా ప్రతికా మెడలో పతకం కనిపించింది.
అదే సమయంలో అమన్‌జోత్ కౌర్ మెడల్ లేకుండా కనిపించగా.. ఆమే ప్రతికాకు తన మెడల్ ఇచ్చిందని అంతా భావించారు. ఈ విషయంపై ప్రతికా తాజాగా స్పందించింది. జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది.
జై షా జోక్యం.. నాకూ వరల్డ్‌కప్ మెడల్
‘‘ఆరోజు అమన్‌జోత్ మెడల్ ఎందుకు వేసుకోలేదు నాకు తెలియదు. బహుశా తను మర్చిపోయి ఉంటుంది. అయితే, సహాయక సిబ్బంది ఒకరు తన మెడల్‌ను నాకు ఇచ్చారు. ఇంకో విషయం ఏమిటంటే.. త్వరలోనే నా మెడల్ నా దగ్గరకు చేరనుంది.
ఈ విషయం గురించి జై షా (ఐసీసీ చైర్మన్) మా మేనేజర్‌కు సందేశం అందించారు. ప్రతికాకు పతకం వచ్చేలా తాను ఏర్పాట్లు చేస్తున్నానని మెసేజ్ చేశారు. కాబట్టి నాకు త్వరలోనే మెడల్ లభిస్తుంది. ఏదేమైనా సపోర్టు స్టాఫ్ నాకు మెడల్ ఇవ్వగానే.. ఏడ్చేశా.
సాధారణంగా నేను ఎమోషనల్ అవ్వను. కానీ ఈసారి భావోద్వేగాన్ని నియంత్రించుకోలేకపోయాను. ఐసీసీ నాకు మెడల్ పంపగలదా? అని జై షా అక్కడి వారిని అడిగారు.
అయితే, పతకం నా చేతికి రావడానికి ఇంకాస్త సమయం పడుతుంది. కానీ ప్రధాని దగ్గరకు వెళ్లినపుడు పతకం లేదనే బెంగ లేకుండా సహాయక సిబ్బంది తన మెడల్‌ను నాకు ఇచ్చారు’’ అని ప్రతికా రావల్ చెప్పుకొచ్చింది.
ఐసీసీ నిబంధనల ప్రకారం
కాగా ఐసీసీ నిబంధనల ప్రకారం ఫైనల్‌కు ఎంపికైన జట్టులోని పదిహేను మంది ఆటగాళ్లకు మాత్రమే (గెలిచిన జట్టు) మెడల్స్ ఇస్తారు. గాయం వల్ల ప్రతికా జట్టులో స్థానం కోల్పోయినందున ముందుగా ఆమెకు మెడల్ దక్కలేదు. అయితే, ఐసీసీ చైర్మన్ జై షా నేరుగా జోక్యం చేసుకుని పతకం వచ్చేలా చేయడం చర్చకు దారితీసింది.
చదవండి: అందుకే వరల్డ్‌కప్ విన్నర్‌ని వదిలేశాం: అభిషేక్ నాయర్


