మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) టీ20 క్రికెట్ టోర్నీ వేలం- 2026 మెగా వేలానికి ముందు యూపీ వారియర్స్ తీసుకున్న నిర్ణయం క్రీడా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కేవలం ఒకే ఒక్క ప్లేయర్‌ను రిటైన్ చేసుకున్న ఈ ఫ్రాంఛైజీ.. మిగతా అందరినీ వదిలేసింది. ఇందులో.. భారత స్టార్ ఆల్‌రౌండర్, వన్డే ప్రపంచకప్-2025 విజేత దీప్తి శర్మ (Deepti Sharma) కూడా ఉండటం విశేషం.
ఇటీవల ముగిసిన ఈ మెగా ఐసీసీ టోర్నీలో దీప్తి అద్భుత ప్రదర్శనతో ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ’ అవార్డు గెలుచుకుంది. అయినప్పటికీ యూపీ వారియర్స్ ఆమెను వదిలేయడం గమనార్హం. ఈ నేపథ్యంలో ఫ్రాంఛైజీ నిర్ణయంపై విమర్శలు వస్తుండగా.. యూపీ వారియర్స్ హెడ్‌కోచ్ అభిషేక్ నాయర్ (Abhishek Nayar) తాజాగా స్పందించాడు. జియో హాట్‌స్టార్‌తో మాట్లాడుతూ..
అందుకే వరల్డ్‌కప్ విన్నర్‌ని వదిలేశాం
‘‘మేము సరికొత్తగా సీజన్‌ను ఆరంభించాలనుకుంటున్నాం. పర్సులో వీలైనంత ఎక్కువ మొత్తాన్ని అట్టిపెట్టుకోవాలనుకున్నాం. కొత్త జట్టును నిర్మించాలని భావించాం. టైటిల్ గెలవగల జట్టును తయారు చేసే క్రమంలో వనరులు పొందేందుకు వీలుగా పర్సును నిండుగా ఉంచుకున్నాం.
ఇప్పుడు వదిలివేసినా.. మాకు కావాల్సిన ప్లేయర్లను వేలంలో తిరిగి సొంతం చేసుకోవాలనే తలంపుతో ఉన్నాము’’ అని అభిషేక్ నాయర్.. తాము దీప్తి శర్మను రిలీజ్ చేయడానికి గల కారణాన్ని వెల్లడించాడు. కాగా 2023లో మొదలైన డబ్ల్యూపీఎల్‌లో ముంబై చాంపియన్స్ అరంగేట్ర చాంపియన్‌గా అవతరించింది.
ఆ మరుసటి ఏడాది అంటే 2024లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు టైటిల్ గెలవగా.. ఈ ఏడాది ముంబై మరోసారి ట్రోఫీ దక్కించుకుని చరిత్ర సృష్టించింది. కాగా డబ్ల్యూపీఎల్‌లో ముంబై, బెంగళూరుతో పాటు యూపీ, గుజరాత్, ఢిల్లీ ఫ్రాంఛైజీలు పాల్గొంటున్నాయి.
పర్సులో రూ. 14.50 కోట్లు
ఇదిలా ఉంటే.. నవంబరు 27న డబ్ల్యూపీఎల్ మెగా వేలం జరుగనుండగా.. ఇప్పటికే ఐదు ఫ్రాంఛైజీలు తమ రిటెన్షన్, రిలీజ్ లిస్టును విడుదల చేశాయి. యూపీ వారియర్స్ పర్సులో రూ. 14.50 కోట్లు ఉన్నాయి.
ఇక వన్డే ప్రపంచకప్ క్రికెట్ టోర్నీలో విశేషంగా రాణించిన భారత ఆల్‌రౌండర్ దీప్తి శర్మ... దక్షిణాఫ్రికా కెప్టెన్ లౌరా వోల్‌వార్ట్... మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) మెగా వేలంలో భాగం కానున్నారు. ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ’గా నిలిచిన దీప్తి శర్మను యూపీ వారియర్స్ జట్టు... ‘టోర్నీ టాప్ స్కోరర్’ వోల్‌వార్ట్‌ను గుజరాత్ జెయింట్స్ జట్టు రీటెయిన్ చేసుకోకుండా విడుదల చేసిన విషయం తెలిసిందే.
స్టార్లను వదిలేశారు
డబ్ల్యూపీఎల్- 2024 ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ’గా నిలిచిన దీప్తి శర్మను వదులుకొని భారత అండర్–19 ప్రపంచకప్ విజేత జట్టు సభ్యురాలైన శ్వేత సెహ్రావత్‌ను యూపీ వారియర్స్ జట్టు అట్టిపెట్టుకోవడం గమనార్హం. ఆస్ట్రేలియా స్టార్స్ అలీసా హీలీ, మెగ్ లానింగ్, కివీస్ ఆల్‌రౌండర్ అమెలియా కెర్‌లను కూడా ఆయా ఫ్రాంచైజీలు విడుదల చేశాయి.
నిబంధనలు ఇవే
భారత స్టార్స్ హర్మన్‌ప్రీత్ కౌర్, స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్స్, రిచా ఘోష్, షఫాలీ వర్మలను ఆయా ఫ్రాంచైజీలు అట్టిపెట్టుకున్నాయి. డబ్ల్యూపీఎల్ రిటెన్షన్ నిబంధనల ప్రకారం ఒక్కో ఫ్రాంచైజీ గరిష్టంగా ఐదుగురిని అట్టిపెట్టుకోవచ్చు.
ఇందులో ముగ్గురు భారత క్రికెటర్లు, ఇద్దరు విదేశీ క్రికెటర్లు ఉండాలి. డబ్ల్యూపీఎల్–2026 సీజన్ కోసం ఈనెల 27న న్యూఢిల్లీలో వేలం కార్యక్రమం నిర్వహిస్తారు. ఢిల్లీ క్యాపిటల్స్ గరిష్టంగా ఐదుగురిని రిటైన్ చేసుకోగా... ముంబై ఇండియన్స్ నలుగురిని... రాయల్ చాలెంజర్స్ బెంగళూరు నలుగురిని... గుజరాత్ జెయింట్స్ ఇద్దరిని... యూపీ వారియర్స్ ఒక్కరిని రీటెయిన్ చేసుకుంది.
చదవండి: WPL 2026: రిటైన్ చేసుకున్న, రిలీజ్ చేసిన ఆటగాళ్ల పూర్తి జాబితా


