ముక్కోణపు వన్డే సిరీస్‌లో భారత్- ‘ఎ’ జట్టు తమ ఆఖరి లీగ్ మ్యాచ్ ఆడేసింది. దంబుల్లా వేదికగా అఫ్గానిస్తాన్- ‘ఎ’తో బుధవారం నాటి మ్యాచ్‌లో తిలక్ వర్మ సేన 101 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా నెట్‌రన్‌రేటు భారీగా మెరుగుపరుచుకుని ఫైనల్ చేరుకుంది.
వరుసగా రెండు ఓటములు
శ్రీలంక వేదికగా ఆతిథ్య జట్టుతో భారత్- ‘ఎ’, అఫ్గాన్ - ‘ఎ’ జట్లు ముక్కోణపు వన్డే సిరీస్ ఆడుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా తొలుత శ్రీలంకపై గెలిచిన భారత్.. తదుపరి మ్యాచ్‌లో అఫ్గాన్ చేతిలో ఓడిపోయింది. అనంతరం శ్రీలంకతో మరో మ్యాచ్ ఆడగా.. సూపర్ ఓవర్‌లో తిలక్ వర్మ సేనకు భంగపాటే ఎదురైంది.
319 పరుగులు
ఈ క్రమంలో ఫైనల్ రేసులో నిలవాలంటే అఫ్గాన్‌పై బుధవారం నాటి మ్యాచ్‌లో తప్పక గెలవాల్సిన పరిస్థితి. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడిన భారత్ తొలుత బ్యాటింగ్‌కు దిగింది. నిర్ణీత 50 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 319 పరుగులు సాధించింది.
ఓపెనర్లలో ప్రియాన్ష్ ఆర్య అర్ధ శతకం (58)తో రాణించగా.. వైభవ్ సూర్యవంశీ (38) ఫర్వాలేదనిపించాడు. వన్‌డౌన్‌లో వచ్చిన రుతురాజ్ గైక్వాడ్ 30 పరుగులు చేయగా.. కెప్టెన్ తిలక్ వర్మ (59), వికెట్ కీపర్ బ్యాటర్ కుమార్ కుశాగ్ర (58) హాఫ్ సెంచరీలతో అదరగొట్టారు.
సూర్యాంశ్ షెడ్గే (7) విఫలం కాగా.. నిశాంత్ సింధు (21 నాటౌట్), విప్రాజ్ నిగమ్ (30) మెరుగ్గా రాణించారు. ఫలితంగా భారత్ మంచి స్కోరు సాధించింది. అఫ్గాన్ బౌలర్లలో ఫరీదూన్ దావూద్జాయ్, అబ్దుల్లా అహ్మద్జాయ్, ఫర్మానుల్లా సఫీ రెండేసి వికెట్లు కూల్చగా.. జహీర్ ఖాన్ ఒక వికెట్ దక్కించుకున్నాడు.
చెలరేగిన నిశాంత్ సింధు
అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన అఫ్గానిస్తాన్‌కు ఆరంభంలోనే షాకులు తగిలాయి. టాపార్డర్‌లో ఓపెనర్ హసన్ ఐసాఖిల్ (14), వన్‌డౌన్ బ్యాటర్ ఖలీద్ తనీవాల్ (13) ఇలా వచ్చి అలా వెళ్లారు. మరో ఓపెనర్, కెప్టెన్ ఇమ్రాన్ మిర్ 32 పరుగులతో ఫర్వాలేదనిపించారు.
మిగిలిన వారిలో ఫైజల్ షినోజాదా (46), బహీర్ షా (57) ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేయగా.. మిగతా వారంతా చేతులెత్తేశారు. మహ్మద్ ఇషాక్ (16), ఫర్మానుల్లా సఫీ (17లతో పాటు షామ్స్ ఉర్ రహ్మాన్ (8), అబ్దుల్లా అహ్మద్జాయ్ (6), జహీర్ ఖాన్ (4) భారత బౌలర్ల ధాటికి తాళలేక పెవిలియన్‌కు క్యూ కట్టారు.
ఫైనల్‌కు దూసుకువెళ్లిన భారత్
ఈ క్రమంలో 36.5 ఓవర్లలో 218 పరుగులకే అఫ్గానిస్తాన్ ఆలౌట్ అయింది. ఫలితంగా భారత్ 101 పరుగుల తేడాతో జయభేరి మోగించింది. భారత బౌలర్లలో నిశాంత్ సింధు నాలుగు వికెట్లతో చెలరేగగా.. యశ్ ఠాకూర్ రెండు, అన్షుల్ కాంబోజ్, విప్రాజ్ నిగమ్, సూర్యాంశ్ షెడ్గే, అనుకుల్ రాయ్ తలా ఒక వికెట్ పడగొట్టారు.
ఇక ఈ విజయంతో భారత్ ఖాతాలో నాలుగు పాయింట్లు చేరాయి. నెట్‌రన్‌రేటు +0.797. మిగిలిన ఒక్క లీగ్ మ్యాచ్‌లో శ్రీలంక- అఫ్గానిస్తాన్ అమీతుమీ తేల్చుకుంటాయి. గెలిచిన జట్టు భారత్‌తో ఫైనల్లో తలపడుతుంది.


