IND vs AFG: భారత్‌కు భారీ షాక్‌.. అఫ్గన్‌ అనూహ్య విజయం | IND A vs AFG A ODI: Afghanistan Beat India By 4 Runs | Sakshi
Sakshi News home page

IND vs AFG: భారత్‌కు భారీ షాక్‌.. అఫ్గన్‌ అనూహ్య విజయం

Jun 11 2026 6:10 PM | Updated on Jun 11 2026 7:18 PM

IND A vs AFG A ODI: Afghanistan Beat India By 4 Runs

PC: BCCI

ముక్కోణపు వన్డే సిరీస్‌లో భారత్‌- ‘ఎ’ జట్టుకు ఊహించని షాక్‌ తగిలింది. అఫ్గనిస్తాన్‌- ‘ఎ’ జట్టుతో గురువారం నాటి మ్యాచ్‌లో తిలక్‌ వర్మ సేన ఓటమి పాలైంది.

తొలుత ఆతిథ్య శ్రీలంక- భారత్‌ మధ్య మ్యాచ్‌ జరుగగా.. భారత్‌ ఎనిమిది పరుగుల స్వల్ప తేడాతో గెలిచింది. ఈ క్రమంలో గురువారం అఫ్గన్‌తో తలపడ్డ భారత జట్టు.. దంబుల్లాలో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగింది. 

అదరగొట్టిన భారత బ్యాటర్లు
గత మ్యాచ్‌లో విఫలమైన ఓపెనర్లు ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌,  వైభవ్‌ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) ఈసారి అదరగొట్టారు. ప్రభ్‌సిమ్రన్‌ 69 బంతుల్లో 84 పరుగులు సాధించగా.. వైభవ్‌ సూర్యవంశీ 22 బంతుల్లోనే 44 పరుగులతో దుమ్ములేపాడు.

మూడో స్థానంలో వచ్చిన ప్రియా​న్ష్‌ ఆర్య (8) విఫలం కాగా.. నాలుగో నంబర్‌ బ్యాటర్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ 80 బంతుల్లో 66, కెప్టెన్‌ తిలక్‌ వర్మ 73 బంతులు ఎదుర్కొని 66 పరుగులు సాధించారు. 

మిగతా వారిలో ఆయుశ్‌ బదోని డకౌట్‌ కాగా.. సూయాన్ష్‌ షెడ్గే (40) మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. అర్షద్‌ ఖాన్‌ (1), విప్రాజ్‌ నిగమ్‌ (8) ఇలా వచ్చి అలా వెళ్లారు. అనుకుల్‌ రాయ్‌ 16 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.

349 పరుగుల భారీ స్కోరు
ఇక వర్షం వల్ల ఈ మ్యాచ్‌ను 49 ఓవర్లకు కుదించగా.. భారత్‌ నిర్ణీత ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 349 పరుగుల భారీ స్కోరు సాధించింది. అఫ్గనిస్తాన్‌ బౌలర్లలో అబ్దుల్లా అహ్మద్జాయ్‌ ఐదు వికెట్లతో అదరగొట్టగా.. ఫర్మానుల్లా సఫీ మూడు వికెట్లు, కెప్టెన్‌ ఇమ్రాన్‌ మిర్‌ ఒక వికెట్‌ పడగొట్టారు.

పదే పదే ఆటంకం
అనంతరం అఫ్గన్‌ లక్ష్య ఛేదనకు దిగగా వరణుడు మరోసారి ఆటంకం కలిగించాడు. దీంతో డక్‌వర్త్‌ లూయీస్‌ పద్ధతి ప్రకారం.. అఫ్గన్‌ లక్ష్యాన్ని 38 ఓవర్లలో 294 పరుగులుగా నిర్దేశించారు. ఈ క్రమంలో ఓపెనర్లు ఇమ్రాన్‌ మిర్‌, హసన్‌ ఐసాఖిల్‌ అఫ్గన్‌కు శుభారంభం అందించారు.

ఇమ్రాన్‌ 70 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లు బాది 75 పరుగులతో అజేయంగా నిలవగా.. హసన్‌ 29 బంతుల్లో 34 పరుగులతో ఫర్వాలేదనిపించాడు. వన్‌డౌన్‌ బ్యాటర్‌ ఖలీద్‌ తనీవాల్‌ (2) మాత్రం విఫలమయ్యాడు. అయితే, ఓపెనర్‌ ఇమ్రాన్‌కు తోడుగా బహీరీ షా పట్టుదలగా క్రీజులో నిలబడ్డాడు.

సారథితో పాటు పట్టుదలగా నిలబడ్డ బహీర్‌
బహీర్‌ 52 బంతులు ఎదుర్కొని ఐదు ఫోర్ల సాయంతో 51 పరుగులతో ఇమ్రాన్‌తో కలిసి అజేయంగా నిలిచాడు. అయితే, అఫ్గనిస్తాన్‌ ఇన్నింగ్స్‌లో 25.5 ఓవర్లు పూర్తైన తర్వాత మరోసారి వర్షం ఆటంకం కలిగించింది. అప్పటికి అఫ్గన్‌ రెండు వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది.

భారత్‌ ఓటమి
అయితే, ఆ తర్వాత వర్షం మరింత ఎక్కువైంది. దీంతో డక్‌వర్త్‌ లూయీస్‌ పద్దతి ప్రకారం నిర్ణీత ఓవర్లలో భారత్‌ కంటే అఫ్గన్‌ జట్టు ఆధిక్యంలో నిలిచినట్లయింది. ఈ క్రమంలో అఫ్గనిస్తాన్‌ను విజేతగా ప్రకటించారు. భారత్‌పై అనూహ్య రీతిలో నాలుగు పరుగుల స్వల్ప తేడాతో అఫ్గనిస్తాన్‌ విజయం సాధించింది.

ఇక ఈ మ్యాచ్‌లో భారత బౌలర్లు అర్షద్‌ ఖాన్‌, అనుకుల్‌ రాయ్‌ తలా ఒక వికెట్‌ దక్కించుకున్నారు. ఇదిలా ఉంటే.. ఈ ట్రై సిరీస్‌లో రెండు మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న భారత్‌ ఒక గెలుపు, ఒక ఓటమి నమోదు చేసింది. 

మరోవైపు.. అఫ్గన్‌ ఆడిన ఒక్కటీ గెలిచి రెండు పాయింట్లతో పట్టికలో ప్రథమ స్థానంలో నిలవగా.. భారత్‌ ఖాతాలో రెండు పాయింట్లు ఉన్నప్పటికీ నెట్‌రన్‌రేటు పరంగా వెనుకబడి రెండో స్థానంలో ఉంది. ఆడిన ఒక్క మ్యాచ్‌లో ఓడిన లంక చివరి స్థానంలో నిలిచింది.

చదవండి: భారత జట్టులోకి ద్రవిడ్‌ కుమారుడు

Advertisement
 
Advertisement
Advertisement